అఖిలేష్ పార్టీ…. ఇక ఫినిష్…!

ఐక్యంగా నిలిచి ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాలని ఉవ్విళ్లూరుతున్న యువనేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యేటట్లు కన్పిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని 80 లోక్ సభ స్థానాల్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు ఏకమై బీజేపీ ఖేల్ ఖతం చేయాలన్నది అఖిలేష్ వ్యూహం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే ప్లాన్ ను అనుసరించి బీజేపీని మట్టికరిపించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సయితం కూటమిగా ఏర్పడి కాషాయ పార్టీని ఎదుర్కొనాలని అఖిలేష్ అభిలాష. ఈ మేరకు బీఎస్పీ అధినేత మాయావతితో తరచూ సమావేశమవుతూ రెండు పార్టీల మధ్య ఐక్యత కోసం కృషి చేస్తున్నారు.

కూటమిగా ఏర్పడితే…..

ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, మాయవతిలు కలిస్తే బీజేపీని సునాయాసంగా ఎదుర్కొనవచ్చు. యూపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. గత లోక్ సభ ఎన్నికల్లో రాయబరేలి, అమేధీ తప్ప హస్తం పార్టీ ఎక్కడా గెలవలేదు. యూపీకి వచ్చేసరికి రెండు ప్రాంతీయ పార్టీలైన బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలదే పట్టు. అక్కడ ఆ రెండు పార్టీలు కలిస్తే నిజంగానే ఓట్ల వర్షం కురుస్తుంది. ఇందుకు అనుగుణంగా అఖిలేష్ కూటమి ఏర్పాటుకు అన్నిప్రయత్నాలు చేస్తున్నారు. మాయావతి కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. యూపీలోని కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్ ను కూడా కలుపుకుని పోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జరిగితే యూపీలో కూటమి విజయం దాదాపుగా ఖాయమైనట్లే.

కుటుంబం నుంచే…..

కాని ఇప్పుడు అఖిలేష్ సొంత కుటుంబంతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అఖిలేష్ యాదవ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందునుంచే సొంత పార్టీ, కుటుంబం నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన బాబాయి శివపాల్ యాదవ్ అఖిలేష్ నాయకత్వాన్ని తొలినుంచి అంగీకరించలేదు. ములాయం సింగ్ కూడా శివపాల్ యాదవ్ కే మద్దతిచ్చారు. దీంతో శివపాల్ యాదవ్ కు టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్న అనుమానం అప్పట్లో వచ్చింది. అయితే చివరకు ములాయంతో పలు దఫాలు చర్చలు జరిపిన అనంతరం అఖిలేష్ యాదవ్ శివపాల్ యాదవ్ కు టిక్కెట్ ఇచ్చారు.

శివపాల్ కొత్త పార్టీ…..

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత అఖిలేష్ నాయకత్వంపై అనుమానాలు ఏర్పడ్డాయి. పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ కూడా విన్పించింది. దీంతో అఖిలేష్ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. శివపాల్ యాదవ్ ను పార్టీ బాధ్యతల నుంచి తొలగించారు. దీంతో శివపాల్ యాదవ్ కొంత అఖిలేష్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో పొత్తుపెట్టుకుని అఖిలేష్ పార్టీని భూస్థాపితంచేస్తారంటూ శివపాల్ యాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు. పార్టీలో తమకు గుర్తింపు లేకపోవడం, పార్టీని సజావుగా నడిపించకపోవడం వల్ల తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు శివపాల్ యాదవ్ ప్రకటించారు. కొత్త పార్టీ పేరు సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చాగా కూడాప్రకటించారు. తనకు సమాజ్ వాదీ పార్టీకి ఇక సంబంధం లేదని శివపాల్ యాదవ్ తేల్చి చెప్పారు. దీంతో సమాజ్ వాదీ పార్టీలో అఖిలేష్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేతలు శివపాల్ వెంట వెళతారన్న ప్రచారం జరుగుతోంది. ములాయం సింగ్ కూడా తమ్ముడికే మద్దతు పలుకుతారంటున్నారు. ఇదే జరిగితే అఖిలేష్ పార్టీికి ఇబ్బందులు తప్పవు.  కూటమి ఏర్పాటు చేసి మోడీ ఆశలకు గండి కొడదామని అఖిలేష్ భావిస్తుంటే, కుటుంబం నుంచే కొత్త పార్టీ పుట్టుకొస్తుండటం కలవరపరుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*