ఆదాల రంకెలు…ఎందుకంటే….?

నెల్లూరు రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. మ‌రోసారి వేడెక్కాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా ఆరు మాసాల గ‌డువు ఉండగానే ఇక్కడి రాజ‌కీయాలు ర‌స‌కందాయంగా మారాయి. నెల్లూరు ఎంపీ టికెట్ విష‌యంలో నెల‌కొన్ని వివాదం అధికార టీడీపీలో స‌మ‌సిపోయింది. దీంతో ఇక్కడ క్లారిటీ వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థి తానేనని ఆదాల ప్రభాక‌ర్ రెడ్డి ప్రక‌టించారు. నిజానికి ఆయ‌న నిన్నమొన్నటి వ‌రకు కూడా చాలా వెనుక‌డుగు వేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ ఆయ‌న చ‌విచూసిన ఓట‌మిని ఆయ‌న ఇంకా జీర్ణించుకోలేక‌పోయారు. అయితే, ప‌రిస్థితులు ఏమ‌న్నా మెరుగుప‌డ్డాయా? అంటే అది కూడా లేదు. దీంతో ఆదాల వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌రాద‌ని నిర్ణయించుకున్నారు. దీనికితోడు ఆయ‌న‌కు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు.

హోరాహోరీ పోరు…..

ఇక‌, ఇప్పుడు స‌మీక‌ర‌ణ‌లు మారిపోయి.. ఆదాల పోటీకి సిద్ధమ‌నే సిగ్న‌ల్స్ వ‌చ్చాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు ఎంపీ స్థానంలో హోరా హోరీ పోరు ఖాయ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు ఎంపీ టికెట్ కోసం టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగారు ఆదాల‌. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి పోటీలోకి దిగారు. అప్పటికే వ‌రుస విజ‌యాల‌తో ఉన్న మేక‌పాటిని ఎలాగైనా ఓడించి తీరాల‌ని ఆదాల ప‌ట్టుబ‌ట్టారు. అనుకున్న విధంగానే ఆయ‌న ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే హోరాహోరీగా సాగిన పోరులో .. దాదాపు 47% ఓట్లు సాధించినా.. ఆదాల రెండో స్థానానికే ప‌రిమిత‌మ‌య్యారు. దాదాపు చివ‌రి నిముషం వ‌ర‌కు కూడా ఆయ‌నే గెలుస్తార‌ని అంద‌రూ భావించారు.

నువ్వా…నేనా…? అనే రేంజ్ లో…..

5,76,396 ఓట్లు మేక‌పాటికి వ‌స్తే.. 5,62,918 ఓట్లు ఆదాలకు ప‌డ్డాయి. ఇలా నువ్వా-నేనా అనే రేంజ్‌లో సాగిన పోరులో ఆదాల వెనుక‌బ‌డ్డారు. అయితే, తిరిగి పుంజుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని ఆయ‌న టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న నెల్లూరు లోక్‌స‌భ స్థానంతో పాటు నెల్లూరు రూర‌ల్ లేదా ఆత్మకూరు నుంచి కూడా పోటీ చేస్తే ఎలా ఉంటుంద‌న్న చ‌ర్చలు జ‌రిగాయి. చివ‌ర‌కు ఆయ‌న్ను తిరిగి ఎంపీగానే పంపాల‌ని అధిష్టానం డెసిష‌న్ తీసుకోవ‌డం….. ఇటు ఆదాల కూడా ఎంపీగా పోటీ చేసేందుకే మొగ్గు చూప‌డంతో క్లారిటీ వ‌చ్చేసింది.

ఇప్పటి నుంచే ప్రచారంలోకి…..

ఇక‌, త‌న అభ్యర్థిత్వం దాదాపు ఖ‌రారు కావ‌డంతో ఆదాల‌.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉన్న స‌మ‌స్యల‌ను ఆయ‌న అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఎంపీగా ఉండి కూడా మేక‌పాటి చేయ‌ని అభివృద్ధిని ఆయ‌న ప్రజ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాల‌ని నిర్ణయించిన‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యంలో బీజేపీకి వైసీపీ గులాం అయిపోయింద‌ని, ఈ క్రమంలోనే ఎంపీలు రాజీనామా చేసి .. అవిశ్వాసం నుంచి బీజేపీని ర‌క్షించార‌ని, వారికి నిజంగా రాష్ట్రంపై శ్రద్ధ ఉండిఉంటే.. పార్లమెంటులో నిల‌దీసి ఉండేవారిని, కానీ, మేక‌పాటి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. పారిపోయి వ‌చ్చాడ‌ని ఇలా పెద్ద ఎత్తున యాంటీ ప్రచారానికి ఆయ‌న రెడీ అవుతున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌లు ఇక్కడ కీల‌కంగా మారుతాయ‌ని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*