దేవుడి పైనే భారం…!!

“ఆమె ఓ మూర్ఖురాలు. తనంతట తాను తెలుసుకోరు. ఎవరైనా చెబితే వినరు.” ఇదీ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పట్ల రాష్ట్ర, కేంద్ర నాయకత్వాల అభిప్రాయం. రాజస్థాన్ పై బీజేపీ ఆశలు దాదాపు వదులుకున్నట్లే. కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న కమలం పార్టీ ఉత్తరాదినైనా తమ పట్టు తగ్గలేదని నిరూపించుకోవడానికి తెగ తంటాలు పడుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ వంటి రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడం కష్టమే. ఇక్కడ సెంటిమెంట్లు కూడా అవే చెబుతున్నాయి. కానీ ఏదో ఒకటి చేసి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కిందా మీదా పడుతున్నారు.

గండి కొడుతన్న వసుంధర…..

కానీ అమిత్ షా ప్రయత్నాలకు వసుంధరరాజే గండికొడుతున్నారు. రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై విపరీతమైన అసంతృప్తి ఉంది. అంతేకాదు ముఖ్యమంత్రి వసుంధరరాజే పనితీరుపైనే ప్రజలు పెదవి విరుస్తున్నారు. దీనికి తోడు రాజ్ పుత్ లు, జాట్ లు క్రమంగా పార్టీకి దూరమయ్యారు. ముఖ్యనేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇక సర్వేల సంగతి చెప్పనక్కరలేదు. ఏ సర్వే చూసినా రాజస్థాన్ లో కమలం ఓటమి గ్యారంటీ అనే తేల్చేశాయి.

సొంత సర్వేలో సయితం…..

కమలం పార్టీ కేంద్ర నాయకత్వం రాజస్థాన్ లో ప్రత్యేకంగా సొంత సర్వే చేయించుకుంది. ముఖ్యంగా అమిత్ షా అభ్యర్థుల ఎంపికపై ఈ సర్వే నిర్వహించినట్లు చెబుతున్నారు. అయితే ఎక్కువ మంది సిట్టింగ్ లు ఈసారి గెలవడం కష్టమేనని తేలింది. దీంతో కొత్త అభ్యర్థుల ఎంపికపై షా తలమునకలై ఉన్నారు. యువత, మహిళలకు ఎక్కువ స్థానాలను కేటాయించాలని, సామాజికవర్గాల వారీగా రాజస్థాన్ రాష్ట్ర పార్టీ నుంచి నివేదిక తెప్పించుకుని జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

ఇద్దరి మధ్య కోల్డ్ వార్….

అయితే ఈ సందర్భంలో వసుంధరరాజే తాను ప్రత్యేకంగా రూపొందించిన అభ్యర్థుల జాబితాను కేంద్ర నాయకత్వానికి పంపడం వివాదమయింది. దాదాపు 120 మంది తో కూడిన జాబితాను వసుంధర షాకు పంపారు. అయితే ఇందులో సిట్టింగ్ ల పేర్లే ఎక్కువగా ఉండటంతో ఆ జాబితాను షా వెనక్కు తిప్పి పంపారు. వసుంధర రాజే ఇచ్చిన జాబితా ప్రకారం టిక్కెట్లు ఇస్తే సింగిల్ నెంబర్ సీట్లు కూడా రావని తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై వసుంధరరాజే కూడా ఆగ్రహంగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల జాబితా ఇంతవరకూ ప్రకటించలేదు.  అసలే ఓటమి అంచున ఉన్న పార్టీని బతికించుకోవాల్సిన సమయంలో అగ్ర నాయకుల మధ్య విభేదాలు మరింత నష్టం చేకూర్చే అవకాశాలున్నాయంటున్నారు పరిశీలకులు. మరి షా ఏం చేస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*