ఆషాఢం వెళ్లింది….ఆనం జాడేదీ?

నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడం దాదాపు ఖరారయిపోయింది. ఆయన చేరికే ఖాయమని అందరూ భావించారు. అయితే ఆషాఢం అడ్డం రావడంతో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరలేదని, జగన్ సమక్షంలో కండువా కప్పుకోలేదని ఆనం సన్నిహితులు నిన్నమొన్నటి వరకూ చెబుతూ వస్తున్నారు. కాని ఆషాఢ మాసం వెళ్లిపోయినా ఆనం ముందుకు రాకపోవడంపై నెల్లూరు జిల్లాలో చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. ఆనం చేరాలంటే తన అనుచరులతో భారీగా తరలి వెళ్లి అక్కడ చేరాల్సి ఉంటుంది.

హడావిడి ఏదీ?

కాని ఇంత వరకూ ఆనం ఇంటివద్ద అటువంటి హడావిడి లేకపోవడంపై గుసగుసలు విన్పిస్తున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల జగన్ ను శంషాబాద్ విమానాశ్రయంలో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత లోటస్ పాండ్ లో కూడా సమావేశమయినట్లు వార్తలు వచ్చాయి. ఆనం చేరికకు జగన్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆనం కూడా అందుకు సిద్ధమయిపోయారు. అయితే తాజాగా జరిగిన పరిణామాలతో ఆనం మరోసారి ఆలోచనలో పడ్డారా? అన్న సందేహం ఆయన అనుచరుల్లోనూ వ్యక్తమవుతోంది.

అన్ని చోట్లా టైట్…..

ఆనం రామనారాయణరెడ్డి కుటుంబానికి నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో పట్టుంది. నెల్లూరు రూరల్, ఆత్మకూరులో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆత్మకూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు. ఆనం చేరతారని తెలిసి వారు కొంత మనస్థాపానికి గురయినా జగన్ సర్ది చెప్పడంతో ప్రస్తుతానికి తమ పని తాము చేసుకు పోతున్నారు. ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఆ నియోజకవర్గంలో కోటం రెడ్డికి పట్టుండటంతో పాటు ఇటీవలే ఆయన నియోజకవర్గమంతా పాదయాత్ర చేసి పట్టు పెంచుకునే ప్రయత్నంచేస్తున్నారు. ఇక్కడ సాధ్యం కాదు. ఇక కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కాదని ఆనంకు జగన్ ఇవ్వలేని పరిస్థితి.

ఆయన వస్తుండటంతో….

మిగిలిన వెంకటగిరి నియోజకవర్గంపైనే ఆనం ఆశలు పెట్టుకున్నారు. మానసికంగా వెంకటగిరి నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరికకు రెడీ అవ్వడంతో ఆనం వర్గం కొంత అయోమయంలో పడింది. ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమిల్లి ఫ్యామిలీకి గ్రిప్ ఉంది. దీంతో ఆయన చేరితే ఉన్న ఒక్క సీటుపై చివర వరకూ టెన్షన్ పడాల్సి వస్తుందన్నది ఆనం వర్గీయుల ఆవేదన. అందుకే ఆషాఢం వెళ్లినా…ఆనం వైసీపీ కండువా కప్పుకునేందుకు పెద్దగా ఉత్సాహం చూపడం లేదంటున్నారు. మరి జగన్ నుంచి పిలుపు వచ్చేంత వరకూ ఆనం వెయిట్ చేస్తారేమో….అన్నది ఒక అనుమానం. వైసీీపీలో ఆనం చేరేది ఖాయమే అయినా ఎప్పుడన్నదే ఇప్పుడు ప్రశ్న.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1