ఆల్ “ఫ్రీ” అజెండా అందరిదీ…!

వెన‌క‌టికి.. ఏదో సామెత చెప్పిన‌ట్టు.. కొండ‌నాలిక్కి మందేస్తే.. ఉన్ననాలిక ఊడిన చందంగా మారిపోతోంది రాష్ట్రం ప‌రిస్థితి. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా `ఆల్ ఫ్రీ` హామీలు ఇక్కడ ఎక్కువై పోతుండ‌డం గ‌మ‌నార్హం. స‌మాజంలోని అన్ని కులాల వారికీ.. కార్పొరేష‌న్లు పెట్టిన ఏకైక రాష్ట్రంగా కూడా ఏపీనే నిలుస్తోంది. ఇక‌, కార్పొరేష‌న్లు పెట్టడం, వాటికి వంద‌ల కోట్ల నిధులు బ‌డ్జెట్ కేటాయింపులు చేయ‌డం, అవ‌స‌రం ఉన్నా లేకుండా నిధుల ఖ‌ర్చుకు ప‌గ్గాలు లేకుండా చేయ‌డం వంటి ఆర్థిక వికృత చేష్టలు ఏపీలోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

పోటాపోటీగా…..

ఏపీలో అధికార పార్టీ టీడీపీ మొద‌లుకుని అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్న వైసీపీ వ‌ర‌కు, అస‌లు ప్రత్యక్ష రాజ‌కీయాల పొద్దెర‌గ‌ని జ‌న‌సేన సైతం ప్రజ‌ల‌కు హ‌మీలపై హామీలు ఇస్తున్నాయి. ఇవి.. రాష్ట్ర త‌ల‌స‌రి ఆదాయాన్ని మించి పోతుండ‌డమే.. త‌ల‌పండిన ఆర్థిక వేత్తల‌ను సైతం విస్మయానికి గురి చేస్తోంది. విష‌యంలోకి వెళ్తే.,. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అన్ని కులాల వారికీ కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసిన కోట్లకు కోట్లు నిధులు కేటాయించారు. ఇక‌, సామాజిక పింఛ‌న్లు ఇస్తున్నారు.

తాజా ప్రకటనలతో…..

వ‌యోవృద్ధులు, వితంతువులు, విక‌లాంగులు ఇప్పటి వ‌ర‌కు ఈ పింఛ‌న్లకు అర్హత సాధిస్తే.. ఇక‌పై ఒంట‌రిగా ఉంటున్న మ‌హిళ‌ల‌కు కూడా పింఛ‌న్ ఇవ్వాల‌ని చంద్రబాబు నిర్ణయించ‌డంతో దాదాపు రాష్ట్రంలోని 40 ల‌క్షల మంది ఒంట‌రి మ‌హిళ‌ల‌కు ఈ పింఛ‌న్లు అంద‌నున్నాయి. ఇక‌, ఇప్పుడు.. తాజాగా ఇప్పటికే ఉన్న విద్యార్థుల‌కు తోడు ఔత్సాహిక లాయ‌ర్ విద్యార్థుల‌కు కూడా నెల‌కు ఐదు వేల చొప్పున స్టయిఫండ్ ఇస్తామ‌ని చెప్పడం ద్వారా మ‌రో కొన్ని వంద‌ల కోట్ల భారాన్ని ప్రభుత్వం నెత్తిన ఎత్తుకున్నట్టుగానే భావించాల‌నేది విశ్లేష‌కుల మాట‌.

గతంలో ఇచ్చిన హామీలనే….

లోటు బ‌డ్జెట్‌తో ఏపీ పాల‌న ప్రారంభించిన చంద్రబాబు గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలే నెర‌వేర్చలేని ప‌రిస్థితి. ఇవ‌న్నీ ప‌క్కన పెట్టేసి ఇప్పుడు కొత్త హామీల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రెడీ అవ్వాల‌న్నది ఆయ‌న ప్లాన్‌. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ పార్టీ అధినేత జ‌గ‌న్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఎదురుప‌డ్డ ప్రతి ఒక్కరికీ హామీల‌పై హామీలు గుప్పిస్తున్నారు. చేనేత వృత్తుల వారికి 45 ఏళ్లకే పింఛ‌న్ ఇస్తామ‌ని ఆయ‌న చెప్పడం ద్వారా రాష్ట్ర ఖ‌జానాపై భారీ ఎత్తున భారం ప‌డుతుంద‌నేది విశ్లేష‌కులమాట‌.

కంటిన్యూ చేయాల్సిందే…..

అదేవిధంగా పిల్లాణ్నిస్కూల్లో జాయిన్ చేస్తే చాలా అకౌంట్‌లో రూ.15000 వేస్తాన‌ని చెప్పడం ద్వారా కూడా ఆర్థిక ప‌రిస్థితిని దెబ్బతీసే విధంగానే ఉంద‌న్నది నిపుణుల మాట‌. ఇక‌, ఇప్పటికే చంద్రబాబు ప్రారంభించిన వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగించి తీరాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఎవ‌రికి పింఛ‌న్ ఆపేసినా.. ఏ కార్పొరేష‌న్‌ను ఎత్తేసినా.. రాజ‌కీయంగా కొంప‌లు మునిగిపోయే ప‌రిస్థితులే నెల‌కొన్నాయి. ఇక చంద్రబాబు కంటే ముందు వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఇచ్చిన ఉచిత హామీల‌ను కూడా కంటిన్యూ చేయాలి. వాటిని కంటిన్యూ చేస్తూ కొత్త హామీల‌ను అమ‌లు చేయ‌డం ఏపీలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పెను స‌వాల్‌. అయినా వీటిని ప‌ట్టించుకోని నాయ‌కులు హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో.. నేత‌ల హామీలు.. రాష్ట్రాన్ని ఆర్థికంగా అథోగ‌తిలోకి నెట్టడం కాక‌ మ‌రేమిట‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*