తిరువారూర్ తేల్చేస్తుంది….!!

alliances in tamilnadu politics

తమిళనాట లోక్ సభ ఎన్నికలకు ముందే పొత్తులపై ఒక స్పష్టత రానుందా? తిరువారూర్ ఉప ఎన్నిక సందర్భంగా మిత్రులెవరో? శత్రువులెవరో స్పష్టం కానుందా? అవును.. లోక్ సభ ఎన్నికలకు ముందే వచ్చిన తిరువారూర్ ఉప ఎన్నిక అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వనుందంటున్నారు విశ్లేషకులు. తమిళనాట ఇప్పుడు రాజకీయ గందరోళం నెలకొంది. అధికార అన్నాడీఎంకేతో బీజేపీ కలసి వెళుతుందా? ప్రతిపక్ష డీఎంకేతో దినకరన్ పార్టీ అంటకాగనుందా? కొత్తగా పార్టీ పెట్టిన కమల్ హాసన్, పార్టీని ప్రకటించబోతున్న రజనీకాంత్ ఎటువైపు ఉంటారు? ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా తిరువారూర్ ఉప ఎన్నిక తేల్చనుందంటున్నారు.

కూటమి ఏర్పాటుకు…..

డీఎంకే అధినేత కరుణానిధి మృతితో తిరువారూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈనెల 28న జరగనుంది. ఈ సీటు డీఎంకే దికావడంతో ఆ పార్టీకి తిరిగి గెలవడం ఇక్కడ అనివార్యం. సిట్టింగ్ సీటును చేజిక్కించుకుని తమ సత్తా చూపుతామంటోంది అన్నాడీఎంకే. ఈ ఇద్దరి సవాళ్లు ఎలా ఉన్నా? ముందు ఈ ప్రధాన పార్టీలతో ఎవరు కలుస్తారన్న చర్చ జోరుగా నడుస్తోంది. డీఎంకే సిట్టింగ్ సీటు కావడంతో ఇప్పటికే తిరువారూర్ ఉప ఎన్నికలో ఎండీఎంకే, టీఎంసీ, వామపక్షాలు, ఐయూఎంఎల్‌ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే దినకరన్ మాత్రం అభ్యర్థిని ప్రకటించారు.

దినకరన్ ను కట్టడి చేసేందుకు…..

కానీ దినకరన్ ను కట్టడి చేయడానికి కాంగ్రెస్ సినీనటి విజయశాంతిని ప్రయోగించిందంటున్నారు. ఇటీవల పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళను విజయశాంతి కలిశారు. ప్రధానంగా వీరి మధ్య వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి ప్రయాణం చేయాలని ఆమె శశికళను కోరారు. దీంతో పాటు తిరువారూర్ ఉప ఎన్నికలో దినకరన్ పోటీ పెట్టకుండా డీఎంకేకు మద్దతివ్వాలని ఆమె కోరినట్లు చెబుతున్నారు. ఈ మేరకు శశికళ కూడా దీనికి అంగీకరించారన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. తిరువారూర్ లో ద్విముఖ పోటీ మాత్రమే ఉండాలని డీఎంకే, కాంగ్రెస్ లు కోరుకుంటున్నాయి. దీనిపై దినకరన్ స్పందించాల్సి ఉంది.

బీజేపీ వ్యూహమేంటి?

మరోవైపు అధికార అన్నాడీఎంకే కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తులు ప్రారంభించింది. రెండురోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తిరువారూర్ లో పోటీ చేసేందుకు అన్నాడీఎంకేకు దాదాపు 54 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. అయితే అన్నాడీఎంకేకు బీజేపీ మద్దతివ్వాలని దాదాపుగా నిర్ణయించింది. కానీ అన్నాడీఎంకేను ఈ ఉప ఎన్నికల్లో నిలువరించి అక్కడి నుంచి కరుణానిధికుమారుడు ఆళగిరిని బరిలోకి దించాలని బీజేపీ యోచిస్తోంది. ఆళగిరి రంగంలోకి దిగితే ఈక్వేషన్లు మారిపోతాయంటున్నారు. మొత్తం మీద తిరువారూర్ ఉప ఎన్నిక రానున్న లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై ఒక స్పష్టత తీసుకువస్తుందన్నది మాత్రం వాస్తవం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*