ఆళగిరి అలజడి….?

ఆళగిరిని పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టమయింది. ఎక్కువ మంది సభ్యులు స్టాలిన్ నాయకత్వానికే మద్దతు పలకడంతో ఆళగరి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఆళగిరి ఇప్పటికి దక్షిణ తమిళనాడులో బలమైన నేత కావడంతో ఆయన ఏం చేయబోతున్నారన్నది డీఎంకే నేతల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. నిన్న అన్నా అరివాలయంలో జరిగిన కరుణ సంతాప సభలో స్టాలిన్ కు మద్దతు ఎక్కువగా లభించింది. ఈ జోష్ తో ఆళగిరిని పార్టీలోకి తీసుకోకూడదన్న నిర్ణయానికి స్టాలిన్ వచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీలోకి తీసుకోకూడదన్న…..

కరుణానిధి బతికున్నప్పుడే తన పెద్దకుమారుడైన ఆళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీని బహిష్కరించడంలో తన ప్రమేయం ఏమీలేదన్నది స్టాలిన్ వాదన. అలాగే ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకుంటే కరుణ ఆత్మ క్షోభిస్తుందన్న కొత్త వాదనను స్టాలిన్ వర్గం తెరపైకి తెస్తోంది. ఆళగిరి గతంలో చేసిన వ్యాఖ్యలు పెద్దాయనను బాధించాయని, స్టాలిన్ సమర్థత, దక్షతను చూసే కరుణానిధి ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా స్టాలిన్ కు పార్టీ క్యాడర్ తో అనుబంధం ఉందంటున్నారు.

స్టాలిన్ కే సర్వాధికారాలు…..

అంతేకాదు కరుణ ఆరోగ్యం బాగాలేక పోవడంతో గత రెండేళ్ల నుంచీ స్టాలిన్ పార్టీ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ స్టాలిన్ కుటుంబ తగాదాలతో పార్టీలో చీలిక రాకూడదన్న భావనలో ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఆళగిరి దూకుడును చూసి స్టాలిన్ ఆయనను పార్టీలోకి తీసుకువస్తే ప్రమాదమని గ్రహించారు. అందుకే తన పట్టాభిషేకం కూడా సింపుల్ గాచేసేసుకుని పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. కరుణానిధి మృతి చెందిన మరుసటి రోజు నుంచే ఆళగిరి తానేంటో చెప్పకనే వివిధ రూపాల్లో చెబుతూ వస్తున్నారు.

ఆళగిరి ఊరుకుంటారా?

ఫేస్ బుక్ ద్వారా, పోస్టర్లు ద్వారా కరుణ అనుచరులు తన వెంటే ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. తాజాగా చెన్నైలో వెలసిన పోస్టర్లు ఇందుకు ఉదాహరణ.కరుణానిధిని ప్రేమించే వారంతా ఆళగిరితో కలసి రావాలంటూ వెలసిన పోస్టర్లు కుటుంబంలో మరింత కాకను పెంచాయి. అయితే ఆళగిరి వెనక ఎవరున్నారన్నదానిపై డీఎంకే శ్రేణులు ఆరా తీస్తున్నాయి. బహుశ బీజేపీ ప్రమేయం ఉందన్న అనుమానాలను కూడా డీఎంకే నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ నేత, కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పందించారు. ఆళగిరి వెనక తాము ఉండాల్సిన అవసరం లేని, ఆయన బలమైన నాయకుడని, స్టాలిన్ కు కూడా సమర్థత ఉందనిచెప్పారు. ఇలా ఆళగిరిని పార్టీలోకి తీసుకోకూడదన్న స్టాలిన్ నిర్ణయంతో ఆళగిరి వ్యూహం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొని ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*