నేతి బీరలో నెయ్యి…ఏపీలో కంపెనీలు…!

ఏపీకి పెట్టుబ‌డుల వ‌ర‌ద పారుతుంద‌ని, యువ‌త‌కు భారీ సంఖ్య‌లో ఉద్యోగాలు వ‌స్తాయ‌ని.. సీఎం చంద్ర‌బాబు స‌హా ఆయ‌న కుమారుడు లోకేష్ ఎక్క‌డిక‌క్క‌డ వెల్ల‌డిస్తున్నారు. బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. తాము త‌ప్ప ఏపీకి దిశానిర్దేశం చేసే నాయ‌కులు లేర‌ని కూడా అంటున్నారు. అయితే, వారు చెబుతున్న మాట‌ల‌కు కార్య‌రూపం దాలుస్తున్న కార్య‌క్ర‌మాల‌కు పొంతన ఉండ‌డం లేద‌న్న‌ది అక్ష‌ర స‌త్యం. బాబు నాలుగేళ్ల పాల‌న‌లో 13 దేశాల్లో చ‌క్క‌ర్లు కొట్టారు. పెద్ద పెద్ద కంపెనీల‌తో మాట్లాడారు. ఎక‌రం భూమిని కేవ‌లం ఒక్క రూపాయి లీజుకే ఇస్తామ‌ని, ప‌న్న‌ుల్లో రాయితీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. నాలా ప‌న్ను వంటి కీల‌క చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ను సైతం చేశారు.

ఏవీ ఆ కంపెనీలు…..?

అయినా.. నేడు ఎన్నిక‌లు ముసురుకొస్తున్న వేళ ఏపీ ప్ర‌జ‌ల‌కు చూపించేందుకు ప‌ట్టుమ‌ని నాలుగు కంపెనీలు కూడా ఏపీలో కార్య‌క‌లాపాలు ప్రారంభించిన దాఖ‌లా లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. 2017లో జరిగిన దావోస్‌ సదస్సులోనూ ఇదే అంశంపై చంద్రబాబు చర్చలు జరిపి ఆ దేశ బృందాన్ని ఏపీకి రప్పించారు. కానీ, అవేమీ ఫలప్రదం కాలేదు. మరోవైపు.. ఈ సంస్థ 2012లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, మధ్యలోనే ఆగిపోయింది.

రెండేళ్లుగా చర్చలతోనే….

ఇప్పుడు చంద్రబాబు అదే సంస్థతో రెండేళ్లుగా చర్చలు జరుపుతున్నారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ కోసం సింగపూర్‌ వెళ్లి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు అక్కడికెళ్లినా పెట్టుబడులు శూన్యం. సింగపూర్‌లోని సెంటోసా టూరిజం స్పాట్‌లా విజయవాడలోని భవానీ ద్వీపాన్ని మార్చేస్తామని ఆ దేశం వెళ్లినప్పుడు ప్రణాళికలు రూపొందించినా ఇప్పటివరకూ దానిపై అడుగు ముందుకుపడలేదు. అక్కడి నుంచి పెట్టుబడులు తేకపోగా రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగే రీతిలో ఆ దేశ కంపెనీలకు అప్పగించడంపై దుమారం రేగింది.

ఎక్కడకు వెళితే…..

జపాన్‌కు వెళ్లి ఏమీ సాధించకపోగా మన విద్యాలయాల్లో జపాన్‌ భాషను ప్రవేశపెడతామని ప్రకటించారు. చైనా పర్యటనకు వెళ్లి షాంఘైలా అమరావతి నిర్మిస్తామని, జపాన్‌ వెళ్లినప్పుడు టోక్యోలాంటి రాజధాని నిర్మిస్తామని ప్రకటనలు చేశారు. అమెరికా పర్యటనకు వెళ్లి విశాఖపట్నానికి టెంపుల్‌టన్‌ సంస్థను తీసుకొస్తామని, రాష్ట్రంలో ఏరో సిటీ నిర్మిస్తామని చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో దుబాయ్‌ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మళ్లీ మొన్న ఫిబ్రవరిలో వెళ్లారు. భాగస్వామ్య సదస్సు ద్వారా పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటనకు వెళ్లినట్లు చెప్పారు. మొత్తంగా ఏపీకి విదేశాలకు చెందిన కంపెనీలు హామీల పెట్టుబ‌డులు పెట్టాయే కానీ, ఆచ‌ర‌ణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోయాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇక్క‌డ రాజ‌కీయ అస్థిర‌త లేదా.. రాజ‌ధాని లేక‌పోవ‌డం వంటి కీల‌క ప‌రిణామాలు, అదేవిధంగా కేంద్రంతో క‌య్యం వంటివి స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఈ పెట్టుబ‌డులు వ‌చ్చే దెన్న‌డు.. బాబు వ్యూహం ఫ‌లించేదెప్పుడు?!! మిలియ‌న్ డాలర్ల ప్ర‌శ్న‌లంటే.. ఇవే..!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*