
రేపు తమిళనాడులో జరగనన్న ఆళగిరి ర్యాలీ ఆసక్తికరంగా మారింది. లక్షమందితో ర్యాలీ నిర్వహిస్తానన్న ఆళగిరి సైన్యాన్ని సమకూర్చుకునే పనిలోనే ఉన్నారు. ఆయన తనకు పట్టున్న మధురై ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు. అలాగే చెన్నై పట్టణంలో కూడా ఎక్కువ మందిని ర్యాలీకి తరలించేందుకు విస్తృతంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. లక్ష మంది కాకపోయినా డీఎంకే నేతలు ఊహించని విధంగా ర్యాలీ ఉండాలన్నది ఆళగిరి లక్ష్యంగా ఉంది. తనను డీఎంకేలో చేర్చుకుంటే సోదరుడు స్టాలిన్ నాయకత్వాన్ని సమర్థిస్తానని ఆళగిరి ప్రకటించి ఐదు రోజులవుతున్నా డీఎంకే నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం.
స్టాలిన్ అంగీకరించకపోవడంతో…..
ఆళగిరిని తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు స్టాలిన్ అంగీకరించడం లేదు. దీంతో రేపు చెన్నైలో ర్యాలీ శాంతియుతంగా జరిగిన తర్వాత ఆళగిరి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని తెలుస్తోంది. కొత్త పార్టీవైపే ఆళగిరి మొగ్గు చూపుతున్నారని సమాచారం. కొత్త పార్టీతో తనకు పట్టున్న ప్రాంతాల్లో కనీస సీట్లు సాధించుకోగలిగితే కింగ్ మేకర్ కాగలనన్నది ఆళగిరి వ్యూహంగా ఉంది. డీఎంకేలోకి వెళ్లి స్టాలిన్ తో నిత్యం గొడవలు పడే కంటే తన సత్తా చూపించుకుని అవసరమైతే ఆ పార్టీలోకి వెళ్దామన్న ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
బీజేపీ హస్తం ఉందని…..
ఆళగిరి వెనక బీజేపీ హస్తం ఉందని స్టాలిన్ అనుమానిస్తున్నారు. అందుకోసమే ఇటీవల బీజేపీపై గొంతుకను పెంచారు. కాంగ్రెస్ తో వచ్చే ఎన్నికల్లో డీఎంకే కలసి వెళ్లదని నిన్న మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. స్టాలిన్ బీజేపీ కార్యాలయానికి వెళ్లి వాజ్ పేయి అస్థికలకు నివాళుర్పించడం, కరుణానిధి సంస్మరణ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఆహ్వానించడం ఈ అనుమానాలకు తావిచ్చింది. అయితే ఆళగిరిని కమలం పార్టీయే ప్రోత్సహిస్తుందని భావించిన స్టాలిన్ కాంగ్రెస్ తోనే కలసి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
కాంగ్రెస్ తోనే కలసి వెళ్లాలని…..
తొలి నుంచి డీఎంకే, కాంగ్రెస్ కు సత్సంబంధాలున్నాయి. కరుణానిధి జీవించి ఉన్నప్పుడు కూడా ఆయన సోనియాగాంధీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ మంత్రివర్గంలో డీఎంకేకు చోటు లభించింది. దాదాపు 14 ఏళ్ల నుంచి డీఎంకే, కాంగ్రెస్ పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో దానిని వదులుకునే ప్రసక్తి లేదని డీఎంకే చెబుతోంది. అన్నాడీఎంకేలో చీలికలు రావడంతో ఇప్పుడు ఎంతో కొంత డీఎంకే బలంగా ఉంది. డీఎంకేతోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. దానికి తగ్గట్లుగానే స్టాలిన్ కాంగ్రెస్ తోనే కలసి నడవాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. రేపు ర్యాలీ తర్వాత ఆళగిరి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తే…ఎవరితో కలసి నడవాలన్న దానిపై కమలనాధులు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. మొత్తం మీద రేపటి ర్యాలీ, తదనంతర పరిణామాలపై ఇటు డీఎంకే, అటు అన్నాడీఎంకే శ్రేణులు ఆసక్తిగా చూస్తున్నాయి.
Leave a Reply