ఆ ముగ్గురి వల్లనే….??

కర్ణాటక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి ముగ్గురు కారణమని యడ్యూరప్ప తేల్చారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ ప్రత్యేకంగా నివేదికను సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఐదు స్థానాల్లో కేవలం ఒక స్థానమే గెలిచింది. అదీ యడ్యూరప్ప సొంత నియోజకవర్గమైన శివమొగ్గ. శివమొగ్గలో సయితం మెజారిటీ భారీగా తగ్గడం కూడా కమలనాధులను కలవరపర్చింది. శివమొగ్గలో మెజారిటీ తగ్గడానికి, బళ్లారి, మాండ్య లోక్ సభ స్థానాలు, జమఖండి, రామనగర స్థానాల్లో ఓటమి గల కారణాలను పార్టీ నేతలు లోతుగా విశ్లేషించారు.

ఎవరిపై వ్యతిరేకత…..

ప్రధానంగా బళ్లారిలో బీజేపీకి గట్టి పట్టుంది. ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తామని బీజేపీ అంచనా వేసింది. అంతేకాకుండా ఇక్కడ బీజేపీ సీనియర్ నేత శ్రీరాములు సోదరి పోటీ చేస్తుండటం తమకు కలసి వస్తుందని అంచనా వేసింది. అయితే బళ్లారిలో లక్షకు పైగా ఓట్ల తో ఓడిపోవడం ఆపార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ మీద వ్యతిరేకతా? లేక శ్రీరాములుపై అసంతృప్తా? అన్నది పార్టీలోనే ఒక వర్గం నేతలు విశ్లేషణ చేస్తున్నారు.

గాలి, సోమణ్ణ వ్యాఖ్యలతో…..

ఇక బళ్లారిలో ఓటమికి గల కారణాలకు మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి, మాజీ మంత్రి సోమణ్ణలే కారణమని దాదాపు తేల్చేశారు. గాలి జనార్థన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలతో ఓటు బ్యాంకు టర్న్ అయిందని నివేదికలో పొందు పర్చారు. సిద్ధరామయ్య కుమారుడు మరణానికి, తన జైలు జీవితానికి ముడిపెట్టి చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి అనుకూల ఓటుబ్యాంకు అంతా కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప వైపు టర్న్ అయిందన్నది పార్టీ నేతలు అభిప్రాయం. అంతేకాకుండా కాబోయే సిఎం శ్రీరాములే నంటూ సోమణ్ణ చేసిన వ్యాఖ్యలతో యడ్యూరప్ప సామాజిక వర్గ ఓటర్లు కూడా దూరమయినట్లు తేల్చింది.

ఆయన వల్ల మిగిలిన నియోజకవర్గాల్లో….

ఇక మిగిలిన స్థానాల్లో ఓటమికి రామనగర అభ్యర్థి చంద్రశేఖర్ చేసిన నిర్వాకమే అని అభిప్రాయపడింది. రామనగరలో చంద్రశేఖర్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి తర్వాత పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ ప్రభావం అన్ని నియోజకవర్గాలపై పడిందని నేతలు తేల్చారు. ఈ మేరకు నివేదిక రూపొందించి అధిష్టానానికి పంపనున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో దక్షిణాదిలో ఒకే ఒక బలమైన రాష్ట్రమైన కర్ణాటకను కూడా ఇలా దూరం చేసుకోవద్దని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ గా చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు యడ్యూరప్ప సిద్ధం చేసుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలులో లోపాలను తన పర్యటనలో ఎండగట్టనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*