ఆళ్ల‌గ‌డ్డ పంచాయితీకి మంత్రి అఖిల ఎస్కేప్‌!

లేటుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. రాజ‌కీయాల ప‌ర్య‌వ‌సానాన్ని, సారాన్ని ఒంట‌బ‌ట్టించుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపి స్తున్నాయి.. క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రాజ‌కీయ కుటుంబం దివంగ‌త‌ భూమా నాగిరెడ్డి వార‌సురాలు, మంత్రి అఖిల ప్రియ విష‌యంలో!! త‌ల్లి భూమా శోభ ఉన్న‌న్నాళ్లు రాజ‌కీయాలంటే గిట్ట‌ని అఖిల ప్రియ‌.. ఆమె మ‌ర‌ణంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌ర్వాత త‌న తండ్రి ద‌గ్గ‌ర ఓన‌మాలు నేర్చుకున్న అఖిల‌.. అన‌తికాలంలోనే రాజ‌కీయ పెద్ద‌బాల శిక్ష‌లో ప్రావీణ్యం సంపాయించేశారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

తనదైన ముద్ర వేస్తూ…..

రాజ‌కీయ ఉద్ధండుల‌ను సైతం లెక్క‌చేయ‌ని త‌నం, త‌మ…మ‌న అనే విధాన‌మే లేకుండా అధికారం, నియోజ‌క‌వ‌ర్గం, రాజ‌కీయాలే ప్ర‌ధానంగా చేస్తూ.. గ‌డిచిన నాలుగు మాసాలుగా మంత్రి అఖిల ప్రియ రాజ‌కీయాల‌పై త‌న దైన ముద్ర వేస్తోంది. ఈ స‌మ‌యంలోనే ఆమె త‌న తండ్రి భూమాను సైతం మ‌రిపింప జేస్తోంద‌నే వ్యంగ్యాస్త్రాలు సైతం వెలువ‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న నియోజ‌క‌వ‌ర్గం ఆళ్ల‌గ‌డ్డ‌పై క‌న్నేసిన సొంత పార్టీ నేత, భూమాకు రైట్ హ్యాండ్‌గా వ్య‌వ‌హ‌రించి న‌ ఏవీ సుబ్బారెడ్డిపై క‌త్తిక‌ట్టారు. ఆయ‌న‌తో తీవ్రంగా విభేదించారు. తీవ్ర ఆరోప‌ణ‌లు సైతం చేశారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఏవీ సుబ్బారెడ్డి నిర్వ‌హించిన సైకిల్ యాత్ర‌పై అఖ‌ల అనుచ‌రులు రాళ్ల దాడి చేశారు.

బుధవారం పంచాయతీ ఉండగా……

ఈ ఘ‌ట‌న ఒక్క క‌ర్నూలు లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర అల‌జ‌డి రేపింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌రింత అగాథం ఏర్ప‌డింది. దీనిపై స్పందించిన చంద్ర‌బాబు.. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌ల‌ను పెట్టుకుని ఇప్పుడు ఇలా రోడ్డున ప‌డి కొట్టుకోవ‌డం స‌మంజ‌స‌మా? అంటూ ఫోన్‌లోనే స్థానిక జిల్లా ఇంచార్జ్ మంత్రికి క్లాస్ పీకారు. అంతేకాదు, ఏవీ, మంత్రి అఖిల‌ల‌ను త‌న వ‌ద్ద‌కు రావాల‌ని క‌బురు కూడా పంపారు. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు బుధ‌వారం చంద్ర‌బాబు అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. వారితో మాట్లాడి.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని భావించారు. అయితే, ఏవీ సుబ్బారెడ్డి బుధ‌వారం మ‌ధ్యాహ్నానికే అమ‌రావ‌తికి చేరుకున్నారు.

తనకు సమాచారం లేదంటూ….

మరోవైపు మంత్రి అఖిలప్రియ మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదంటూ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు. సీఎం కలవమని చెప్పిన ఒకరోజు ముందే ఇరువర్గాల మధ్య విభేదాలు మళ్లీ రచ్చకెక్కడం గమనార్హం. ఏవీ సుబ్బారెడ్డి సైకిల్‌ యాత్రపై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు చల్లారకముందే …మంగళవారం రాత్రి అఖిలప్రియ చేపట్టిన సైకిల్‌ యాత్ర అలాంటి వాతావరణాన్నే పునరావృతం చేసింది. అయితే పోలీసుల పర్యవేక్షణలో చివరకు సైకిల్‌యాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సీఎం అమ‌రావ‌తికి ర‌మ్మ‌ని క‌బురు పెట్టినా కూడా అఖిల ప్రియ రాక‌పోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీస్తోంది. దీనిని బ‌ట్టి క‌ర్నూలులో పార్టీ ప‌రువును ఎవ‌రు తీస్తున్నారో అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*