జోగి వారికి జోల పాడుతున్నారే…..!!!

ఛత్తీస్ ఘడ్ జనతా కాంగ్రెస్ (జేసీసీ) అధినేత అజిత్ జోగి ఆషామాషీ నేత కాదు. సుదీర్ఘ అనుభవశాలి. రాజకీయరంగంలో ఆరితేరిన దిట్ట. పూర్వాశ్రమంలో జిల్లా కలెక్టర్, తదనంతరం రాజకీయ వాదిగా జోగి రూపాంతరం చెందారు. రాజకీయ రంగంలో కూడా రాణించారు. రాజ్యసభ సభ్యుడిగా, లోక్ సభ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్గజం. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ,కాంగ్రెస్ ల మధ్య మూడోశక్తిగా దూసుకొచ్చారు. బీఎస్పీతో పొత్తు వల్ల ప్రధాన పార్టీల ఓట్లు చీల్చవచ్చని అంచనా వేస్తున్నారు. త్రిశంకు సభ ఏర్పడితే కింగ్ మేకర్ అవుతానని, కర్ణాటకలో మరో కుమారస్వామి మాదిరిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగలనన్న ఆశాభావంతో అడుగులు వేస్తున్నారు.

ఐఏఎస్ అధికారి నుంచి…..

సాత్నామి గిరిజన కుటుంబంలో 1946 ఏప్రిల్ 29న జన్మించిన జోగీ ఉన్నత విద్యావంతుడు. ఉమ్మడి మధ్యప్రదేశ్ లో ప్రాధమిక విద్య పూర్తి చేశారు. భోపాల్ లోని ప్రతిష్టాత్మకమైన మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. ఇంజినీరింగ్ లో బంగారు పతకాన్ని సాధించిన జోగి రాయపూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో కొద్దికాలం అధ్యాపకునిగా పనిచేశారు. అనంతరం అత్యున్నతమైన సివిల్ సర్వీసుకు ఎంపికయ్యారు. 1981-1985 మధ్యకాలంలో ఉమ్మడి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కలెక్టర్ గా పనిచేశారు. అనంతరం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1986లో రాజ్యసభకు ఎన్నికై రెండు దఫాలు అంటే 1998 వరకూ పనిచేశారు. ఎగువ సభ సభ్యుడిగా ఉంటూనే పీసీీసీ ప్రధాన కార్యదర్శిగా, కేంద్రంలో ప్రభుత్వరంగ సంస్థల కమిటీ సభ్యుడిగా పని చేశారు. అనంతర కాలంలో పార్టీలో వివిధ పదవులు సమర్థంగా నిర్వహించి అధినేతల దృష్టిలో పడ్డారు. 1995లో సిక్కిం అసెంబ్లీ పరిశీలకుడిగా, 1997లో ఢిల్లీ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడిగా వివిధ బాధ్యతలను నిర్వహించారు. 2000లో ఏఐసీసీ అధికార ప్రతినిధిగా, మధ్యప్రదేశ్ పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు.

రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా…..

2000 సంవత్సతరంలో అప్పటి ప్రధాని వాజ్ పేయి హయాంలో ఉమ్మడి మధ్యప్రదేశ్ ను విభజించి ఛత్తీస్ ఘడ్ ను ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి పేరు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. 2000-2003 మధ్య కాలంలో జోగి సీఎంగా పనిచేశారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో జోగీ రాజకీయ జీవితం చిక్కుల్లో పడింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో మహా సమంద్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి చందూలాల్ సాహూ చేతిలో కేవలం 133 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తదనంతర కాలంలో కాంగ్రెస్ తో విభేదాలు ఏర్పడ్డాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో ఆయనను బహిష్కరించారు. దీంతో 2016 జూన్ 6న ఛత్తీస్ ఘడ్ జనతా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని అజిత్ జోగీ ప్రారంభించారు.

కింగ్ మేకర్ అవ్వాలని…..

ప్రస్తుతం బీఎస్పీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. జోగి పార్టీ 55, బీఎస్పీ 35 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. జోగీ కుటుంబంలోనూ రాజకీయ వైరుద్ధ్యాలున్నాయి. ఆయన భార్య రేణు జోగి నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండటం విశేషం. సీఎల్పీ ఉప నాయకురాలిగా కూడా పనిచేశారు. తాజాగా బిలాన్ పూర్ జిల్లాలోని “కోట” నియోజకవర్గం టిక్కెట్ ను కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భర్త పార్టీ తరుపున బరిలోకి దిగుతున్నారు. కోడలు రిచా “అకల్తారా” నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కుమారుడు అమిత్ మాజీ ఎమ్మెల్యే. ఆయన “మార్వాహి” నుంచి జేసీసీ తరుపున పోటీ చేస్తున్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే జోగీ సీఎం అవుతారని మాయావతి ప్రకటించినప్పటికీ ఆ పరిస్థితి లేదు. గత మూడు ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 2 శాతం మాత్రమే. జోగీ ఓట్లను చీల్చడం వల్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్ నష్టపోయిన మాట వాస్తవం.

సోనియా అల్లుడితో విభేదాలు…..

హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న అంచనాల్లో ఉన్న జోగి ఎందుకైనా మంచిదన్న ముందుచూపుతో కాంగ్రెస్ పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరికీ పూర్తి స్థాయి ఆధిక్యం రాకపోతే కర్ణాటకలో కుమారస్వామి మాదిరిగా తాను ముఖ్యమంత్రిని కావచ్చన్నది ఆయన ఆలోచన. అందుకే కాంగ్రెస్ పైనే తన పోరాటమని, గాంధీ కుటుంబంపై ఎలాంటి విమర్శలు చేయనని బహిరంగంగా జోగీ ప్రకటించడం విశేషం. “బీఎస్పీతో పొత్తు ఉన్నప్పటికీ, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడను. ఎందుకంటే వారునన్ను ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉన్నారు” అని జోగీ తాజా వ్యాఖ్యలు ముందు చూపుతో చెప్పినవే. వాస్తవానికి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాతో కొన్ని విభేదాలున్నాయి. అయితే ఈ విషయాన్ని ఎక్కడా బహిరంగంగా చెప్పడం లేదు. మొత్తం మీద ఏడు పదులకు పైగా వయస్సున్న జోగీకి ఇవే ఆఖరి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో విజయవంతం కానట్లయితే ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలకడం అనివార్యం. లేనట్లయితే కాంగ్రెస్ లో మళ్లీ చేరడం తప్పనిసరి కావచ్చు. వచ్చే నెల 11న జోగీ రాజకీయ భవితవ్యం ఏమిటో తేలనుంది….!!!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*