షా…..వీళ్లకు షాకిస్తారా?

నిస్తేజంలో ఉన్న తెలంగాణ భారతీయ జనతా పార్టీని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాడిలో పెడతారా? ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేశారా? తెలంగాణ బీజేపీ నుంచి వరుసగా నేతలు వెళ్లిపోతుండటం, ఇక్కడ నాయకత్వం పెద్దగా పట్టించుకోకపోవడం అమిత్ షాకు అసహనం తెప్పిస్తుందంటున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా లేకపోయినా అక్కడ అధికార పార్టీకి ధీటుగా నేతలు వ్యవహరిస్తున్నారు. కాని తెలంగాణలో మాత్రం నేతల మధ్య కుమ్ములాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ఈనెల 22న పర్యటన…..

ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. షా ఒక్కరోజు పర్యటన బీజేపీ నేతల్లో వణుకు పుట్టిస్తుంది. ఆయన ఒక్కరోజు పూర్తిగా కార్యాలయంలోనే గడపనున్నారు. ఆయన పూర్తి సమయాన్ని పార్టీ వ్యవహారాలను సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఈరోజంతా తెలంగాణ బీజేపీ నేతలకు క్లాస్ తప్పదని భయపడిపోతున్నారు. ఏడాది నుంచి అమిత్ షా రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఉన్న కొద్దిమంది నేతలు ఎవరికి వారే కార్యక్రమాలను రూపొందించుకోవడం, గ్రూపులు కట్టడంతో ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ చక్కదిద్దుతారని భావించారు. కాని అమిత్ షా పర్యటన ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది.

పూర్తి సమయం కార్యాలయంలోనే….

కర్ణాటక ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అమిత్ షా దృష్టంతా దక్షిణాది రాష్ట్రాలపైనే పెట్టారు. అందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా తెలంగాణ ఒక్కరోజు పర్యటనలో పార్లమెంటు స్థానాలపైనే అమిత్ షా సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు స్థానాలతో పాటు బూత్ లెవెల్ కమిటీల పనితీరును కూడా షా పరిశీలించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది తెలంగాణలో పార్టీ రూపొందించిన కార్యక్రమాలను కూడా అడిగి తెలుసుకోనున్నారు.

పార్లమెంటు స్థానాలపైనే….

మరోవైపు తెలంగాణలోని పార్లమెంటు, నియోజకవర్గాల వారీగా ఒక రోజంతా నేతలతో సమావేశం కానున్నారు. వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకోనున్నారు. తాను ప్రత్యేకంగా తెప్పించుకున్న సమాచారాన్ని కూడా అమిత్ షా నేతల వద్ద ఉంచబోతున్నట్లు తెలిసింది. నాగం జనార్థన్ రెడ్డి వంటి నేతలు పార్టీని వీడి వెళ్లడానికి గల కారణాలు ఇప్పటికే కొందరు నేతలు కేంద్ర నాయకత్వానికి నివేదిక అందించారు. అయితే అమిత్ షాకు తమ సమస్యలను కూడా తెలిపేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇక్కడ నాయకత్వం బలోపేతం చేయాలని షాను కొందరు బీజేపీ నేతలు కోరనున్నట్లు సమాచారం. మొత్తం మీద అమిత్ షా పర్యటన పార్టీ వర్గాల్లో గుబులు పుట్టిస్తుందనే చెప్పాలి.