షా…నీ పప్పులుడకవ్ లే…..!

ఏపీ బీజేపీకి చికిత్స చేసేందుకు ఢిల్లీ వైద్యులు రంగంలోకి దిగుతున్నారు. త్వ‌ర‌లోనే ఐసీయూలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్న పార్టీకి.. మ‌ళ్లీ కొత్త ఊపిరి పోయాల‌నే ఆశ‌తో శ‌స్త్రచికిత్స‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రితో అడుగు పెట్ట‌బోతున్నారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అవ‌న్నీ బూడిద‌లో పన్నీరు అవుతాయ‌ని, కోలుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని తెలిసినా.. ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి రేంజ్‌లో ఢిల్లీ పెద్ద‌లు మాత్రం త‌మ ప‌ట్టు వీడ‌టం లేదు. ఇన్నాళ్లూ చిన్నా చిత‌కా నేత‌లు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేసినా.. ఇప్పుడు నిపుణుడు, ఇలాంటి విష‌యాల్లో ఆరితేరిన వైద్యుడు, చీఫ్ అయిన నేతనే న‌మ్ముకు న్నారు ఏపీ బీజేపీ నేత‌లంతా! ఏం చేసినా ఆయ‌న వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌నే న‌మ్మ‌కం పెట్టుకున్నారు. మ‌రి వీరు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కూ ఫలితాన్నిస్తాయి? ఆ చీఫ్ మంత్రాల‌కు ఇక్క‌డ ఏపీ బీజేపీ కోలుకుంటుందా ? ప్లాన్ స‌క్సెస్ అవుతుందా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి!

దారుణంగా మారడంతో…..

విభ‌జ‌న చ‌ట్టాన్ని అమ‌లుచేస్తామ‌ని న‌మ్మించి ఇప్పుడు కుంటిసాకుల‌తో మొండిచేయి చూపుతున్న బీజేపీపై ఏపీ ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం నివురు గ‌ప్పిన నిప్పులా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప‌ట్టిన గ‌తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి ప‌డుతుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బీజేపీతో క‌టీఫ్ త‌ర్వాత టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఇత‌ర నేత‌లు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీటికి బీజేపీ నేత‌లు స‌మాధానం చెబుతున్నా వినేవాళ్లు మాత్రం క‌రువ‌య్యారు. అంతేగాక వారిని ప‌ట్టించుకున్న దాఖ‌లాలు కూడా లేదు. దీంతో పార్టీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. ఇక ప‌రిస్థితి చేయిదాటియింది. ఇవ‌న్నీ నిశితంగా ప‌రిశీలిస్తున్న ఢిల్లీ పెద్ద‌లు.. ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు దృష్టిలో పెట్టుకుని, ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌ర్య‌టించారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా. ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న ఏపీ వైపు చూసింది లేదు. ఏపీలో ప‌ర్య‌టించిందీ లేదు!

త్వరలోనే ఆంధ్రా టూర్……

ఆ మ‌ధ్య, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో తిరుప‌తి వ‌స్తే… ప్రత్యేక హోదా ఉద్యమ సెగ అక్కడ అమిత్ షాకి బాగానే తగిలింది. అయితే, త్వ‌ర‌లోనే అమిత్ షా.. ఆంధ్రా టూర్ ఉంటుంద‌ని బీజేపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వీటికి సంబంధంచిన ఏర్పాట్ల‌పై రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ తోపాటు ఇత‌ర బీజేపీ ప్ర‌ముఖ నేత‌ల మ‌ధ్య చ‌ర్చిస్తున్నార‌ట‌. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అమిత్ షా నేతృత్వంలో భారీ బ‌హిరంగ స‌భ‌ల్ని నిర్వ‌హించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఆంధ్రాకు చేసిన సాయాన్ని పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నారు. వీటితో పాటు వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునేలా ప‌ర్య‌ట‌న ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌! అమిత్ షా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంలో.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నేత‌ల్ని చేర్చుకునే కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున నిర్వ‌హిస్తార‌ట‌. ఇప్ప‌టికే కొంత‌మంది ఉన్న‌త విద్యావంతులు, వ్యాపార వ‌ర్గాల‌కు చెందిన‌వారితో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ భేటీ అవుతున్న‌ట్టు స‌మాచారం.

ఇమేజ్ తెచ్చుకునే యత్నంలో…..

జిల్లా స్థాయి, మండ‌ల స్థాయిలో పెద్ద సంఖ్య‌లో చేరిక‌ల కార్యక్ర‌మాన్ని అమిత్ షా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌డం ద్వారా ఆంధ్రాలో త‌మ‌కు వ్య‌తిరేక‌త లేద‌నే ఒక ఇమేజ్ మార్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో మ‌రోసారి తామే అధికారంలోకి వ‌స్తామ‌ని, గ‌డ‌చిన ఎన్నిక‌ల ట్రాక్ రికార్డులే అందుకు సాక్ష్య‌మ‌ని చెబుతూ.. ఆంధ్రాకి జాతీయ స్థాయిలో ఏదైనా సాయం అందాలంటే అది బీజేపీ ద్వారా మాత్ర‌మే సాధ్య‌మ‌నే ఒక అభిప్రాయాన్ని ప్ర‌జ‌ల్లో బ‌లంగా క‌లిగించాల‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రి బీజేపీ ఆశ‌లు ఫ‌లిస్తాయో లేదో వేచిచూడాల్సిందే..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*