ఆళగిరి ఆలోచన అదేనా?

కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరిని పార్టీ నేతలు పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదా? మంచిగానే ఉండి మందీ మార్బలాన్ని సంపాదించు కోవాలనుకుంటున్నారా? అవును. ఆళగిరి ఇప్పుడు దాదాపు మధురై ప్రాంతానికి చెందిన నేతలు తప్పించి మిగిలిన జిల్లాల నేతలు ఆళగిరికి మొహం చాటేశారా? అంటే అవుననే చెబుతున్నారు. స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ముందు వరకూ చెన్నైలోని ఆళగిరి నివాసం కార్యకర్తలు, నేతలతో కళకళలాడేది. కాని తర్వాత నేతలే కాదు కార్యకర్తలు కూడా మొహం చాటేశారు. వచ్చే నెల 5వ తేదీన ర్యాలీ ఉండటంతోనే ఆళగిరి ఇలా మాట్లాడుతున్నారని చెబుతున్నారు.

ర్యాలీ విఫలమవతుందనే…..

సెప్టంబరు 5వ తేదీన ఆళగిరి భారీ ర్యాలీకి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు లక్షమందితో చెన్నపట్నంలో కవాతు నిర్వహించి తమ్ముడికి సవాల్ విసరాలనుకున్నారు. కాని పరిస్థితి చూస్తుంటే అది సాధ్యం అయ్యే పనిలా లేదు. మొన్నటి వరకూ టచ్ లో ఉన్న నేతలు కూడా ఇప్పుడు అందుబాటులోకి రావడం లేదు. డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత స్టాలిన్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తనకు సోదరుడు లేడని, సోదరి మాత్రమే ఉందని, ర్యాలీకి వెళితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

ధైర్యం చేయడానికి…..

అప్పటివరకూ అన్నదమ్ములిద్దరూ ఎప్పటికైనా ఒక్కటవుతారని భావించిన డీఎంకే నేతలు ఇక కుదరదన్న నిర్ణయానికి వచ్చారు. ఆళగిరి ప్రస్తుతం పార్టీలో కూడా లేరు. స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై డీఎంకేను తన గుప్పిట్లో ఉంచుకున్నారు. డీఎంకే అగ్రనేతలు, కరుణానిధి కుటుంబం యావత్తూ స్టాలిన్ కే మద్దతు పలుకుతుండటం కూడా కొందరు లోలోపల అసంతృప్తి ఉన్నా ఆళగిరి వెంట వెళ్లాలనుకున్నప్పటికీ ఆ ధైర్యంచేయలేక పోతున్నారు. అందుకే ఆళగిరి వెంట నడవలేకపోతున్నారు. స్టాలిన్ రెండు దశాబ్దాలుగా పార్టీ కార్యక్రమాలను చూస్తున్నారు. రెండేళ్లుగా పార్టీపై పూర్తిగా పట్టు సాధించారు. కిందిస్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నేతలతో స్టాలిన్ కు సత్సంబంధాలున్నాయి.

స్టాలిన్ ససేమిరా…..

దీంతోనే స్టాలిన్ ఆళగిరిని పార్టీలోకి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ తీసుకున్నప్పటికీ ప్రతిరోజూ సమస్యలు ఎదురవుతాయని భావించిన స్టాలిన్ ఆళగిరిని పార్టీలోకి రానిచ్చేది లేదని చెప్పారు. అందువల్లనే ఆళగిరి ఒక మెట్టు దిగి తనను పార్టీలో చేర్చుకుంటే స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తానని చెప్పారంటున్నారు. ర్యాలీ సక్సెస్ అయ్యేంత వరకూ స్టాలిన్ తో పాటు నేతలతో మంచిగా మెలగాలన్నదే ఆళగిరి ఆలోచన. నిన్న మొన్నటి వరకూ డీఎంకేలో చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన ఆళగిరి ఒక్కసారి మాట మార్చడం వెనక ర్యాలీయేనన్నది ఆయన సన్నిహితుల నుంచి విన్పిస్తున్న మాట. ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తుంటే ర్యాలీ కూడా పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశం లేదంటున్నారు. మరి ఆళగిరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*