ఆనంకు జగన్ ఆన….!…. ఇదేనా?

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇంతకూ ఆనం రామనారాయణరెడ్డికి ఏం హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీలో చేరబోతున్న ఆనం ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? నెల్లూరు జిల్లాలో ఎవరి సీటుకు ఆనం ఎర్త్ పెడతారు? ఇదే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ లీడర్. ఆనం రామనారాయణరెడ్డి రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందే తప్ప బలహీన పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే వైసీపీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో వైసీపీ నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో విజయం సాధించే అవకాశముందని తేలింది. దీంతో జగన్ పార్టీ నేతలు తమ సీట్లు తమకే వస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీలో ఈ సీటుకు…..

తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఉంటే ఆనం రామనారాయణరెడ్డికి ఖచ్చితంగా ఆత్మకూరు నియోజకవర్గం సీటు దక్కి ఉండేది. అక్కడ టీడీపీ నేత కన్నబాబును చంద్రబాబు ఒప్పించి ఉండేవారు. కాని వైసీపీలో పరిస్థితి అలాలేదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతంరెడ్డి ఉన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన గౌతమ్ రెడ్డి మరోసారి ఆత్మకూరు నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎటూ బరిలో ఉంటారు. ఆయన ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసి ఉన్నారు. రాజీనామా చేసిన సింపతీతో మరోసారి విజయం సాధించవచ్చన్నది ఈ తాజా మాజీ ఎంపీ ధీమా. ఇక మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

వెంకటగిరిపై అయిష్టత…..

ఈ పరిస్థితుల్లో జగన్ ఆనం రామనారాయణరెడ్డికి ఏం హామీ ఇచ్చారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆనం రామనారాయణరెడ్డికి ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి సీటు ఇవ్వాల్సిందే. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. అయితే వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అక్కడ మాజీముఖ్యమంత్రి నేదురుమిల్లి రామ్ కుమార్ వైసీపీలో చేరి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వెంకటగిరిలో ఆనం ఫ్యామిలీకి కూడా కొంత పట్టు ఉండటంతో ఆయనను అక్కడి నుంచే బరిలోకి దింపే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

ఆత్మకూరు ఇవ్వక తప్పదా?

ఆనం ఇక గట్టిగా కోరితే ఆత్మకూరు నియోజకవర్గం ఇవ్వకతప్పదంటున్నారు. మేకపాటి కుటుంబం పార్టీ పట్ల విశ్వసనీయతతో ఉన్నప్పటికీ ఆనం బలాన్ని, బలగాన్ని విస్మరించలేమంటున్నారు వైసీపీలోని కొందరు నేతలు. అవసరమైతే మేకపాటి కుటుంబ సభ్యులకు జగన్ నచ్చ జెబుతారంటున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డిని తప్పించి వేరే నియోజకవర్గాన్ని మార్చడం ఒక ఆలోచనగా ఉందని అంటున్నారు. మరి ఇందుకు మేకపాటి ఫ్యామిలీ అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. వెంకటగిరి నియోజకవర్గం నుంచి అయితే ఆనంకు దాదాపు కన్ ఫర్మ్ అయినట్లేనట. కాని ఆనం ఇందుకు అంగీకరించారా? జగన్ ఆనం పెట్టిన షరతులను ఒప్పుకుంటారా? ఆనం పార్టీలో చేరేలోపు నియోజకవర్గంపైనా స్పష్టత వస్తుందంటున్నారు. ఎటువంటి హామీ లేకుండా ఆనం ఎందుకు చేరతారని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఆనం చేరికతో నెల్లూరు జిల్లాలో వైసీపీ బలపడుతుందన్నది ఎంత వాస్తవమో…. విభేదాలు నేతల మధ్య తలెత్తుతాయన్నది అంతే నిజం. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*