ఏంటో దుమ్ము దులిపేస్తారట …!

ఎపి ప్రత్యేక హోదా సాధన సమితి ఇక దుమ్ము దులిపేస్తామంటోంది. ఇప్పుడు అన్నీ మెరుపు నిర్ణయాలు, మెరుపు ఉద్యమాలే అని కేంద్ర సర్కార్ కి అల్టిమేటం జారీ చేసింది. ఎప్పుడు ఏమి చేస్తామో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేక హోదా ఉద్యమం ఇక తారాస్థాయికి చేరుకుందని కూడా ప్రకటించేసింది. ఇక మోడీ సర్కార్ దిగి రావడమే ఆలస్యం అంటూ శంఖారావం పూరించేసింది.

అమరావతి రౌండ్ టేబుల్ లో …

అమరావతిలో ప్రత్యేక హోదా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశాన్ని అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న నేతలు హోదా కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హోదా ఉద్యమం గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలని మెరుపు నిర్ణయాలతో ఉద్యమం హోరెత్తిపోవాలని తీర్మానించింది. తమ పోరాటం వల్లే చంద్రబాబు సైతం ప్యాకేజి వదిలి హోదా బాట పట్టరాని సదస్సులో నేతలు పేర్కొన్నారు. ఇక కర్ణాటక ఎన్నికల్లో సైతం ఎపి ప్రత్యేక హోదా ఒక అంశంగా చేయగలిగామని సాధన సమితి అంటుంది.

ఆగస్టు లోగా వస్తే వచ్చినట్లు …

ఈ సదస్సులో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం ఇస్తే ఆగస్టు లోగా ప్రకటిస్తుందని లేదా లేనట్లేనని రామకృష్ణ అంచనా వేశారు. ఆగస్టు తరువాత రాజకీయ పార్టీలన్నీ హోదా అంశం పక్కన పెట్టి పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళతాయని ప్రజలను మభ్య పెట్టడం ఎలా అనే పనిలో బిజీ అయిపోతాయని లెక్కేశారు. కనుక హోదా పోరాటాన్ని తక్షణం తీవ్రం చేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టవని తేల్చేశారు. ప్రత్యేక హోదా పై ఉద్యమం ఇక కొత్త పుంతలు తొక్కేలా సాగనుందని హోదా సాధన సమితి ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు వారు తీసుకోనున్నారా అన్న ఆసక్తి అన్ని వర్గాల్లో ఎదురౌతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*