గెలిస్తే…ఓకే…ఓడితే సమాధే…!

కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి వేస్తున్న రాజకీయ ఎత్తులు ఆయనకు ఉపకరిస్తాయా? లేదా? అన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. ఆళగిరి తీసుకుంటున్న నిర్ణయంతో ఆయనకు పార్టీలోనూ, తమిళనాడులోనూ కలిసి వచ్చే ఛాన్సుండగా, అదే నిర్ణయం బూమ్ రాంగ్ అయితే రాజకీయంగా సమాధి కాక తప్పదన్నది విశ్లేషణ. ఆళగిరి డీఎంకేలో తిరిగి చేరేందుకు తహతహలాడుతున్నారు. కాని స్టాలిన్ నుంచి ఎటువంటి సంకేతాలు అందడం లేదు. ఆళగిరిని తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు స్టాలిన్ అస్సలు అంగీకరించడం లేదు. ఆళగిరి వస్తే పార్టీకి ప్లస్ కన్నా మైనస్సులే ఎక్కువని స్టాలిన్ బలంగా విశ్వసిస్తున్నారు. అందువల్లనే తనను డీఎంకేలో చేర్చుకుంటే స్టాలిన్ నాయకత్వాన్ని సమర్థిస్తానని చెప్పినా మౌనంతోనే తన నిర్ణయాన్ని స్టాలిన్ చెప్పకనే చెప్పారు.

జిల్లాల పర్యటనకు…..

ఇప్పుడు తాజాగా ఆళగిరి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. కేవలం తనకు మధురై ప్రాంతంలోనే పట్టు ఉందన్న విషయం అపోహ అని తేల్చి చెప్పడానికే ఆయన జిల్లాల పర్యటనకు పూనుకోనున్నట్లు తెలుస్తోంది. ఆళగిరి తొలుత తిరువళ్లూరు జిల్లా నుంచి పర్యటనను ప్రారంభించడానికి సిద్ధం చేసుకుంటున్నారు. డీఎంకేలోని అసంతృప్త నేతలు తనతో కలసి వస్తారని ఆళగిరి విశ్వసిస్తున్నారు. ఇటీవల చెన్నైలో జరిపిన ర్యాలీ కొంత సక్సెస్ కావడంతో స్టాలిన్ ను పార్టీలో చేర్చుకోమని బతిమాలుకునే కన్నా తానేంటో నిరూపించుకునేందుకు ఆళగిరి రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ముఖ్యులతో మంతనాలు……

గత మూడురోజుల నుంచి చెన్నై కేంద్రంగా ఆళగిరి తన సన్నిహితులు, ముఖ్య అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. కరుణానిధి పెద్ద కుమారుడిగా తనను పార్టీ నేతలు, శ్రేణులు గౌరవిస్తారని ఆళగిరి అభిప్రాయపడుతున్నారు. స్టాలిన్ నాయకత్వంలోకి 2016లోనే పార్టీ వచ్చిందని, అప్పటి ఎన్నికల్లో డీఎంకే ఓటమికి స్టాలిన్ ను బాధ్యుడిని చేస్తూ ఆళగిరి ప్రసంగాలు కొనసాగనున్నాయి. కరుణానిధి ఆరోగ్యం బాగాలేక పోవడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొన్నేళ్లుగా స్టాలిన్ పార్టీ వ్యవహారాలను చూస్తున్నారని ఎందులోనూ ఆయన తన నాయకత్వ పటిమను నిరూపించుకోలేకపోయారన్న వాదనను ఆళగిరి తెరపైకి తెస్తున్నారు.

స్వయంగా బరిలోకి దిగి…….

దీంతో పాటు కరుణానిధి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువారూర్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో స్వయంగా తానే పోటీకి దిగేందుకు ఆళగిరి సిద్ధమయిపోయారు. తిరువారూర్ లో కరుణానిధి కుటుంబానికి మంచిపేరుంది. కరుణానిధి పెద్దకుమారుడిగా తనకు అవకాశం కల్పించాలని స్వతంత్ర అభ్యర్థిగా ఆళగిరి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి తన సత్తాను స్టాలిన్ కు చూపించాలనుకుంటున్నారు. అలాగే తిరుప్పరకుండ్రం ఉప ఎన్నికల్లోనూ బలమైన అభ్యర్థిని పోటీలో ఉంచి డీఎంకే ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని ఆళగిరి భావిస్తున్నారు. ఇలా సోదరుడి నాయకత్వాన్ని వచ్చే ఉప ఎన్నికల ఫలితాలతోనే తేల్చేయాలన్నది ఆళగిరి వ్యూహంగా ఉంది. ఆళగిరి తిరువారూర్ నియోజకవర్గంలో నెగ్గితే ఓకే…అదే ఓటమి పాలయితే రాజకీయంగా సమాధి కాక తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరోవైపు తిరువారూర్ లో స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని నిలపాలన్న యోచనలో ఉన్నారు. మొత్తం మీద తమిళనాడులోని డీఎంకే రాజకీయాలు రసకందాయకంలో పడ్డాయి.