నీకొకటి….నాకొకటి….తేలేనా?

డీఎంకే రాజకీయాల్లో ఆళగిరి, స్టాలిన్ లు ఇద్దరూ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు అసలు సమస్య ముందుంది. కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూరు, ఇటీవల అన్నాడీఎంకే ఎమ్మెల్యే మృతి చెందిన తిరుప్పరకుండ్ర నియోజకవర్గాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ డీఎంకే లో పదవుల కోసం కొట్లాడుకుంటున్న అన్నదమ్ములు ఇప్పుడు ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. తమ వారసులను దించేందుకు ఇదే అదనుగా భావిస్తున్నారు.

పోరు షురూ…..

డీఎంకేలో అనుకున్నట్లుగానే అన్నదమ్ములు ఆళగిరి, స్టాలిన్ ల మధ్య పోరు ప్రారంభమయింది. తనకు ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని ఆళగిరి గట్టిగానే పట్టుబడుతున్నారు. ఇందుకు స్టాలిన్ అంగీకరించకపోతే కొత్త పార్టీ పెట్టేందుకు కూడా ఆళగిరి రెడీ అవుతున్నారు. స్టాలిన్ తాను అనుకున్నట్లుగానే తనపై పార్టీ బహిష్కరణ వేటు ఎత్తివేసి, పదవి ఇవ్వకుంటే వెంటనే కలైంజ్ఞర్ డీఎంకే పార్టీని పెట్టేందుకు ఆళగిరి సిద్ధమవుతున్నారు.

స్టాలిన్ కుమారుడు…..

అయితే కరుణానిధి మృతితో ఖాళీ అయిన తిరువారూరు నియోజకవర్గంలో స్టాలిన్ కుమారుడు పోటీ చేయాలని భావిస్తున్నారు. స్టాలిన్ తన వారసుడిని కూడా ఈ ఎన్నికల ద్వారా ప్రజలకు పరిచయం చేస్తుండటంతో ఆళగిరి కూడా అప్రమత్తమయ్యారు. తన కుమారుడు దురై దయానిధిని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని ఆయన కూడా ఆలోచన చేస్తున్నారు. తాత నియోజకవర్గంలో ఇద్దరు మనవళ్లు ఉదయనిధి, దురై దయానిధి పోటీ పడే అవకాశముంది.

ఆళగిరి కూడా……

ఆళగిరి ఉదయనిధి కి పోటీగా తన కుమారుడిని బరిలోకి దింపితే స్టాలిన్ దిగి వచ్చే అవకాశముందంటున్నారు. దీంతో మరోస్థానం తిరుప్పకుండ్ర నుంచి ఆళగిరి కుమారుడిని పోటీ చేయించేలా స్టాలిన్ దిగివస్తారని ఆళగిరి భావిస్తున్నారు. ఇలా అన్నదమ్ములు తమ కుమారులను ఉప ఎన్నికల ద్వారా రంగంలోకి దింపాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే పార్టీలో పదవుల పంపకంపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది కాబట్టి ఉప ఎన్నికల్లో తిరువారూర్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత వస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*