ఆయన దెబ్బ‌కు ఆనం విల‌విల‌.. ఏం జ‌రిగింది?

సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నుంచి ప‌లుమార్లు ప్రాతినిధ్యం వ‌హించిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి రాజ‌కీయ భ‌వితవ్యం అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క మాదిరిగా మారిపోయింది! రాజ‌కీయాల్లో అందునా వ‌చ్చే ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పాల‌ని భావించిన ఆయ‌న‌కు పెద్ద ఎదురు దెబ్బే త‌గిలింది. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ.. ఇలాంటి ప‌రిణామాన్ని ఆయ‌న ఊహించ‌నైనా ఊహించి ఉండ‌రు. దీంతో ఇప్పుడు ఆనంతో పాటు ఆయ‌న అనుచరులు కూడా రాజ‌కీయంగా ఎదురైన ప‌రిస్థితుల‌ను జీర్ణించుకోలేక పోతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా వ్య‌వ‌మ‌రించిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి.. మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. వైఎస్‌కు ఆత్మీయుడిగా ఆయ‌న ఓ వెలుగు వెలిగారు. ఆ త‌ర్వాత సీఎం అయిన న‌ల్లారి కిర‌ణ్ మంత్రి వ‌ర్గంలోనూ చ‌క్రం తిప్పారు.

మూడో స్థానానికే…..

అయితే, 2014 విభ‌జ‌న దెబ్బ‌తో ఆయ‌న ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవ‌డంతో పాటు ఏకంగా మూడో ప్లేస్‌తో స‌రిపెట్టుకున్నారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, అప్ప‌ట్లో చంద్ర‌బాబు నుంచి ద‌క్కిన హామీలు ఏవీ కూడా కార్య‌రూపం దాల్చ‌లేదు. ఎమ్మెల్సీ ప‌ద‌వీ, దానికి ఆస‌రాగా చేసుకుని మంత్రి ప‌ద‌వి ఇవ‌న్నీ ఒక్క‌టి కూడా ఏదీ సాకారం కాలేదు. ఎమ్మెల్సీ, మంత్రి ప‌ద‌వి ఆశల్లో తేలిన ఆయ‌న‌కు చివ‌ర‌కు ఆత్మ‌కూరు ఇన్‌చార్జ్ బాధ్య‌త‌ల‌తో స‌రిపెట్టారు. అయితే అక్క‌డ కూడా ఆయ‌న హ‌వా సాగ‌కుండా మంత్రులు సోమిరెడ్డి, నారాయ‌ణ అక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన క‌న్న‌బాబుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఆనం ర‌గిలిపోయారు.

టీడీపీ హామీ అమలు చేయకపోవడంతో…..

టీడీపీలో త‌మ‌కు ఇచ్చిన హామీ ఒక‌టి…ఇక్క‌డ చేస్తోంది మ‌రొక‌టి కావ‌డంతో పాటు…పార్టీలోనే కొంద‌రు త‌మ‌కు పొగ‌పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన రామ‌నారాయ‌ణ‌.. నేరుగా చంద్రబాబు పాల‌న‌పై విమ‌ర్శ‌లు సంధించారు. దీంతో ఆయ‌న దాదాపు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపించాయి. అయితే ఆయ‌న‌ను బుజ్జగించేందుకు చంద్ర‌బాబు ప‌లు విధాల ప్ర‌య‌త్నించినా.. ఏమీ ఫ‌లితం క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చేఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

నెల్లూరులో వైసీపీకి…..

నిజానికి నెల్లూరులో వైసీపీకి దిగ్గ‌జ‌నాయ‌కులు ఉన్నారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌ల గెలుపు గుర్రాలే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆనం రాకను జ‌గ‌న్ ఆహ్వానించారు. అయితే, వైసీపీలో చేరినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు పెట్ట‌ని కోట వంటి ఆత్మ‌కూరు టికెట్ ఇవ్వాల‌నేది ఆనం ష‌ర‌తు. అయితే, ఇప్ప‌టికే మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి కుమారుడు అక్క‌డ ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డంతో ఆయ‌న‌ను త‌ప్పించే ధైర్యం జ‌గ‌న్ చేయ‌డ‌నేది అంద‌రికీ తెలిసిందే. అయినా కూడా ఆనం ఆ టికెట్‌నే ప‌ట్టుబట్టార‌ని తెలిసింది. అయితే, జ‌గ‌న్ మాత్రం “మీరు పార్టీలోకి రండి. త‌ర్వాత చూద్దాం“ అని దాట వేత ధోర‌ణిలోనే స‌మాధానం చెప్ప‌డం ఆనంకు శ‌రాఘాతంగా మారింది. ఇప్పుడు టీడీపీలో ఉండ‌లేని ప‌రిస్థితి. పోనీ.. కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది కాబ‌ట్టి.. ఆ పార్టీలోకి వెళ్దామా? అంటే.. అక్క‌డ ప‌రిస్థితి మ‌రీఘోరం.

షరతులు లేకుండానే….

దీంతో ఆనం.. జ‌గ‌న్‌కే జైకొట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. షరతులు లేకుండా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు తెలిసింది. అయితే తమ కుటుంబ రాజకీయ భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలని రామనారా యణరెడ్డి గట్టిగా కోరినట్లు తెలిసింది. తన అన్న వివేకానందరెడ్డి మరణంతో ఆయన కుమారుడైన ఆనం రంగమయూర్ రెడ్డి కూడా రాజకీయంగా అవకాశం కల్పించాలని రామనారాయణరెడ్డి కోరారు. దీనికి జగన్‌ సమ్మతించినట్లు తెలిసింది. ఈ క్రమంలో పార్టీలో చేరడానికి ఆనం రామనారాయణరెడ్డి, రంగమయూర్‌రెడ్డి అంగీకరించారు. ఆనం రామనారాయ ణరెడ్డి వైసీపీలో చేరికతో ఇక జిల్లాలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఆయనకు ఏదో ఒక అసెంబ్లీ టికెట్‌ తప్పక ఇస్తారు. ఆ నియోజకవర్గం ఏదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆత్మ‌కూరులోకి రాకుండా మేక‌పాటి వాళ్లు ఆనంకు చెక్‌పెడితే అప్పుడు వెంక‌ట‌గిరి మాత్ర‌మే బెస్ట్ ఆప్ష‌న్‌గా ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*