ఆళగిరి….. నెక్ట్స్ ఏంటి?

కరుణానిధి పెద్దకుమారుడు ఆళగిరి వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఆయన కొత్త పార్టీ పెట్టాలా? రజనీతో కలసి నడవాలా? కమలం పార్టీతో జత కట్టాలా? అన్నదానిపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఆళగిరిని డీఎంకేలో తీసుకునే అవకాశమే కన్పించకపోవడంతో ఆయన తదుపరి ప్రయాణమెటు? అన్న చర్చలు తమిళనాడులో జోరుగా సాగుతున్నాయి. ఈనెల 5వ తేదీన ఆళగిరి డీఎంకే జెండాలతో చెన్నైలో ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ర్యాలీ కొంత సక్సెస్ అయినప్పటికీ తాను వస్తారనుకున్న డీఎంకే నేతలు ర్యాలీకి హాజరుకాకపోవడంతో ఆయన కొంత మనస్థాపానికి గురయినట్లు తెలుస్తోంది.

భవిష్యత్ వ్యూహంపై…..

ర్యాలీ విషయం పక్కనపెడితే ఆళగిరి తన భవిష్యత్ వ్యూహాన్ని వీలయినంత త్వరలో ప్రకటించాలని ముందు అనుకున్నప్పటికీ, మరికొంత కాలం ఆగాలని భావిస్తున్నారు. ఇప్పటికే తనను డీఎంకేలో చేర్చకుంటే స్టాలిన్ నాయకత్వాన్ని సమర్థిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. డీఎంకే లో తాను చేరితే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న సంకేతాలను ర్యాలీ ద్వారా తన సోదరుడు స్టాలిన్ కు పంపారు. అయినా సరే స్టాలిన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆళగిరిని తిరిగి డీఎంకేలో చేర్చుకునే ప్రసక్తి లేదని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.

కుటుంబంలో విభేదాలు….

స్టాలిన్ సోదరి సెల్వి మాత్రం ఆళగిరిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని కోరుతున్నారు. కోరడమే కాదు ఒకరకంగా స్టాలిన్ పై వత్తిడి తెస్తున్నారు. మరోవైపు స్టాలిన్ భార్య దుర్గ మాత్రం ససేమిరా అంటున్నారు. గతంలో ఆళగిరి చేసిన వ్యాఖ్యలే ఆమె ఆగ్రహానికి కారణమంటున్నారు. గతంలో ఆళగిరి త్వరలోనే స్టాలిన్ చనిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో కరుణానిధి కూడా సీరియస్ అయ్యారు. అది మనస్సులోనే పెట్టుకుని ఉన్న స్టాలిన్ భార్య దుర్గ ఆళగిరిని పార్టీలోకి చేర్చుకోవద్దని గట్టిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆళగిరి పార్టీలో చేరితో భవిష్యత్తులో వారసులపోరు కూడా ఉంటుందని స్టాలిన్ అభిప్రాయపడుతున్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి, ఆళగిరి కుమారుడు దురైనిధి మధ్య కూడా విభేదాలు తలెత్తుతాయన్న ఆందోళన కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతోంది.

సొంతపార్టీయేనా?

ఇక ఆళగిరిని పార్టీలో చేర్చుకోవడం కష్టమేనన్న సంకేతాలు వెలువడటంతో ఆళగిరి తన సన్నిహితులతో చర్చిస్తున్నారు. ఆళగిరికి రజనీకాంత్ తో మంచి సంబంధాలున్నాయి. త్వరలో ఆయన పెట్టబోయే పార్టీలో చేరతారన్న ప్రచారమూ ఉంది. అలాగే కమలం పార్టీకి కూడా ఆళగిరి దగ్గరగానే ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఆళగిరి సన్నిహితులు మాత్రం సొంతపార్టీ పెట్టాలని వత్తిడి తెస్తున్నారు. త్వరలో జరగబోయే తిరువారూర్, తిరుపరకుండ్ర ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలిపి డీఎంకేను ఓడించాలన్న నిర్ణయానికి కూడా ఆళగిరి వచ్చినట్లు సమాచారం. మొత్తం మీద ఆళగిరి తన భవిష్యత్ పై ప్లాన్ ను పకడ్బందీగానే చేసుకుంటున్నారని తెలుస్తోంది. స్టాలిన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నింపాదిగా ఉండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*