రెండూ ఒకటేనా…? రెండూ రెండేనా?

ఉత్తరప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? బీజేపీని ఓడించాలన్న వారి కోరిక నెరవేరుతుందా? ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ కలసి పోటీ చేయడంతో వరుస విజయాలు నమోదయ్యాయి. ఈసారి జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే వైఖరిని అవలంబించాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈరెండు పార్టీలతో పాటు కాంగ్రెస్, ఆర్ఎల్డీలు కూడా కలసి పోటీ చేస్తే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో అత్యధిక స్థానాలను సాధించి ఢిల్లీని ఏలవచ్చన్నది ఇటు అఖిలేష్, అటు మాయావతి వ్యూహంగా కన్పిస్తోంది.

పొత్తులకు ఫార్ములా……

ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయాన్ని సమాజ్ వాదీ పార్టీ ఆ పార్టీ అధినేత అఖిలేష్ కు అప్పగిస్తూ జాతీయ కార్యకవర్గం తీర్మానం చేసింది. అఖిలేష్ సీట్ల పంపకంపై అన్ని పార్టీలతో చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇప్పటికే యూపీలో సీట్ల పంపకంపై ఫార్ములాను సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించింది. గత లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన స్థానాలు, నియోజకవర్గాల్లో ఓడిపోయినా రెండో స్థానంలో నిలిచిన పార్టీకి ఆసీటును కేటాయించాలన్నది ఎస్పీ ఫార్ములా.

బీఎస్పీ అంగీకరిస్తుందా?

అయితే దీనికి బీఎస్పీ అంగీకరిస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఆ దామాషా ప్రకారం తీసుకుంటే సమాజ్ వాదీ పార్టీకే ఎక్కువ స్థానాలను కేటాయించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కు కేవలం 8 స్థానాలే దక్కుతాయి. ఈ ప్రకారం ఎన్నికలకు వెళ్లినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇదే సూత్రాన్ని అమలు చేయాలని ఎస్పీ మరసారి కోరే అవకాశముంది. అందుకే బీఎస్పీ ఈ ఫార్ములాకు అంగీకరించే ప్రసక్తి ఉండదని అంచనా.

అసెంబ్లీ ఎన్నికల మాటేమిటి?

నిజానికి సమాజ్ వాదీ పార్టీకి లోక్ సభ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలే ముఖ్యం. రాష్ట్రంపైనే అఖిలేష్ యాదవ్ దృష్టి ఉంటుంది. మాయావతి కూడా రాష్ట్రంపై తన పట్టును కోల్పోవడానికి అంగీకరించరు. అలాగే లోక్ సభ ఎన్నికలకు కూడా మాయావతి అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడు సీట్ల పంపకంలో డిమాండ్ చేసి లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించుకున్నా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్పీ నుంచి తిరకాసు తప్పదు. అందుకే ముందుగానే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సీట్ల ఒప్పందానికి రావాలన్నది బీఎస్పీ నేతల యోచనగా తెలుస్తోంది. ఆర్ఎల్డీది కూడా అదే పరిస్థితి. ఆర్ఎల్డీ ఎక్కువ స్థానాలు ఇవ్వకపోతే బీజేపీతో పొత్తుకైనా రెడీ అంటుంది. ఒక్క కాంగ్రెస్ మాత్రం ఎటువంటి షరతులు లేకుండా సీట్ల కేటాయింపుకు తలూపుతుందన్న విశ్లేషణ కూడా విన్పిస్తోంది. మొత్తం మీద యూపీలోని రెండు ప్రధాన పార్టీల మధ్య పొత్తు పొడుపు పొడుస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*