ఆళగిరి వెనక ఎవరు?

సమయం దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడు డీఎంకేలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 28వ తేదీన పార్టీ కార్యవర్గ సమావేశంలో స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. ఇది లాంఛనమే అయినప్పిటకి ఆళగిరి అలజడితో డీఎంకే వర్గాల్లో ఆందోళన అనేది ఉందన్నది మాట వాస్తవం. స్టాలిన్ ఎట్టిపరిస్థితుల్లో ఆళగిరిని తిరిగి పార్టీలోకి చేర్చుకునేది లేదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా ఆళగిరికి స్టాలిన్ చేరవేసినట్లు తెలిసింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తే అప్పుడు ఆళగిరిని పార్టీలోకి తీసుకునే విషయాన్ని ఆలోచిస్తానని స్టాలిన్ స్పష్టమైన సంకేతాలను పంపారు. అయితే 63 జిల్లాల నుంచి నేతలు స్టాలిన్ ను అధ్యక్షుడిగాచేయాలంటూ తీర్మానాల చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపారు.

ఈ నాలుగు రోజుల్లో…..

సమావేశానికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. ఈలోగా పార్టీలో ఆళగిరి చీలిక తెచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆళగిరి వచ్చే నెల 5వ తేదీన బలనిరూపణకు దిగుతున్నారు. చెన్నైలోని ట్రిప్లికేన్ నుంచి కరుణానిధి సమాది వరకూ చేపడుతున్న ఈ ర్యాలీలో లక్ష మంది పాల్గొనేందుకు ఆళగిరి ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల డీఎంకే నేతలతో టచ్ లోకి వెళుతున్నారు. ఇది గమనించిన స్టాలిన్ ఆ ర్యాలీకి ఎవరూ హాజరు కాకూడదని జిల్లా కార్యాలయాలకు సమాచారం పంపారు. పార్టీ జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గాల బాధ్యులకు స్టాలిన్ ర్యాలీకి వెళితే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. దీంతో డీఎంకే క్యాడర్ లో అయోమయం నెలకొంది. దీంతో ఆళగిరి ఏం చేయనున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

స్టాలిన్ కట్టడి…..

తాము కరుణానిధి మీద ప్రేమతోనే ర్యాలీకి హాజరవ్వాలని భావించామని, ఇప్పుడు స్టాలిన్ ఆదేశాలతో పునరాలోచనలో పడ్డామని దక్షిణ తమిళనాడుకు చెందిన డీఎంకే నేత స్పష్టం చేయడం విశేషం. అయితే ఆళగిరి చాలా క్లారిటీగా ఉన్నారని చెబుతున్నారు. బలనిరూపణతో తన వెనక ఎంత క్యాడర్ ఉందో నిరూపించుకుని, స్టాలిన్ అంటే గిట్టని నేతలను తనవైపునకు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. స్టాలిన్ ఉద్దేశ్యం తెలిసిన తర్వాత ఆళగిరి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. తాను డీఎంకేతో ఎట్టి పరిస్థితుల్లో కలవని ఆళగిరి చెప్పడం విశేషం. అంటే డీఎంకేలో చేరకుండా ర్యాలీ తర్వాత ఆళగిరి కొత్త పార్టీని ప్రకటించే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది.

కొత్త పార్టీ దిశగా…..

ఆళగిరి తాజా వ్యాఖ్యలతో తమిళనాడులో మరొక కొత్త పార్టీ రానుందని, డీఎంకే మరోసారి చీలనుందన్నది స్పష్టమైంది. ఆళగిరికి దక్షిణ తెలంగాణలో మంచి పట్టుంది. మధురై కేంద్రంగా చేసుకుని ఆళగిరి తన పట్టును పెంచుకున్నారు. ఆళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయనకు సానుభూతి కూడాఎక్కువగా పెరిగిందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆళగిరి వల్లనే అధికారంలోకి డీఎంకే రాలేకపోయిందన్న వాదన కూడా ఉంది. దీని ప్రకారం చూస్తే ఆళగిరి సొంత పార్టీ పెట్టడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు సమాచారం. కళైంజ్ఞర్ డీఎంకే పేరుతో ఆళగిరి ర్యాలీ తర్వాత పార్టీని ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే ఆళగిరి వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారన్నది స్టాలిన్ వర్గం అనుమానం. మొత్తం మీద అన్నదమ్ములిద్దరూ ఎవరూ కాంప్రమైజ్ కాకపోవడంతో డీఎంకేలో చీలిక అనివార్యంగా కన్పిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*