ప్చ్….ఆనం ఎలాగుండేవారు…?

ఆనం రామనారాయణరెడ్డి. దశాబ్దాల పాటు రాజకీయాలు ఏలిన చరిత్ర కలిగిన కుటుంబం. ఏరోజూ టిక్కెట్ల కోసం ఎదురుచూడని పరిస్థితి ఆనం ఫ్యామిలీది. అడక్కుండానే….టిక్కెట్లు వచ్చాయి. నియోజకవర్గం మారినా ఎటువంటి సందేహాలు లేకుండా నేరుగా సీటు దక్కించుకున్న ఘనత ఆనం కుటుంబీకులది. అటువంటి ఆనం రామనారాయణరెడ్డి కొంతకాలంగా టిక్కెట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు దశాబ్దకాలం ఆనం సోదరులు నెల్లూరు రాజకీయాలను ఏలారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగానూ పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి తాను ఒకరికి టక్కెట్ ఇప్పించారే తప్ప తాను ఏనాడూ అధిష్టానం వద్దకు బిఫారం ఇవ్వాలని ప్రయత్నించలేదు.

కాంగ్రెస్ ను వీడిన తర్వాత….

కాని కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారిన తర్వాత ఆనం సోదరులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆనం వివేకానంద రెడ్డి మరణంతో ఆనం రామనారాయణరెడ్డి ఒక్కరే రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఆనం రామనారాయణరెడ్డిని నియమించినా అక్కడ ఆయన మాట చెల్లుబాటు కాలేదు. ఆత్మకూరులో తన క్యాడర్ ను పటిష్టం చేసుకునేందుకు ఆనం చేసిన ప్రయత్నాలకు ఎక్కడిక్కకడ టీడీపీ నేత కన్నబాబు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు.

మంత్రులతో విసిగిపోయి…

టీడీపీ నేత కన్నబాబుకు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ మద్దతు ఉండటంతో ఆనం నిస్సహాయంగానే చూస్తూ ఉండిపోయారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. తనకు వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం టిక్కెట్ వస్తుందన్న ఆశకూడా ఆనంకు లేదు. దీంతో ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. వైసీపీలో చేరి మరోసారి తన రాజకీయ జీవితాన్ని మెరుగుదిద్దుకోవాలని భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ తో కలసి నప్పుడు కూడా ఆనం రామనారాయణరెడ్డికి టిక్కెట్ పై స్పష్టమైన హామీ లభించలేదు. తాను బేషరతుగానే పార్టీలో చేరబోతున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు.

ఆత్మకూరు ఆత్మీయ సమావేశంలో…….

వచ్చే నెల 2వతేదీన ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరబోతున్నారు. ఇందులో భాగంగా ఆనం ఆత్మకూరు నియజకవర్గ సన్నిహితులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వారి నుంచి వచ్చిన మొదటి ప్రశ్న. ఆత్మకూరు సీటు మనకే కదా? అని. కాని దానికి ఆనం వద్ద సమాధానం లేదు. టిక్కెట్ల కోసం తాను పార్టీలో చేరడం లేదని, తన రాజకీయ భవిష్యత్తును జగన్ నిర్ణయిస్తారని, టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకున్నా వైసీపీలో చేరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పి ముగించారు. ఇలా ఒకప్పుడు అనేకమందికి టిక్కెట్ ఇప్పించిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనకు టిక్కెట్ ఎక్కడ? అన్నది కూడా తెలియని స్థితి ఉంది. దటీజ్ పాలిటిక్స్….!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*