ఆదాల అసహనం…ఎవరికి నష్టం..?

నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి అస్సలు అచ్చిరావడం లేదు. ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తొలగడం లేదు. ముఖాముఖి తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడి వెళుతుండటం టీడీపీకి మైనస్. గత ఎన్నికల్లోనూ అరకొర సీట్లు సాధించిన టీడీపీ ఈసారి కూడా అప్పనంగా వైసీపీ చేతుల్లోకి అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పజెప్పేటట్లే కన్పిస్తోంది. ఆనం పార్టీ వీడి వెళ్లిన తర్వాత ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ అయ్యారు.

ఆదాల పార్టీని వీడకుండా……

ఇప్పుడు ఆనం వెళ్లిపోవడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ వీడి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా జిల్లా మంత్రులు ఈమేరకు కలసికట్టుగా పనిచేయడానికి నడుంబిగించాల్సి ఉంది. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు వద్ద పెరుగుతున్న ఆదరణను ఓర్వలేని మంత్రులు తమ చేతులకు పనిచెప్పేశారు. ముఖ్యంగా మంత్రి సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు ఆదాల విషయంలో తగ్గి వ్యవహరించాల్సి ఉండగా మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీంతో సోమిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డిలు పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

చంద్రబాబును కలసి…….

ఆదాల ప్రభాకర్ రెడ్డి త్వరలోనే సీఎం చంద్రబాబును కలసి తన పరిస్థితి ఏమిటన్నది తేల్చుకునేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. నెల్లూరు రూరల్ ఇన్ ఛార్జిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గ బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే దీనిని గత ఎన్నికల్లో ఆత్మకూరులో టీడీపీ తరుపున పోటీ చేసిన కన్నబాబు దీక్షకు దిగడానికి కారణం సోమిరెడ్డి అని ఆదాల గట్టిగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి తనను నియమించినా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఇప్పటికే సీఎంకు చెప్పినట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

కోవూరు నియోజకవర్గంలోనూ….

దీనికి కారణం సోమిరెడ్డి అని ఆదాల ముఖ్యమంత్రికి గట్టిగా చెప్పదలచుకున్నారు. కోవూరు నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి, టీడీపీనేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డికి పడటం లేదు. పోలంరెడ్డికి వ్యతిరేకంగా చేజర్ల పనిచేయడానికి సోమిరెడ్డి కారణమంటున్నారు. దీంతో కోవూరు జిల్లా పార్టీ నేతలు కూడా చంద్రబాబును కలిసేందుకు సిద్ధమయ్యారు. బూత్ కమిటీలు గతంలో ఉన్నా వారిని తొలగించి తన వారిని నియమించుకున్న పోలంరెడ్డిని చేజర్ల వ్యతిరేకిస్తున్నారు. పోలంరెడ్డి మాత్రం లెక్క చేయకుండా బూత్ కమిటీల నియామకాలను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో సోమిరెడ్డిపై ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. మొత్తం మీద ఆదాల మాత్రం తాను పార్టీలో ఉండాలా? వద్దా? అన్నది చంద్రబాబు నిర్ణయిస్తారని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడకుంటే నెల్లూరు జిల్లాలో సైకిల్ పార్టీ గల్లంతు కాక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*