ఆనం..ఒంటరిగా…కొంత తగ్గి….?

ఆనం గతంలోలాగా కాదు. ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లుంది. అన్న వివేకానందరెడ్డి ఉన్న సమయంలో ఆనం రామనారాయణరెడ్డికి కొంత ధైర్యం ఉండేది. వివేకా అంతా చూసుకునే వారు. కానీ వివేకానందరెడ్డి మరణంతో ఆనం రామనారాయణరెడ్డి ఒంటరిగానే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి. ఇన్నాళ్లూ అన్న అండతో ఆయన తీసుకున్న నిర్ణయాన్నే రామ్ నారాయణరెడ్డి శిరసావహించారు. కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల పాటు ఉండి మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేగా వివేకానందరెడ్డి ఉండేవారు. రాష్ట్ర రాజకీయాలను రామనారాయణరెడ్డి చూసుకుంటే, జిల్లాలో పార్టీ నేతలను, పార్టీ క్యాడర్ విషయంలో వివేకానందరెడ్డి జాగ్రత్తలు తీసుకునే వారు. ఇలా ఆనం సోదరులు రాజకీయంగా నెల్లూరు జిల్లాను దశాబ్దకాలం పాటు ఏలిన విషయం తెలిసిందే.

టీడీపీలో చేరేటప్పుడు……

2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా పెద్దగా ప్రచారం దొరకలేదు. అప్పట్లో నేరుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో సోదరులిద్దరూ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడుతూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నప్పుడు అనుచరులతో గాని, టీడీపీ నేతలతో గాని ఆనం సోదరులు పెద్దగా భేటీ కాలేదు. అనుచరులతో మంతనాలన్నీ వివేకానంద రెడ్డి చూసుకునే వారు. కానీ వివేకానందరెడ్డి మరణించడం, ఆయన కుమారుడు ఇంకా రాజకీయాల్లో ఓనమాలు దిద్దుతుండటంతో అంతా తానే అయి చూసుకుంటున్నారు ఆనం రామనారాయణరెడ్డి.

అసంతృప్తులు తొలగించాలనుకుని…..

ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నప్పుడు సహజంగా చేరే పార్టీలో అసంతృప్తులు ఉంటాయి. ఆనం విషయంలో కూడా దీనికి అతీతం కాదు. ముఖ్యంగా ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరికను మేకపాటి సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనం పార్టీలోకి వస్తే తమ టిక్కెట్ కు ఎక్కడ ఎసరు పెడతారోనన్న ఆందోళన మేకపాటి ఫ్యామిలీలో ఉండటం సర్వసాధారణమే. అలాగే సీనియర్ నేత కావడంతో తమకు ప్రాధాన్యత తగ్గుతుందని కూడా అనుకుంటారు. వచ్చే ెనెల రెండో తేదీన ఆనం విశాఖలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు.

మేకపాటితో భేటీ…..

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆనం రామనారాయణరెడ్డి గత నాలుగు రోజులుగా అనుచరులతో సమావేశాలు జరుపుతున్నారు. టీడీపీని వీడటానికి గల కారణాలు, వైసీపీలో చేరాల్సిన అవసరం గురించి వారికి వివరిస్తున్నారు. దీంతో పాటు వైసీపీ నేతలను కూడా కలవడం విశేషం. నేరుగా జగన్ ను కలిసి చర్చలు జరిపి వచ్చిన ఆనం రామనారయణరెడ్డి జిల్లాలోని వైసీపీ నేతలతో సత్సంబంధాలను నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన చేరికను వ్యతిరేకిస్తున్న ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆయన రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. వచ్చేనెల 2వ తేదీన తన చేరిక సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మేకపాటిని ఆహ్వానించారు ఆనం. ఒకవిధంగా ఆనంకు ఆత్మకూరులో టిక్కెట్ ఇవ్వకుంటే ఆనం వర్గం కూడా మేకపాటికే పనిచేసే అవకాశాలున్నాయి. అలాగే తనకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా వైసీపీ నేతలు తన గెలుపునకు కృషి చేయాలని ఆనం భావిస్తున్నారు. అందుకే పార్టీలో చేరే ముందే ఆనం తనకు ఎదురయ్యే ఇబ్బందులను ముందే ఊహించి వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*