ఇమడలేకపోతున్నారా…..???

ఇంతకీ మంత్రి అఖిల ప్రియ చుట్టూ ఏం జరుగుతోంది….. అఖిల టీడీపీలో ఇమడలేకపోతున్నారా…. టీడీపీనే అఖిల ప్రియను భారంగా భావిస్తోందా….. రెండు రకాల ప్రచారాలు అమరావతిలో జోరుగా సాగుతున్నాయి. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చారు. అంతగా ప్రాధాన్యత లేని పర్యాటక శాఖతో పాటు భాషా సాంస్క్రతిక వ్యవహారాల బాధ్యతను అఖిలకు అప్పచెప్పారు. అఖిలప్రియ సోదరుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇదంతా పైకి బాగానే ఉన్నా వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో ఇచ్చిన ప్రాధాన్యత చాలా రోజుల నుంచి అఖిలప్రియకు దక్కడం లేదు. అదే సమయంలో అఖిల ప్రియ తన దారి తాను చూసుకుంటున్నారనే ప్రచారం టీడీపీ శిబిరం నుంచి జరుగుతోంది. మంత్రి పదేపదే తాను పార్టీ మారడం లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు.

పదవి ఉన్నా లేనట్టే….

పర్యాటక శాఖ మంత్రిగా అఖిల ప్రియ ఉన్నా ఆమె మాట పెద్దగా చెల్లుబాటు కాదని ప్రచారం ఉంది. పర్యాటక శాఖలో ఏం జరగాలన్నా పెద్ద బాస్., చిన్నబాస్ ల కనుసన్నల్లోనే జరుగుతుంది. పర్యాటక శాఖ వ్యవహారాలన్ని ముఖ్యమంత్రో., లోకేష్ బాబో చక్కబెట్టేస్తుండటంతో మంత్రి కూడా మిన్నకుండిపోతున్నారు.

ఏ పనైనా అక్కడి నుంచే….

విజయవాడలో తొలిసారి నిర్వహిస్తోన్న ఫార్ములా వన్ పవర్ బోట్ రేసుల నిర్వహణ బాధ్యతలు మొత్తం జిల్లా కలెక్టర్ కు అప్పగించారు. దీంతో మంత్రి ఒక్కసారి కూడా విజయవాడ వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పవర్ బోట్ రేసులు నిర్వహించాలని అనుకున్నపుడు దాని నిర్వహణ బాధ్యతలు తాము చెప్పిన సంస్థకు అప్పగించాలని మంత్రి అఖిల ప్రియ టూరిజం అధికారులకు సూచించారని., వారు సీఎంకు ఫిర్యాదు చేయడంతో బెడిసి కొట్టిందని పర్యాటక శాఖ వర్గాల కథనం. మంత్రి అఖిల ప్రియ వర్గం మాత్రం దీనిని కొట్టి పారేస్తోంది. సీఎం దగ్గర మిగతా వాళ్లు పనిచేయడానికి ఏమి ఉండదని., బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ మాదిరి చంద్రబాబు వ్యవహరిస్తుంటే మంత్రులకు పని చేయడానికి ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా వన్ పవర్ బోట్ రేసుల నిర్వహణ మొత్తం అధికారులకు అప్పచెప్పి తమను బాధ్యుల్ని చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పర్యాటక శాఖ- జిల్లా కలెక్టర్ – మునిసిపల్ – రెవిన్యూ- పోలీస్ – ఈవెంట్ మేనేజర్లదే పెత్తనం నడిస్తే మంత్రి ఉంటే ఎంత లేకపోతే ఎంత అని నిర్లిప్తత వ్యక్తమవుతోంది. సిఎం వచ్చినపుడు పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిస్తే చాలన్నట్లు మంత్రి వ్యవహార శైలి ఉంటోందని చెబుతున్నారు.

పార్టీ మారిన ప్రతిఫలం…..

వైసీపీ నుంచి పార్టీ మారి మంత్రి పదవులు దక్కిన వారిని టీడీపీలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని వారు మదనపడుతున్నారు. అధికారులు సైతం వారిని ఖాతరు చేయరని., ఇదంతా పథకం ప్రకారమే జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అఖిల ప్రియ విషయంలో పార్టీ మారుతున్నారనే ప్రచారాలు కావాలనే చేస్తున్నారని చెబుతున్నారు. మంత్రి అఖిల ప్రియ వివాహం తర్వాత ఈ తరహా ప్రచారాలు ఎక్కువయ్యాయి. భార్గవ నాయుడుతో వివాహం జరగడం., పవన్ కళ్యాణ్ తో భూమా కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో అఖిల ప్రియ జనసేనలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి పదవిలో ఉండగా పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు ఉంటుందని., ఇదంతా ఇబ్బంది పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నమని అఖిల వర్గం అంటోంది. పదేపదే వివరణ ఇచ్చుకునే పరిస్థితి కల్పించడం ద్వారా చిన్నబుచ్చే ప్రయత్నమేనని మండిపడుతున్నారు. మరోవైపు అఖిలప్రియ వైసీపీ నేతలకు టచ్ లో ఉన్నారని., టీడీపీలో రెడ్డి సామాజిక వర్గానికి జరుగుతున్న అవమానాలతోనైనా వారికి కనువిప్పు కలగాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద భూమా అఖిల ప్రియ కేంద్రంగా సాగుతున్న వార్ ఎటు దారి తీస్తుందోననే ఆసక్తికరమైన చర్చ బెజవాడలో సాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*