పటేల్ ను దింపారు…!!!

ఒకవైపు టిక్కెట్ల లొల్లి కొనసాగుతోంది. మరోవైపు మహాకూటమిలో మంతనాలు ఊపందుకున్నాయి. ప్రజలకు చేరువ అయ్యే వ్యూహాల్లో జట్టుకట్టిన మిత్రులు ఇంకా తుది అంచనాకు రాలేదు. కసరత్తు దశను దాటలేదు. కూటమికి కాసింత ఊపు తెచ్చేందుకు గాను అగ్రనాయకులను రంగంలోకి దింపాలని కాంగ్రెసు, టీడీపీ భావిస్తున్నాయి. అసమ్మతులు, నిరసనలు, ఆందోళనలు యథాతథంగా కొనసాగుతున్నాయి. కొంచెం బలమున్న నాయకులు రెబల్స్ గా రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టిక్కెట్లు రానప్పుడు పార్టీలో ఉండీ ప్రయోజనం లేదని కాంగ్రెసు సీనియర్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు లోలోపల ఆగ్రహంతో అట్టుడికిపోతున్నప్పటికీ పైకి చెప్పుకోలేకపోతున్నారు. అధిష్టానం మందలిస్తుందనే భయం వారిని వెన్నాడుతోంది. కాంగ్రెసులో మాత్రం కట్టుతప్పిన క్రమశిక్షణ బహిరంగంగానే కనిపిస్తోంది. వీటన్నిటినీ మరుగుపరిచి మహాకూటమి వైపు ప్రజలను మళ్లించే బృహత్ ప్రణాళిక దిశలో పెద్దలు పథక రచన చేస్తున్నారు.

అహ్మద్ పటేల్ అరంగేట్రం…

తెలంగాణ కాంగ్రెసులో సీనియర్లను బుజ్జగించడం ఇప్పుడు తక్షణ అవసరంగా మారింది. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ పవర్ పుల్ నాయకులకు కొరత లేదు. పార్టీలో భిన్నమైన వర్గాలు ఉండటంతో ప్రతి నాయకుడు ఎంతో కొంతమేరకు క్యాడర్ ను మెయింటెయిన్ చేస్తుంటారు. గడచిన అయిదు సంవత్సరాలుగా వీరే పార్టీ నిర్వహణ ఖర్చులనూ భరించారు. ఇప్పుడు కూటమి నేపథ్యంలో కీలకమైన నియోజకవర్గాల్లో సీట్లు తారుమారయ్యాయి. పార్టీలో తమకు ప్రత్యర్థులైన వర్గానికి సీటు వస్తేనే సహించలేక రోడ్డు ఎక్కే సంప్రదాయం కాంగ్రెసు నేతల్లో ఉంది. పార్టీకికాకుండా కొత్తగా జట్టు కట్టినవారికి సీటు రావడం అంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. టిక్కెట్టు తెచ్చుకున్నవారికి సహకరించేది లేదని తెగేసి చెప్పేస్తున్నారు. పార్టీకి చావోరేవో అన్నట్లుగా తయారైన ఈ ఎన్నికలో గెలుపు అనేది పార్టీకి చాలా అవసరం. సీట్ల కేటాయింపులోనే విక్రయాలు సాగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో పార్టీ ఇన్ చార్జులపై క్యాడర్, లీడర్లకు నమ్మకం పోయింది. దీంతో సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ రంగప్రవేశం చేస్తున్నారు. ఆయన అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడు. అసంతృప్త నాయకులను బుజ్జగించడం , వారికి పదవులపై హామీలు ఇవ్వడం వంటి చర్యల ద్వారా ఎన్నికల రంగాన్ని సిద్ధం చేయాలనేది అహ్మద్ పటేల్ కు అప్పగించిన బాధ్యత.

జంటతో జయం…

టీడీపీ, కాంగ్రెసు అధినాయకులను ప్రచార రంగంలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని కూటమి భావిస్తోంది. రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడులు కలిసి కట్టుగా ప్రచారం చేయాలని వినతులు పంపారు. ఇది వినూత్నప్రయోగమే. పెద్ద నాయకులిద్దరూ చేతులు కలిపి బహిరంగంగా కనిపించడం క్యాడర్ లో జోష్ నింపుతుంది. వర్గ విభేదాలు, కూటమి కొట్లాటలతో కుమ్ముకుంటున్న పార్టీ శ్రేణులు, నాయకులకు గట్టి సందేశం ఇచ్చినట్లవుతుంది. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూ గెలిపించుకోవాలనే సంకేతాన్ని కార్యకర్తలకు పంపినట్లవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రాహుల్, చంద్రబాబులు రోడ్డు షో నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ ర్యాలీ, రోడ్డు షో ను హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలకు పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 నియోజకవర్గాలను ప్రభావితం చేసేలా వీరి పర్యటనను రూపొందించాలని భావిస్తున్నారు. హైదరాబాదు నగరంలో టీడీపీ, కాంగ్రెసులు బలమైన పార్టీలు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ సీట్లను ఇక్కడ్నుంచే గెలుచుకుంది. తర్వాత బలహీనపడినప్పటికీ సీమాంధ్రప్రాంతాల నుంచి తరలివచ్చిన ఓటర్లు లక్షల్లోనే ఉన్నారు. తాజాగా కాంగ్రెసుతో చేతులు కలిపిన తర్వాత ఓట్ల పోలరైజేషన్ తో మళ్లీ కూటమి పుంజుకొంటుందని అంచనా. తద్వారా తిరిగి టీడీపీ తన సంప్రదాయ ఓటు బ్యాంకును చేజిక్కించుకుంటుందని భావిస్తున్నారు. రాహుల్, చంద్రబాబుల పర్యటన ఇందుకు దోహదం చేస్తుందనే ఆశాభావంతో నాయకులు ఎదురుచూస్తున్నారు.

కులం కార్డు…

తాజా ఎన్నికల్లో కులం కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెసు వెన్నుదన్నుగా ఉంటోంది. ఎస్సీ,ఎస్టీలను సైతం ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఈ వర్గాల ప్రజలకు మూడు ఎకరాల భూమి ఇస్తామంటూ టీఆర్ఎస్ చేసిన హామీ నెరవేర్చకపోవడం ప్రధానాస్త్రంగా మారింది. గతంలో సంప్రదాయకంగా ఆయా వర్గాలు కాంగ్రెసుకు అండగా ఉంటుండేవి. ఉద్యమ నేపథ్యంలో 2014లో మాత్రం టీఆర్ఎస్ ఈ ఓటు బ్యాంకును చీల్చుకుని విజయం సాధించింది. కూటమికి ఆయా కులాలు మళ్లీ అండగా నిలిచేలా వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెసులో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన బలమైన నాయకులున్నారు. టీఆర్ఎస్ లో మాత్రం అంతబలమైన ఎస్సీ నాయకత్వం కనిపించదు. దీనిని అడ్వాంటేజ్ గా మలచుకోవాలని కాంగ్రెసు చూస్తోంది. కులం కార్డును పైకి తీస్తోంది. రాహుల్ సన్నిహితుడైన కొప్పుల రాజు నేత్రుత్వంలో ఇప్పటికే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలపై యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. అదే విధంగా మిగిలిన నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లను సంఘటితం చేసేందుకు ప్రచార కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నారు. మొత్తమ్మీద రానున్న వారం కూటమి ప్రస్థానం కీలకం కాబోతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*