తగ్గేదెవరు….??

adinarayanareddy vs ramasubbareddy

జమ్మలమడుగు పంచాయతీ తేలేట్లు కన్పించడం లేదు. పక్షం రోజుల నుంచి వరుసగా మూదు సార్లు స్వయంగా చంద్రబాబు పంచాయతీ చేసినా జమ్మలమడుగు సమస్య మాత్రం సాల్వ్ కాలేదని, కాబోదని స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరూ పిడి వాదనకు దిగడంతో ఇక జమ్మల మడుగు సమస్యను చంద్రబాబు ఏ రకంగా పరిష్కరిస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎన్నికలకు ముందు జమ్మల మడుగు నియోజకవర్గంలో ఎలాంటి సీన్ ఉందో అదే సీన్ నేడు కన్పిస్తోంది. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గాలు తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధం అవుతున్నాయి.

తొలినుంచి పార్టీని…..

ఒకరు తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారు. మరొకరు అధినేతపై విశ్వాసంతో వేరొక పార్టీ నుంచి వచ్చిన వారు. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య వైరం ఈనాటిది కాదు. దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వైరానికి ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిన వెంటనే ఫుల్ స్టాప్ పడుతుందనుకున్నారు. కాని కొద్దిరోజులు ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అవి మరింత రాజుకుంటున్నాయి. రామసుబ్బారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తాను జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానని భీష్మించుకుని కూర్చుని ఉన్నారు. తాను ఇక్కడ పోటీ చేయకుంటే తన వర్గం అంటూ ఏమీ మిగలదని, తన కుటుంబ చరిత్ర సమాధి అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిట్టింగ్ ను నేనంటూ….

మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా తానే మళ్లీ బరిలోకి దిగుతానని చెబుతున్నారు. తాను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తానన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేస్తున్నారు. తనకంటూ నియోజకవర్గంలో ఒక వర్గం ఉందని, తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచి ఎలా వెళ్లిపోతానని అనుకంటున్నారని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ గా రామసుబ్బారెడ్డికి ఇంకా పదవీకాలం ఉంది కాబట్టి ఆయన పోటీ చేస్తేనే సబబుగా ఉంటుందని సలహాలు ఇస్తున్నారు. దీంతో ఇద్దరూ జమ్మలమడుగుపై బెట్టు వీడరని దాదాపుగా తేలిపోయింది. చంద్రబాబు వద్ద ఈ పంచాయతీ తేలుతుందా? లేదా? అన్నది కూడా సందేహమే నంటున్నారు.

ఒకరికి టిక్కెట్ ఇస్తే….

ఇద్దరిలో ఏ ఒక్కరికి జమ్మలమడుగు టిక్కెట్ కేటాయించినా విభేదాలు మరింత ముదిరి ఒకరిని ఒకరు ఓడించుకోవడం ఖాయం. ఇది చంద్రబాబుకు తెలియందికాదు. అందుకే మధ్యే మార్గంగా ఒకరిని ఎంపీగా, మరొకరిని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతిపాదన ఉంచారు. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ ఆయన ఎదుట ఓకే చెప్పినా ఎమ్మెల్యే టిక్కెట్ తనదేనని ఇద్దరూ చెబుతుండటం పార్టీ అధినేతకు మింగుడుపడటం లేదు. విభేదాలు మరింత రచ్చకెక్కక ముందే మరోసారి ఇద్దరినీ కూర్చో బెట్టి చర్చించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఈ సమస్య కు పరిష్కారం లభిస్తుందా? లేదా? అన్నదికాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*