అఖిలేష్ ‘‘ఇంటి’’ వారయ్యేదెప్పుడు?

ఉత్తరప్రదేశ్ లో ఇళ్లగోల మొదలయింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఇళ్లు దొరకడం లేదట. తనకు, తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నివసించడానికి లక్నోలో ఇళ్లు లేవని, ఒకవేళ ఉంటే వెతికి పెట్టండని అఖిలేష్ మీడియా మిత్రులను కోరారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈవీఎంలు సరిగా పనిచేయలేదన్న దానిపై అఖిలేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో ఎన్నికల కమిషన్ కూడా కొన్ని చోట్ల రీపోలింగ్ కు ఆదేశించింది. కైరానాతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో రీపోలింగ్ కు ఆదేశించింది.

ఇల్లు దొరకడం లేదు…..

అయితే తాను ఉండేందుకు లక్నోలో ఇల్లు దొరకడం కష్టంగా ఉందని, అందుకే తాను ఇల్లు కొనుక్కునే వరకూ ప్రభుత్వ బంగళా ఖాళీ చేయలేనని ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రులందరినీ ప్రభుత్వ బంగళాలు ఖాళీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మాత్రం బంగళాను ఖాళీ చేయడానికి సిద్ధమయ్యారు. మరోమాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి కుటుంబ సభ్యులు మాత్రం తివారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున కొంత సమయం కావాలని కోరారు.

మాయావతి చెప్పిన తర్వాతనే…..

ఇక మాయావతి మాత్రం తాను ఖాళీ చేయబోవడం లేదని కుండబద్దలు కొట్టేశారు. ప్రభుత్వ బంగళా కాదని, కాన్షీరామ్ గుర్తుగా ఉన్న బంగళాలో తాను ఉంటున్నానని ప్రభుత్వానికి లేఖ రాశారు. ములాయం సింగ్ యాదవ్ మాత్రం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదు. కాని అఖిలేష్ మాత్రం తమకు సొంత ఇళ్లు లేనందున ప్రభుత్వ బంగళాలోనే ఉండిపోవాల్సి వచ్చిందంటున్నారు. తాము ఇల్లు కొనుక్కోవడానికి కొంత సమయం కావాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. తాను స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునేంత వరకూ ప్రభుత్వ బంగళాలోనే ఉంటానని అఖిలేష్ తెలిపారు. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రులకు ఇళ్లు దొరక్కపోవడం చర్చనీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*