అఖిలేష్ కథ అడ్డం తిరుగుతుందా?

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇప్పుడిప్పుడే హుషారు మీద ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇటీవల జరిగిన గొరఖ్ పూర్, ఫుల్ పూర్, కైరానా నియోజకవర్గాల్లో కూటమి గెలుపొందడంతో ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడుపుదామనుకుంటున్నారు. అందుకోసమే ఆయన లోక్ సభకు పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం చాలా ఉండటంతో అఖిలేష్ యాదవ్ పార్లమెంటుకు వెళ్లాలని భావిస్తున్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికలకు…..

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, కాంగ్రెస్ పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్లి మోడీని చిత్తుచిత్తుగా ఓడించాలని కలలు కంటున్నారు. కాని సొంత ఇంటి నుంచే ఆయనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అఖిలేష్ కు ఇదేమీ కొత్త కాదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కుటుంబంలో వివాదాలు తలెత్తాయి. అఖిలేష్ బాబాయి శివపాల్ యాదవ్ వేరు కుంపటిని పెట్టుకుంటానని హెచ్చరించారు. సోదరుడి బాటలోనే ములాయం సింగ్ యాదవ్ కూడా ప్రయత్నించడంతో అఖిలేష్ ఇబ్బందుల్లో పడ్డారు. చివరకు ములాయం సింగ్ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపి ఆ ఎన్నికలను ఎలాగాలో నెట్టుకు రాగలిగారు.

బాబాయ్ దెబ్బకు…..

కాని కుటుంబంలో విభేదాలు ఇంకా సమసి పోనట్లుంది. తాజాగా శివపాల్ యాదవ్ అఖిలేష్ యాదవ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. ఒకదశలో శివపాల్ యాదవ్ బీజేపీలోకి వెళతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన అటువైపు వెళ్లకుండానే పార్ఠీలోనే ఉండి అఖిలేష్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. పార్టీ నుంచి ములాయం సింగ్ తో సహా తనను తప్పించడాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేక పోతున్నట్లుంది. అందుకే ఆయన అఖిలేష్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ ఏరోజూ పెద్దల మాట వినలేదని శివపాల్ యాదవ్ అన్నారు.

బీజేపీ సెటైర్లు…..

పెద్దల మాట విని ఉంటే అఖిలేష్ మరోసారి ముఖ్యమంత్రి అయి ఉండేవారన్నారు. సమాజ్ వాదీ పార్టీని బలోపేతం చేయడంపై అఖిలేష్ దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. అయినా పార్టీకి అన్న కోసం అండగా ఉంటానని చెప్పారు. ఇలా అఖిలేష్ ఫ్యామిలీలో మరోసారి అగ్గి రాజుకుంది. శివపాల్ యాదవ్ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. సొంత కుటుంబంలోని విభేదాలనే చక్కదిద్దుకోలేని అఖిలేష్ యాదవ్ కూటమితో ముందుకొచ్చి ఉత్తరప్రదేశ్ ను ఉద్ధరిస్తాడట అంటూ సెటైర్లువేస్తున్నారు. మొత్తం మీద అఖిలేష్ యాదవ్ తొలుత కుటుంబంలోని విభేదాలను చక్కదిద్దుకోవాలని పలువురు సూచిస్తుండటం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*