ఆళగిరి ఏమయ్యారు..???

whereis alagiri

ఆళగిరి ఏమై పోయినట్లు….? కరుణానిధి మరణం తర్వాత కొన్ని రోజులు హడావిడి చేసిన ఆళగిరి ఇప్పుడు సైలెంట్ ఎందుకయ్యారు? వేచి చూద్దామనే ధోరణా….? లేక సమయం ఇది కాదనా? ఇదే చర్చ ప్రస్తుతం తమిళనాడులో విస్తృతంగా జరుగుతోంది. కరుణానిధి మరణం తర్వాత ఆళగిరి చేసిన అలజడి అంతా ఇంతా కాదు. డీఎంకే పార్టీలోకి తనను తీసుకోవాలని స్టాలిన్ పై గట్టి వత్తిడే తెచ్చారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల డీఎంకే కార్యకర్తలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

ర్యాలీ తర్వాత…..

ఆ తర్వాత చెన్నైలో భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. అయితే అది పెద్దగా సక్సెస్ కాకపోయినా డీఎంకే జెండా, కరుణానిధి ఫొటోలతోనే ర్యాలీని నిర్వహించి మౌనం దాల్చారు. ర్యాలీ తర్వాత ఆళగిరి జాడ మళ్లీ లేదు. ఆళగిరి తిరిగి డీఎంకేలో చేరాలని గట్టిగానే ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ద్వారా వత్తిడి తెచ్చారు. కానీ స్టాలిన్ దానికి ససేమిరా అన్నారు. తండ్రి వేసిన సస్పెన్షన్ ఆళగిరిపై తొలగించేందుకు స్టాలిన్ ససేమిరా అన్నారు.

రెండు నెలల నుంచి…..

దీంతో ఆళగిరి కొత్త పార్టీ పెడతానని దాదాపుగా ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడులో పలుచోట్ల పోస్టర్లుకూడా వెలిశాయి. కొత్త పార్టీ ని పక్కనపెట్టి ఆళగిరి రజనీకాంత్ వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే గత రెండు నెలల నుంచి ఆళగిరి మౌనంగానే ఉంటున్నారు. కేవలం మధురై ప్రాంతం నుంచి వచ్చిన నేతలతో సమావేశాలు తప్ప ఆయన పెద్దగా పాలిటిక్స్ ను పట్టించుకున్నది లేదు.

భవిష్యత్ కార్యాచరణపై……

అయితే త్వరలో జరగనున్న తిరువారూర్ నియోజకవర్గంలో తాను పోటీ చేయనున్నట్లు ఆళగిరి గతంలోనే ప్రకటించారు. తిరువారూర్ తన తండ్రి కరుణానిధి సొంత నియోజకవర్గం కావడంతో తానే అసలైన వారసుడినని చెప్పారు. కొన్ని రోజులు తిరువారూర్ లో పర్యటించి వచ్చారు. కానీ ఆ తర్వాత మాత్రం తిరువారూర్ వైపు కూడా వెళ్లలేదు. మొత్తం మీద ఆళగిరి మౌనం ఎటువైపునకు దారితీస్తుందోనన్న ఆందోళన డీఎంకేలో ఉంది. అయితే స్టాలిన్ మాత్రం ఆళగిరిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు సుతారమూ ఇష్టపడటం లేదు. మరికొద్ది రోజుల్లోనే ఆళగిరి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*