ఆనం కోసం జగన్ రిస్క్ చేయనున్నారా?

నాకు గౌర‌వం, స‌ముచిత స్థానం ద‌క్క‌ని చోట ఉండ‌లేను.. ఇవి కొద్ది రోజులుగా టీడీపీ నేత ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అంటున్న మాట‌లు.. టీడీపీలో ఇక తాను కొన‌సాగ‌లేన‌ని ప‌దేప‌దే చేస్తున్న వ్యాఖ్య‌లివి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వైసీపీలో చేర‌డం దాదాపుగా ఖాయంగానే క‌నిపిస్తోంది. వ‌చ్చే నెల‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ జ‌యంతి రోజున ముహూర్తం ఖరారు కూడా అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. టీడీపీ త‌న‌కు గౌర‌వం ద‌క్క‌డం లేద‌నీ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి వైసీపీలోనై ద‌క్కుతుందా..? లేదా..? అన్న‌దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

భవిష్యత్ పై భరోసా ఇచ్చినా….

వైసీపీ అంటేనే.. జ‌గ‌న్.. జ‌గ‌న్ అంటేనే వైసీపీ.. అక్క‌డ ఆయ‌న చెప్పిందే వేదం.. అన్న‌ట్లుగా ఇప్ప‌టికే ప్ర‌చారం ఉంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆనం కోరుకున్న‌ది వైసీపీలో ద‌క్కుతుందా..? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యిస్తుంది. నిజానికి టీడీపీలో ఆనం బ్ర‌ద‌ర్స్ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. అప్ప‌ట్లోనే వివేకానంద‌రెడ్డి, రామ‌నారాయ‌ణరెడ్డిలిద్ద‌రూ పార్టీ మారుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇంత‌లోనే వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణించారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కూడా రామ‌నారాయ‌ణ‌రెడ్డిని ప‌రామ‌ర్శించారు. చాలాసేపు మాట్లాడారు. రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై భ‌రోసా కూడా ఇచ్చారు.

బుజ్జగింపులు పనిచేయలేదు…….

అదే స‌మ‌యంలో మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లు కూడా ఆనంను బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. కానీ.. ఇవేవీ ప‌ని చేయ‌లేదు. తాను టీడీపీని వీడ‌డంలో మ‌రో మాట‌లేద‌ని ఇటీవ‌ల ప‌లుమార్లు ఆనం బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా.. కొద్దిరోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన ప‌లువురు కీల‌క కాంగ్రెస్ నేత‌ల‌తో కూడా భేటీ అయ్యారు. దీంతో ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి వెళ్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం ప్ర‌కారం వైసీపీలోకి వెళ్లేందుకే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి మొగ్గుచూపుతున్నారు. అయితే ఆనంకు వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇచ్చిన హామీ ఏమిట‌న్న‌దే ఇప్పుడు అంద‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తోంది.

జగన్ ఇస్తారా?

పార్టీలో ఏదైనా కీల‌క ప‌ద‌వి ఇద్దామ‌న్నా.. అది ఎప్ప‌టికీ సాధ్యం కాద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి మాత్రం మాట ఇచ్చి ఉంటార‌నే టాక్ వినిపిస్తోంది. ఇక అంత‌కుమించి.. జ‌గ‌న్ హామీ ఇచ్చిఉండ‌ర‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌న్న అసంతృప్తి ఆనంలో బ‌లంగా ఉంది. అయితే ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచినా ఆనంకు మంత్రి ప‌ద‌వి దక్కుతుందా?లేదా? అన్నది ప్రశ్నార్థకమే.

పోటీలో చాలా మంది….

కోటంరెడ్డి, కాకాణి, మేక‌పాటి, ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వీరిని కాద‌ని ఆనంకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం చాలా చాలా క‌ష్టం. ఇక సీటు విష‌యంలోనూ ఆనంకు అంత స‌లువుగా వ‌చ్చే ప‌రిస్థితి లేదు. కోవూరులో ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి, నెల్లూరు రూర‌ల్‌లో కోటంరెడ్డి, సిటీలో అనిల్‌కుమార్‌, స‌ర్వేప‌ల్లిలో కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, ఆత్మ‌కూరు, ఉద‌య‌గిరిలో మేక‌పాటి ఫ్యామిలీ, కావ‌లిలో రామిరెడ్డి బ‌లంగా ఉన్నారు. ఆనంకు ప్ర‌స్తుతం ఉన్న ఆప్ష‌న్ ఏంటంటే వెంక‌ట‌గిరి ఒక్క‌టి మాత్ర‌మే. లేనిప‌క్షంలో జ‌గ‌న్ చాలా రిస్క్ చేసి మేక‌పాటి వాళ్ల‌లో ఒక‌రిని ప‌క్క‌న పెట్టి వాళ్ల‌కు ఉద‌య‌గిరి సీటు ఇచ్చి ఆనంకు ఆత్మ‌కూరు ఇవ్వాలి…అంత‌కు మించి ఆనంకు అక్క‌డ అద‌నంగా ద‌క్కేదేమి ఉన్న‌ట్టు క‌న‌ప‌డ‌డం లేదు. మ‌రి జ‌గ‌న్ సీటు కాకుండా ఇంకా ఏమైనా అద‌న‌పు హామీలు ఇస్తారా ? అన్న‌దే స‌స్పెన్స్‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆనం పార్టీ మార‌డం వ‌ల్ల వ‌చ్చే లాభ‌మేమిట‌నే ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఏదేమైనా.. టీడీపీలో ద‌క్క‌ని గౌర‌వం వైసీపీలోనైనా ఆనంకు ద‌క్కుతుందో చూడాలి మ‌రి.