ఆళగిరి ఓకే చెబితేనేనా?

ఆళగిరి అంగీకరిస్తారా? తమ్ముడికి కిరీటం పెడతారా? డీఎంకే సారథ్యం స్టాలిన్ కే అప్పగించేందుకు సర్వం సిద్ధమయిన తరుణంలో ఈప్రశ్నలు డీఎంకే అభిమానుందరినీ వేదిస్తున్నాయి. కరుణానిధి మరణం తర్వాత ఆపార్టీకి అధ్యక్షుడు ఎవరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీనికి ఏకపక్షంగా స్టాలిన్ పేరే వినపడుతుంది. అయినా ఎక్కడోఅనుమానం. అన్న ఆళగిరి అంగీకరిస్తారా? లేదా? అన్న భయం ఇటు స్టాలిన్ కుటుంబంలోనూ ఉంది. ఈ నెల 14వ తేదీన డీఎంకే కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే స్టాలిన్ ను డీఎంకే అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు.

ఇతరులకు అవకాశం ఇవ్వకుండా…..

అన్నాడీఎంకే మాదిరి కాకుండా కుటుంబంలో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలను తీసకోవాలని స్టాలిన్ భావిస్తున్నారు. తండ్రి మరణించి వారం తిరక్కముందే కుటుంబం వీధిన పడిందన్న విమర్శలు రాకూడదని కరుణ కుటుంబం మొత్తం భావిస్తోంది. కుటుంబంలో తగాదాలను వైరిపక్షాలు తమకు అనుకూలంగా మలచుకుంటాయన్న భయం కూడా ఉంది. కాని ఆళగిరి మనస్సులో ఏముందో తెలియదు. ప్రస్తుతం ఆళగిరికి, డీఎంకేకు సంబంధం లేదు. కరుణ జీవించి ఉన్నప్పుడే ఆళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయనకు డీఎంకేతో సంబంధం లేదన్న వాదన కూడా ఉంది.

ఆళగిరి లేకుంటే…..

కాని కరుణ చివరిరోజుల్లో మళ్లీ ఆళగిరి దగ్గరయ్యారని చెబుతున్నారు. ఆళగిరికి దక్షిణ తమిళనాడులో పార్టీలో పట్టుంది. మధురైని అడ్డాగా చేసుకుని ఆళగిరి పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా సొంత బలాన్ని పెంచుకున్నారు. దక్షిణ తమిళనాడులో ఆళగిరి లేకుంటే డీఎంకే కు కష్టమేనన్నది కొందరి వాదన. అందుకోసం ఆళగిరిని దూరం చేసుకోవద్దని, ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆళగిరిని కలుపుకుని వెళ్లడమే మంచిదని స్టాలిన్ కు కొందరు ఇప్పటికే సూచించారు. దీంతో మెత్తబడ్డ స్టాలిన్ తమ ముఖ్యబంధువులకు ఆళగిరితో మాట్లాడే పనిని అప్పగించారు.

ఒప్పందం కుదిరిందా….?

అయితే ఆళగిరి స్టాలిన్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడానికి అంగీకరించవచ్చంటున్నారు. అయితే తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ కాని, ప్రధాన కార్యదర్శి పదవికాని కావాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్బళగన్ వ్యవహరిస్తున్నారు. కరుణానిధికి అన్బళగన్ ఆప్తమిత్రుడు. అయితే ఆయన కూడా వయోభారంతో ఉన్నారు. కరుణానిధికంటే రెండేళ్లు పెద్దయిన అన్బళగన్ తనకు ఈ బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ఇటీవల స్టాలిన్ ను కోరారని తెలుస్తోంది. దీంతో ఆళగిరికి ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగిస్తారన్న టాక్ కూడా పార్టీలో ఉంది. మొత్తం మీద ఈ నెల14వ తేదీన స్టాలిన్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరిస్తారు. మరి ఆళగిరి ఏం చేస్తారనేది ఈ మూడురోజులూ ఉత్కంఠే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*