మంత్రి ఆది ఇలా కూడా చేస్తారా?

అధికారంలో ఉంటే అంతా తాము చెప్పినట్లే నడుస్తుందనుకుంటారు. చేసిన తప్పులు ఒప్పులుగా మారిపోతాయని భావిస్తారు. నంద్యాలలో కేశవరెడ్డి విద్యాసంస్థల తీరు ఇలాగే ఉంది. కేశవరెడ్డి విద్యాసంస్థల అధిపతి ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ముంచేశారు. తిరిగి చెల్లిస్తామన్న ఒప్పందం, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్లరూపాయలు కేశవరెడ్డి వసూలు చేశారు. ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసి నష్టపోయిన కేశవరెడ్డి చేతులెత్తేయడంతో ఆయనపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం కేశవరెడ్డి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో….

కేశవరెడ్డి విద్యాసంస్థలు మాత్రం యధాతధంగా నడుస్తున్నాయి. నంద్యాలలో కొన్నేళ్ల నుంచి ఈ తంతు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏడాది క్రితం నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కూడా కేశవరెడ్డి బాధితులు పెద్దయెత్తున ఆందోళనకు కూడా దిగారు. అందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత కూడా కేశవరెడ్డి బాధితుల గోడు ప్రభుత్వం పట్టించుకోలేదు. దాదాపు 270 కోట్ల రూపాయలను బాధితులకు చెల్లించాల్సి ఉంది. ఇటీవల అమరావతిలో ఒక బాధితుడు కుటుంబంతో సహా ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసిన సంగతి తెలిసిందే.

మంత్రి ఆది వెనకుండి…..

కేశవరెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు కావడంతో పోలీసులు ఈ కేసును పట్టించుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. సీబీఐకి అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నప్పటీకీ సీఐడీకి అప్పగించి ప్రభుత్వం చేతులుదులుపుకుంది. కేశవరెడ్డికి డిపాజిట్ల రూపంలో చెల్లించిన వారు ఎక్కువ మంది నంద్యాలకు చెందిన వారే ఉండటం గమనార్హం. దీంతో వీరు ఇటీవల నంద్యాలలోని కేశవరెడ్డి విద్యాసంస్థల ఎదుట ఆందోళనకు దిగారు. అడ్మిషన్లను అడ్డుకునే ప్రయత్నంచేశారు. తమ డబ్బులు చెల్లించిన తర్వాతే అడ్మిషన్లు జరగాలని వారు పట్టుబడుతున్నారు.

బెదిరిస్తున్నారంటూ….

అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యాసంస్థల ఎదుట ఆందోళన చేస్తున్న తమను మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు వచ్చి బెదిరించారని అంటున్నారు. పోలీసులకు తాము సమాచారమిస్తే మంత్రి ఫోన్ చేయడంతో పోలీసులు వారిని వదిలిపెట్టారంటున్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ కేశవరెడ్డి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరగనీయబోమని వారంటున్నారు. ఇందుకు వైసీపీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. ఛీటింగ్ పేరుతో అరెస్ట్ చేసిన కేశవరెడ్డికి మంత్రి అండగా ఉండి అన్నీ నడిపిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేశవరెడ్డి వివాదం ప్రభుత్వానికి మరోసారి తలనొప్పిగా మారే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*