ఆదాల మాటే నెగ్గింది…..!

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆదాల ప్రభాకర్ రెడ్డిదే క్రమంగా పైచేయి అవుతుందా? మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభావం అధిష్టానం తగ్గించాలని చూస్తుందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడి వెళ్లడంతో ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ ఛార్జి పదవి ఖాళీ అయింది. అయతే ఈ ఇన్ ఛార్జి పదవిని గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కన్నబాబు ఆశించారు. అయితే ఆయనకు ఇవ్వకుండా తాత్కాలిక ఇన్ ఛార్జిగా ఆదాలను నియమించడంతో కన్నబాబు ఏకంగా పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగి నిరసనను కూడా తెలియజేశారు. మంత్రి సోమిరెడ్డి జోక్యంతో ఆయన దీక్ష విరమించారు.

బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి……

ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడి వెళ్లిన తర్వాత బలమైన ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడకుండా చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నేరుగా చంద్రబాబు ఆయనతో టచ్ లోకి వెళ్లారు. అంతేకాకుండా ఆదాల సిఫార్సు చేసిన బొల్లినేని కృష్ణయ్యకు ఆత్మకూరు ఇన్ ఛార్జి పదవి ఇచ్చారని తెలుస్తోంది. బొల్లినేని కృష్ణయ్య గతంలో ఎమ్మెల్యేగా చేసిన కొన్నేళ్ల నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. ఆయన తన వ్యాపారాలకు పరిమిత మయ్యారు. అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ మేకపాటి గౌతమ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

బాబుతో జరిగిన సమావేశంలో…….

ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి గౌతమ్ రెడ్డిని ఓడించాలంటే కన్నబాబు సరిపోడన్నది ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం. అందుకే ఆయన నేరుగా బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, బొల్లినేని కృష్ణయ్యలు చంద్రబాబును కలిసి పరిస్థితిని రెండు రోజుల క్రితం వివరించారు. ఈ సమయంలోనే చంద్రబాబు బొల్లినేని కృష్ణయ్యను ఆత్మకూరు ఇన్ ఛార్జిగా నియమించినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపై ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించాలని, వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరులో టీడీపీ జెండా ఖచ్చితంగా ఎగరాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.

కన్నబాబుకు మరోసారి ఝలక్……

చంద్రబాబు నిర్ణయంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నబాబుకు అధిష్టానం షాక్ ఇచ్చినట్లయింది. గత నాలుగున్నరేళ్లుగా తాను నియోజకవర్గంలో పర్యటిస్తూ పట్టును పెంచుకుంటున్నానని, మధ్యలో ఆనం వచ్చి వెళ్లారని, ఇప్పుడు మరో కృష్ణుడిని తెరపైకి తెచ్చారని కన్నబాబు తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. తన నిరసనను మంత్రి సోమిరెడ్డికి ఫోన్లో చెప్పిన కన్నబాబు భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెబుతున్నారు. ఇటీవల కన్నబాబు తన సామాజిక వర్గం నేతలతో తిరుపతిలో ప్రత్యేకంగా సమావేశమై తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఇది శృతి మించకుండా ఉండేందుకే హడావిడిగా బొల్లినేనిని ఇన్ ఛార్జిగా నియమించాని సమాచారం. మేకపాటిని ధీటుగా ఎదుర్కొనే వ్యక్తి బొల్లినేని కృష్ణయ్యేనని స్థానిక టీడీపీ నేతలు చెబుతుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*