షా…ఇక ఫ్రీ అయిపోయినట్లే…ఇక ఇక్కడకు?

కర్ణాటక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారం పూర్తయిన తర్వాత అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ కీలకనేతలతో సమావేశం అవుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలకు సమాచారం అందింది. ఈ నెల 14వ తేదీన అమిత్ షాతో రెండు రాష్ట్రాల బీజేపీ నేతల సమావేశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ అధిష్టానం రెండు రాష్ట్రాల పార్టీ పరిస్థితిపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఇందుకు సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి.

కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో….

దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత కొద్దో గొప్పో క్యాడర్ ఉన్న రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అయితే నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండటంతో పెద్దగా ఏపీపై నాయకత్వం దృష్టి పెట్ట లేదు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడే అమిత్ షా తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అప్పట్లో ఏపీలో టీడీపీతో పొత్తు ఉండటంతో దానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఏపీలోనూ ఒంటరిగానే…..

కాని ఇప్పుడు విధిగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీతో కలిసి వచ్చేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ కేంద్రంగానే రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ పరిస్థితిని సమీక్షించాలని అమిత్ షా నిర్ణయంచారు. ఇప్పటికే హైదరాబాద్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయం అన్ని హంగులతో ముస్తాబయింది. జాతీయ నాయకులు వచ్చినా బస చేసేందుకు అన్ని వసతులను ఏర్పాటు చేశారు.

సన్నాహక సమావేశాల్లో….

ఇక ఏపీలో బీజేపీ అధ్యక్షుడి నియామకం జరపాల్సి ఉంది. ఏపీ అధ్యక్షుడిగా ఉన్న హరిబాబు అధ్యక్ష పదవికి రాజీనామాచేసి దాదాపు పదిహేను రోజులు గడుస్తుంది. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉండటంతో అమిత్ షా దీనిని పట్టించుకోవడం లేదు. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారం ఈరో్జు ముగియనుండటంతో ఇక బీజేపీ అధ్యక్షుడి నియామకం జరిగిపోనుంది. వచ్చే నెలలోనే అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఈనెల 17, 18వ తేదీల్లో పార్టీ ముఖ్యనేతల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. బూత్ కమిటీల నియామకం, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అమిత్ షాకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నివేదికలు అందాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి కాయకల్ప చికిత్స చేసేందుకు అమిత్ షా రెడీ అవుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*