అన్నీ పక్కనపెట్టి…..ఆయనకే….!

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమర్థవంతమైన నాయకత్వం, వివిధ రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలతో బీజేపీ దేశ వ్యాప్తంగా కాషాయ జెండాను రెపరెపలాడించగలిగిందన్న విశ్వాసం బీజేపీ శ్రేణుల్లో ఉంది. అమిత్ షా వ్యూహం, ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ కారణంగానే భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వరుస విజయాలను సాధించిందన్న నమ్మకం కమలనాధుల్లో బలంగా ఉంది. అయితే వచ్చే ఎన్నికలకు ఎవరు సారథ్యం వహిస్తారన్న అనుమానాలకు దాదాపు కమలదళపతులు తెరదించేసినట్లే.

జనవరిలో ముగిసిపోతుండటంతో…..

వచ్చే ఏడాది జనవరిలోనే అమిత్ షా పదవీ కాలం ముగుస్తుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోకొత్త వ్యక్తికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అందులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్ ఘడ్ మినహా మరే రాష్ట్రంలో విజయం సాధించడం బీజేపీకి కష్టంగానే కన్పిస్తోంది.

ఆ ఎన్నికల ఫలితాలతో…..

ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత అమిత్ షా పదవీ కాలం కూడా పూర్తవుతుండటంతో అసమ్మతులు గళం విప్పే అవకాశముంది. ఆ రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమికి అమిత్ షాను బాధ్యుడిగా చేసే అవకాశమూ లేకపోలేదు. అధ్యక్షుడిని మార్చాలన్న డిమాండ్ ఖచ్చితంగా వస్తుంది. అందుకనే ముందుగానే ఇవన్నీ ఊహించి అమిత్ షాను వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించాలని ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.

మోడీ పట్టుబట్టి…….

అమిత్ షా కాకుండా మరెవరి సారథ్యంలోనూ లోక్ సభ ఎన్నికలకు వెళ్లడం మోదీకి ఇష్టం లేదు. తనకు ఆప్తమిత్రుడైన అమిత్ షా ఉంటేనే విజయాలు వరిస్తాయని మోదీ భావిస్తున్నారు. అందుకోసం ముందుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు అమిత్ షాయే లోక్ సభ ఎన్నికల వరకూ అధ్యక్షుడిగా కొనసాగాలని తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆర్ఎస్ఎస్ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాల్సి ఉంటుంది. అమిత్ షా ఇప్పటికే రెండుసార్లు అధ్యక్షుడిగా తన పదవీకాలాన్ని పూర్తి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ నిబంధనలను మార్చి 2019 ఎన్నికల వరకూ అమిత్ షాను కొనసాగించాలన్న నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*