అంబటికి అత్తెసరు మార్కులే….!!!

ambati rambabu-ysr congress party

అంబటి రాంబాబు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గొంతుక. అధికార పార్టీని విమర్శించాలన్నా, తమ పార్టీని సమర్థించుకోవాలన్నా అంబటిరాంబాబుకు మించిన వారు లేరు. వైఎస్ కు వీరవిధేయుడిగా పేరున్న రాంబాబు ఆయన తనయుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీలకంగా మారారు. అంబటి రాంబాబు గత ఎన్నికల్లో సత్తెన పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోడెల శివప్రసాదరావు మీద కేవలం 700 ఓట్ల తేడాతోనే ఓటమి చవి చూశారు. అప్పటి నుంచి అంబటి రాంబాబు సత్తెనపల్లి వేదికగానే చేసుకుని తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. క్యాడర్ జారిపోకుండా నాలుగున్నరేళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు.

నిత్యం ప్రజల్లో ఉంటూ….

ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నిత్యం సత్తెనపల్లిలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం సత్తెన పల్లిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత ఏమీ బాగాలేదు. కోడెల శివప్రసాద్ పైన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణ తీరును కూడా ప్రజలు నిరసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అంబటి గెలుపు ఖాయమని నిన్న మొన్నటి దాకా అందరూ భావించారు. బహుశ అంబటి కూడా అదే అనుకుని ఉండొచ్చు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సమీకరణలు మారుతున్నాయి.

ఎవరికీ కంచుకోట కాదు…..

నిజానికి సత్తెనపల్లి నియోజకవర్గం ఏ పార్టీకి కంచుకోట కాదు. వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి స్వాంత్రత్ర్య సమరయోధులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమిది. నాలుగుసార్లు వావిలాల ఇండిపెండెంట్ గా గెలిచారు. 1952 నుండి జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు సీపీఎం, మూడు సార్లు కాంగ్రెస్, మూడుసార్లు టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ నియోజకవర్గానికి ఒక విశిష్టత ఉంది. 1972 నుంచి 2004 జరిగిన ఎన్నికల్లో ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలవకపోవడం ఇక్కడ విశేషం. వావిలాల తర్వాత ఎవరూ వరుసగా ఎవరూ గెలవలేదు. అయితే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా యర్రంశెట్టి వెంకటేశ్వర్ రెడ్డి వరుసగా గెలిచి ఆయన ఈ సంప్రదాయానికి బ్రేక్ వేశారు.

త్రిముఖపోటీ కావడంతో…..

అలాంటిది ఈసారి ద్విముఖ పోటీ ఉంటుందని తొలుత అందరూ భావించారు. అంబటిరాంబాబు మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. కోడెల శివప్రసాదరావు కూడా పోటీకి సై అంటున్నారు. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకం. ఇదే సామాజిక వర్గం గెలుపోటములను నిర్ణయిస్తుంది. అయితే ఈసారి జనసేన బరిలో ఉండటంతో కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిపోయి అంబటికి దెబ్బపడే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. కాపు ఓట్లు చీలితే తాను సునాయాసంగా గెలుస్తానన్న ధీమా కోడెలలో వ్యక్తమవుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఉంటే తాను బరిలో ఉంటానని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత యర్రంశెట్టి వెంకటేశ్వరరెడ్డి. మొత్తం మీద త్రిముఖపోటీలో అంబటి రాంబాబుకు సత్తెనపల్లి అంత ఈజీ కాదన్నది స్పష్టమవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*