అఖిలైష్ సైక్లింగ్..సైడ్ ట్రాక్ పట్టిందా?

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వచ్చే లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు. బీజేపీని రాష్ట్రంలో బలహీన పర్చాలన్న లక్ష్యంతోనే ఆయన ప్రతి అడుగూ వేస్తున్నారు. అంతా తానే అయి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. తండ్రి ములాయం సింగ్ యాదవ్ తో కూడా పెద్దగా టచ్ లో ఉండకుండా, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు విషయంలో అఖిలేష్ తొందరపడుతున్నారన్న వాదన కూడా లేకపోలేదు.

గుడ్డిగా నమ్ముతున్నారని…..

మాయావతిని గుడ్డిగా అఖిలేష్ నమ్ముతున్నారని, భవిష్యత్తులో అఖిలేష్ కు తత్వం బోధపడుతుందనే వారుకూడా లేకపోలేదు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ కూటమిలో కాంగ్రెస్ కుచోటు లేదని ఇటు మాయావతి, అటు అఖిలేష్ చెప్పడం విశేషం. లోక్ సభ ఎన్నికల్లో ఉండే పొత్తు ఆపైన వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ జరగాలన్నది అఖిలేష్ వ్యూహం. లోక్ సభ ఎన్నికల్లో అవసరమైతే ఎక్కువ స్థానాలను బీఎస్పీకి ఇచ్చేందుకు కూడా అఖిలేష్ సిద్దమయ్యారని చెబుతున్నారు.

అప్పుడే పొత్తుల విషయమా?

కాని దీన్ని సమాజ్ వాదీ పార్టీలోని కొందరు ముఖ్యనేతలే తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాలనపై ప్రజలు అప్పుడే విసిగిపోయారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత తీవ్రమవుతుందన్నది వారి వాదన. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల వరకూ సమయం ఉండటంతో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై ఆలోచన చేయడం అఖిలేష్ అనుభవలేమికి నిదర్శనమని కొందరు అంటున్నారు.లోక్ సభ ఎన్నికల్లో జత కట్టినా అసెంబ్లీ నాటికి మాయావతి అడ్డం తిరగరని నమ్మకం ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. నేతాజీ (ములాయం సింగ్) ను పక్కనపెట్టి అఖిలేష్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై కొందరు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

త్వరలో సైకిల్ యాత్ర……

ఇవేమీ పట్టించుకోవడం లేదు అఖిలేష్ యాదవ్ .  తనేంటో పార్టీకి చెప్పేందుకు మరోసారి యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. మొత్తం సైకిల్ యాత్రను అఖిలేష్ చేయనున్నారు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అఖిలేష్ సైకిల్ యాత్రను చేసి విజయం సాధించారు. ఇదే ఫార్ములాకు మరోసారి శ్రీకారం చుడుతున్నారు అఖిలేష్. వచ్చే నెలలోనే అఖిలేష్ సైకిల్ యాత్ర ప్రారంభం కానుంది. రోజుకు యాభై కిలోమీటర్ల చొప్పున అఖిలేష్ యాత్ర చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు, ప్రజలకు దగ్గరయ్యేందుకు అఖిలేష్ సైకిల్ యాత్రను చేపట్టనున్నారు. మరి అఖిలేష్ స్ట్రాటజీ వర్క అవుట్ అవుతుందో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*