అమిత్…అందుకే అందరివాడు….!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తర్వాత మూడో ప్రముఖ నాయకుడు అమిత్ షా అని చెప్పడం అతిశయోక్తి కాదు. కేంద్రంలో రెండు పదులకు పైగా రాష్ట్రాల్లో అధికారం నెరుపుతున్న పాలక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి అంత ప్రాధాన్యం ఉండటం సహజమే. 1984లో రాజీవ్ గాంధీ తర్వాత కేంద్రంలో ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీతో అధికారం చేపట్టలేదు. అటువంటి పార్టీ బీజేపీ మాత్రమే. అంతటి ప్రతిష్టాత్మకమైన పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం ఆషామాషీ కాదు. మరో రెండు నెలల్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలతో ప్రస్తుతం తలమునకలై ఉన్నారు అమిత్ షా. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను అమిత్ షా నేతృత్వంలోనే ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది.

పదవీకాలం ముగిసినా…..

వాస్తవానికి షా పదవీకాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. ఇందుకోసం సంస్థాగత ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. కానీ వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంస్థాగత ఎన్నికలను పార్టీ వాయిదా వేసింది. ఫలితంగా షా పదవీకాలం పొడిగించినట్లయింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హోంమంత్రి పదవి చేపట్టడంతో షా అధ్యక్షుడయ్యారు. 2016 జనవరిలో సంస్థాగత ఎన్నికల ద్వారా మళ్లీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. అధ్యక్షుడి పదవీ కాలం రెండేళ్లు. ఈ లెక్కన వచ్చే జనవరి నెలతో ఆయన పదవీ కాలం పూర్తవ్వాలి. కానీ పార్టీ ఆయన పదవీకాలాన్ని పొడిగించడం విశేషం. నాయకత్వ పటిమ, వ్యూహ చతురత, ఎత్తులు, పైఎత్తులు, సంస్థాగత నిర్వహణ సామర్థ్యంపై గల విశ్వాసమే ఆయనను మరోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది. తాజాగా మహబూబ్ నగర్ ప్రచార సభ ద్వారా తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని షా పూరించారు.

మోదీకి నమ్మిన బంటుగా…..

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వివిధ మంత్రిత్వ శాఖలకు సారథిగా వ్యవహరించిన షా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. 1964 అక్టోబర్ 22న జన్మించిన షా ప్రధాని మోదీకి నమ్మిన బంటు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మోదీ ఆత్మ. ఆయనకు కళ్లు,చెవులు వంటి వారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసిన అమిత్ సా సంఘ్ లో, పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. గుజరాత్ రాజకీయాల్లో పట్టున్న శక్తిమంతమైన సహకార బ్యాంకు రాజకీయాల్లో మునిగి తేలారు. దేశంలోనే అతి పెద్దదైన అహ్మదాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా దానిని లాభాల బాటలో నడిపించారు. సహకార బ్యాంకులపై అప్పటి వరకూ పటేళ్లు, క్షత్రియుల ఆధిపత్యానికి గండికొట్టారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన అమిత్ షా రాష్ట్ర చెస్ అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా క్షేత్రస్థాయి రాజకీయాలను అవపోశన పట్టారు. తద్వారా క్రియాశీల రాజకీయాల్లో ఎలా నెగ్గుకు రావాలో నేర్చుకున్నారు.

తొలిసారి ఇక్కడి నుంచే….

తొలిసారి 1997 ఫిబ్రవరిలో జరిగిన సార్ఖే నియోజకవర్గంలోని ఉప ఎన్నికలో శాసనసభకు ఎన్నికైన షా తర్వాత వెనుదిరిగి చూడలేదు. అనంతరం 1998 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2002, 2007 లో కూడా అక్కడి నుంచే విజయం సాధించారు. 2012లో నారాయణ్ పుర నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. మోదీ మంత్రివర్గంలో పలు కీలక శాఖలను నిర్వహించారు. దాదాపుగా ఆయన చేయని శాఖలు లేవు. హోం, న్యాయ, జైళ్లు, ఎక్సైజ్, రవాణా, శాసనసభ వ్యవహారాలు తదితర కీలక శాఖలను నిర్వహించారు. 2013లో ప్రధాని అభ్యర్థిగా మోదీ పేరును పార్టీ ప్రకటించడంతో షా దశ తిరిగింది. ఒక్క సారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అత్యంత కీలకమైన, దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఇన్ ఛార్జిగా ఆయనను పార్టీ నియమించింది. మొత్తం 80 స్థానాలకు గాను 73 చోట్ల పార్టీ విజయకేతనం ఎగురవేయడం వెనక అమిత్ సా నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ, వ్యూహచరిత కారణమని చెప్పక తప్పదు.

ఎన్నో రాష్ట్రాల్లో కమలాన్ని….

2014లో పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యాక ఆయన ప్రభ అప్రహతిహతంగా కొనసాగుతుంది. ఆయన ఆధ్వర్యంలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, త్రిపుర, అసోం తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమలం కళకళ లాడింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఓడినప్పటికీ ఆయ ప్రభావం ఆయనపై పడలేదు. మణిపూర్, మేఘాలయ, గోవా, జమ్మూకాశ్మీర్ లలో సంకీర్ణ ప్రభుత్వాల స్థాపన వెనక షా కృషిని గుర్తించక తప్పదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి చేరువైనా…..కాంగ్రెస్, జేడీఎస్ కలసి పోవడంతో అక్కడ అధికారం దూరమైంది.

ఈ ఎన్నికలే కీలకం…..

మరో రెండు నెలల్లో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపైనే షా దృష్టి అంతా కేంద్రీకృతమైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు హిందీ రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో అధికారాన్ని నిలబెట్టు కోవడం ఖచ్చితంగా కత్తిమీద సాములాంటిదే. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో పాగా వేయడం, తెలంగాణలో బలోపేతం కావడం ఆయన ముందున్న లక్ష్యాలు. వీటి అనంతరం సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టనున్నారు. షా నాయకత్వ పటిమకు ఇవి పరీక్ష లాంటివి. మోదీ ప్రభ మసకబారుతున్నట్లు వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకోవడం అమిత్ షాకు గట్టి సవాల్. ఇందుకోసం ఇప్పటి నుంచే మిత్రులను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయన్న అంచనాల నేపథ్యంలో దక్షిణాదిన, ఈశాన్యాన ఆ లోటు భర్తీ చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా జాతీయ రాజకీయాల్లో వెలిగిపోతున్న అమిత్ షాకు 2010 ఏడాది చీకటి కాలం వంటిది. సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో ఆ ఏడాది జులై 25న సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది. రాష్ట్ర బహిష్కరణ సైతం విధించడంతో ఢిల్లీలోని గుజరాత్ భవన్ లో తలదాచుకున్నారు. మూడు నెలల అనంతరం బెయిల్ మంజూరు కావడంతో షా మళ్లీ రాజకీయ ప్రపంచంలోకి వచ్చారు. ఎన్ని విజయాలు సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా నాటి చేదు అనుభవాలు ఆయనను వెంటాడుతూనే ఉంటాయి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*