ఆళ్ల‌గ‌డ్డలో ఆరని చిచ్చు.. వైసీపీకి ప్ల‌స్‌…!

ఆ ఇద్ద‌రి మ‌ధ్య వార్‌.. ఇప్పుడు కోల్డ్ వార్‌గా మారింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు పంచాయితీలు పార్టీ అధినేత పెట్టినా ఇంకా ఆర‌ని చిచ్చులా ర‌గులుతూనే ఉంది. పైకి అంతా క‌లిసిపోయినట్లు ఉన్నా.. లోప‌ల మాత్రం విద్వేష జ్వాల‌ల‌తో ర‌గిలిపోతున్నారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు కూడా అప్పుడ‌ప్పుడూ క‌ల‌సినా.. మొహ‌మాటానికైనా ప‌ల‌క‌రించుకుంటారు. కానీ వీరిద్ద‌రూ ఒకే పార్టీలో ఉన్నా.. ఎవ‌రి రాజ‌కీయాలు వారివి. తండ్రి అనుచ‌రుడికీ, ఆమెకు మొద‌లైన పొలిటిక‌ల్ వార్ వ్య‌క్తిగ‌తంగా ఎలా ఉన్నా.. వీరిద్ద‌రి గ్రూపు రాజకీయాల వ‌ల్ల‌ పార్టీ ప‌రిస్థితి మాత్రం నానాటికీ దిగ‌జారిపోతోంద‌ని నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు. క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌ టీడీపీలో భూమా, ఏవీ వ‌ర్గాల గ్రూపు రాజ‌కీయాలు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తున్నా.. ఏమాత్రం త‌గ్గ‌లేదంటున్నారు నాయ‌కులు. ఫ‌లితంగా ఇద్ద‌రి మ‌ధ్య వైరం.. వైసీపీకి మ‌రింత లాభం చేకూర్చేలా ఉంద‌ని టీడీపీ నాయ‌కుల క‌ల‌ర‌వ పాటుకు గుర‌వుతున్నారు.

చంద్రబాబు సూచించినా….

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో.. ఆయ‌న అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డి, భూమా కూతురు అఖిల‌ప్రియ మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ మొద‌లైంది. నంద్యాల‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కించుకునేందుకు ఈ ఇద్ద‌రూ చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. చివ‌ర‌కు అఖిల‌ప్రియ ప‌ట్టు సాధించి.. అన్న బ్ర‌హ్మానంద‌రెడ్డికి సీటు ద‌క్కేలా చేసుకున్నారు. అప్ప‌టి నుంచి ఈ రెండు గ్రూపుల మ‌ధ్య‌ మ‌రింత‌గా విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. వీటికి తోడు అఖిల దూకుడికి క‌ళ్లెం వేసేందుకు ఏవీ సుబ్బారెడ్డి, ఆయ‌న్ను దెబ్బ‌కొట్టేందుకు అఖిల వ‌ర్గం.. వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. వీటిని ప‌రిష్క‌రించేందుకు సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగి.. రెండు వ‌ర్గాల‌తో మాట్లాడి, స‌మ‌ష్టిగా ప‌నిచేయాల‌ని సూచించినా, హెచ్చ‌రించినా ప‌రిస్థితిలో మాత్రం మార్పు రాలేదంటున్నారు ద్వితీయ శ్రేణి నాయ‌కులు.

ఇద్దరూ ఎవరికి వారే…..

క‌ర్నూలు జిల్లాలో ఆళ్ల‌గ‌డ్డ పంచాయితీ స‌మిసిపోయిన‌ట్టే క‌నిపించినా.. కేడ‌ర్ లో ఎటువంటి మార్పు మాత్రం క‌నిపించ‌డం లేదు. రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఏవీ సుబ్బారెడ్డి నియామ‌కం త‌ర్వాత ఇక్క‌డ పార్టీలో లుక‌లుక‌లు లేకుండా బాగానే ప‌నిచేస్తున్నారు అని అంతా భావిస్తున్నారు. అయితే ఇక్క‌డ ఏవీ వ‌ర్గం భూమా వ‌ర్గం ఎక్క‌డా క‌లిసి ప‌నిచేయడం లేదు. ఎవ‌రి వ‌ర్గం వారుగా ముందుకు వెళుతున్నారు. రెండుగా చీలిపోయి టీడీపీ త‌ర‌పున ఆళ్ల‌గ‌డ్డ‌లో ఏ కార్య‌క్రమం వ‌చ్చినా చేసుకుంటున్నారు. ఇటు భూమా అఖిల ప్రియ రాజ‌కీయంగా మంత్రిగా ఆళ్ల‌గ‌డ్డ‌లో త‌న హ‌వా చూపిస్తున్నారు.. ఇక ఏవీ కుమార్తె జ‌శ్వంత రెడ్డి కూడా తండ్రి సుబ్బారెడ్డి వెంటే ఎక్కువ రాజ‌కీయంగా ఉంటున్నారు. త‌న తండ్రిని సెంట‌ర్ చేశార‌ని అఖిల‌మీద గ‌తంలో ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆళ్ల‌గ‌డ్డ‌లో వైసీపీ త‌ర‌పున గంగుల ఫ్యామిలీ పొలిటిక‌ల్ గా ముందుకు వెళుతుంటే, టీడీపీలో మాత్రం ఎవ‌రికి వారు రాజ‌కీయం చేసుకుంటున్నారు.

ఏవీకి విషెస్ చెప్పకుండా……

ఇది స్ధానిక టీడీపీ క్యాడ‌ర్‌కు స‌మ‌స్య‌గా మారింది. ఏవీకి తాజాగా ప‌ద‌వి వ‌చ్చినా మంత్రి అఖిల మాత్రం ఆయ‌న‌కు విషెస్ తెలియ‌జేయ‌లేదు. మొత్తానికి వీరి మ‌ధ్య వార్ స‌మ‌సి పోవ‌డానికి మూడు సార్లు అమ‌రావ‌తిలో పంచాయితీ చేసినా.. లాభం లేదంటున్నారు ఆళ్ల‌గ‌డ్డ జనాలు. మొత్తానికి పొలిటిక‌ల్ గా వీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా డ్యామేజ్ మాత్రం టీడీపీకి ఇక్క‌డ ఎక్కువ‌గా ఉంటోంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రో ప‌క్క నంద్యాల‌లో కూడా సెగ్మెంట్లో అఖిల అన్న బ్ర‌హ్మ‌నంద‌రెడ్డికి వైసీపీ త‌ర‌పున శిల్పా ఫ్యామిలీ పొలిటిక‌ల్ గా ఉంటే, ఇటు తెలుగుదేశం త‌ర‌పున నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు స‌జ్జల శ్రీధ‌ర్ పోటీకి రెడీ అవుతున్నారు. ఇద్ద‌రూ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేసుకుంటున్నారు. భూమా ఫ్యామిలీకి ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల‌లో ఎదురుగాలి వీచే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*