ఆళ్లపై పోటీకి ఆమె…..!

పంచుమ‌ర్తి అనురాధ‌. గ‌తంలో విజ‌య‌వాడ మేయ‌ర్‌గా ప‌నిచేసిన ఆమె పార్టీలో నిబ‌ద్ద‌త క‌లిగిన మ‌హిళా నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. బీసీ వ‌ర్గానికి చెందిన పంచుమ‌ర్తి.. ప‌ద్మ‌శాలి సామాజిక‌వ‌ర్గం నుంచి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. అనివార్య ప‌రిస్థితుల కార‌ణంగా కొన్ని రోజులు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఆమె పార్టీ నుంచి టికెట్‌ను ఆశించారు. అయితే, అప్ప‌టి స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆమెకు టికెట్ ఇవ్వ‌డం కుద‌ర‌లేదు. దీంతో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నేఆమెకు చంద్ర‌బాబు ఎమ్మెల్సీ టికెట్ ఆఫ‌ర్ చేశారు. అయితే ఆమె దానిని తీసుకునేందుకు ఆస‌క్తి చూపించ‌లేదు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర తెలుగు మ‌హిళ ప‌ద‌విని ఆమెకు అప్ప‌గించారు. త‌ర‌చుగా విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై పెద్ద ఎత్తున విరుచుకుప‌డుతూ.. ఆమె పార్టీని, ప్ర‌భుత్వానికి అండ‌గా నిలుస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె టికెట్ ఆశిస్తున్నారు.

మంగళగిరి నుంచి……

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఆమె రాజ‌కీయ స‌త్తాపై తాజాగా ఇంటిలిజెన్స్ వ‌ర్గాల నుంచి నివేదిక‌లు తెప్పించుకున్నారు. దీనిని విశ్లేషించారు కూడా. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం అయితే.. పంచుమ‌ర్తి గెలిచే ఛాన్స్ ఉంటుందని తెలిసింది. ఇక్క‌డ చేనేత వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్నాయి. దీనికితోడు బీసీల ఓటు బ్యాంకు కూడా బాగానే ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పంచుమ‌ర్తికి టికెట్ ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం. అయితే, అదేస‌మ‌యంలో ఈ టికెట్ జ‌న‌ర‌ల్ కావ‌డంతో న‌ర‌స‌రావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రాయ‌పాటి రంగారావు, గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి కేవ‌లం 12 ఓట్ల తేడాతో ఓడిపోయిన గంజి చిరంజీవి.. వీరితోపాటు పోతినేని శ్రీనివాస‌రావు కూడా ఇక్క‌డ టికెట్ ఆశిస్తున్నారు.

నలుగురు ఆశావహులున్నా……

వీరిలో గ‌త ఎన్నిక్లో తాను పార్టీ కోసం ఎంతో ఖ‌ర్చు చేశాన‌ని.. ఇప్పుడు టికెట్ త‌న‌కే ఇవ్వాల‌ని చిరంజీవి వాదిస్తున్నారు. అయితే ఆయ‌న వ్య‌వ‌హార శైలితో ఇక్క‌డ పార్టీ న‌ష్ట‌పోయింద‌న్న నివేదిక‌లు చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్లాయి. దీంతో చిరంజీవికి టిక్కెట్ ఇచ్చే ఛాన్సే లేదు. అదేస‌మ‌యంలో రాయ‌పాటి ఫ్యామిలీ నుంచి వార‌సుడిగా రంగంలోకి దిగాల‌ని భావిస్తున్న రంగారావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. అయితే అనేక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో రాయ‌పాటి రంగారావుకి వేరే స్థానం ఇచ్చి.. ఈ టికెట్‌ను అనురాధ‌కు ఇవ్వాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. వీరింద‌రికీ కూడా నిఘా స‌ర్వేలో ఒక‌టి రెండు మార్కుల తేడాతో దాదాపు అంద‌రికీ ఒకే విధ‌మైన మార్కులు రావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అనురాధ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. బీసీ, లేడీ కోటాలో ఆమెకు సీటు ఇస్తే పార్టీకి చాలా ప్ల‌స్ అవుతుంద‌న్న భావ‌న‌లో బాబు ఉన్నార‌ట‌. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై ఈసారి అనురాధ పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*