ఒకటి సక్సెస్…రెండోది….?

కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి అనుకున్నది సాధించారు. చెన్నైలో ఆళగిరి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి తమిళనాడు వ్యాప్తంగా అనేకమంది పార్టీ శ్రేణులు హాజరయ్యారు. చెన్నైలోని ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ నుంచి మెరినా బీచ్ లోని అన్నాదురై, కరుణానిధి వరకూ సాగిన ఈ ర్యాలీలో ఊహించినట్లుగానే ఎక్కువ మంది హాజరుకావడంతో ఆళగిరి శిబిరంలో ఆనందం వెల్లువెత్తుతోంది. ర్యాలీని మౌనప్రదర్శనగా పేర్కొన్న ఆళగిరి రాజకీయాలపై ప్రస్తుతం మాట్లాడలేదు. ఆయన త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటించే అవకాశముందంటున్నారు.

స్టాలిన్ సానుకూలంగా లేక……

డీఎంకేలో తిరిగి చేరాలన్న ఆళగిరి ఆకాంక్షను స్టాలిన్ పట్టించుకోలేదు. ఆళగిరిని పార్టీలోకి తీసుకోకూడదన్న స్టాలిన్ నిర్ణయంతో ఇక ఆళగిరి తన రాజకీయ భవిష్యత్తును తానే నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆళగిరి వల్ల పార్టీ బలోపేతం అవుతుందని తెలిసినా, భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు, చిక్కులు స్టాలిన్ ను వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. ఆళగిరి పార్టీలోకి వస్తే దక్షిణ తమిళనాడులో పార్టీ బలోపేతం అవుతుందని తెలుసు. ఎక్కువ సీట్లు కూడా సాధించుకునే వీలుంటుంది. కాని స్టాలిన్ మాత్రం ఆళగిరిని పార్టీలోకి తిరిగి తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు.

గ్రూపులు ప్రోత్సహిస్తారని……

ఆళగిరి అంటేనే గ్రూపుల నాయకుడన్న పేరు బలంగా ఉంది. కరుణానిధి జీవించి ఉన్నప్పుడే ఆళగిరి గ్రూప్ పాలిటిక్స్ ను నడిపేవారు. చికాకులను తెప్పిస్తున్న ఆళగిరిపై ఉన్న ప్రేమను అణుచుకుని మరీ కరుణానిధి రెండు సార్లు పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే ఆళగిరి ఏ స్థాయిలో రాజకీయాలు నడుపుతారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆళగిరికి డీఎంకే ద్వారాలు దాదాపుగా మూసుకుపోయినట్లేనన్నది డీఎంకే వర్గాల అభిప్రాయం. ఆళగిరి ర్యాలీకి ఎవరూ వెళ్లకూడదన్న ఆంక్షలను కూడా స్టాలిన్ విధించారు. వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

త్వరలోనే నిర్ణయమా?

ఈ మేరకు స్టాలిన్ చర్యలు కూడా ప్రారంభించారు. ఇటీవల చెన్నై వచ్చిన ఆళగిరికి విమానాశ్రయంలో వేళచ్చేరి డీఎంకే కార్యదర్శి స్వాగతం పలకగా ఆయన్ను పార్టీ నుంచి డీఎంకే సస్పెండ్ చేసి హెచ్చరిక సంకేతాలను అందరికీ పంపింది. అయితే ఆళగిరి ర్యాలీ విజయవంతం కావడంతో డీఎంకే వర్గాలు కూడా డైలమాలో పడ్డాయి. డీఎంకేలో అసంతృప్త నేతలు ఆళగిరి బాట పట్టే అవకాశముంది. అయితే కొంతకాలం వేచి చూడక తప్పదని స్టాలిన్ వర్గం భావిస్తోంది. ఆళగిరి మాత్రం తన రాజకీయ నిర్ణయంపై ఒక స్పష్టత నిచ్చే అవకాశముందని తెలుస్తోంది. తమిళనాట డీఎంకే లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారడంతో మిగిలిన రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*