పటాస్…..!!

pawankalyan chandrababunaidu ysjaganmohanreddy

రాజకీయ సమీకరణల్లో ప్రత్యర్థుల బలాన్ని హరించివేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఒకటికి ఒకటి చేరిస్తే రెండు అవుతుందనే సాధారణ గణితం. రాజకీయాల్లో అదే పదకొండు కావచ్చు. సున్నాగానూ మారవచ్చు. పొలిటికల్ సైకాలజీ లెక్కలకు అంతుచిక్కదు. గాలివాటం బాగున్నప్పుడు ఎటువంటి ఇంధనం అవసరం లేకుండానే గమ్యానికి చేరిపోవచ్చు. ఎదురుగాలి వీస్తున్నప్పుడు ఎంతగా ప్రయత్నించినా గమ్యానికి కూతవేటు దూరంలోనే నిలిచిపోవాల్సి రావచ్చు. మనిషి భావోద్వేగాలు, భావనలతో ముడిపడిన మానసిక శాస్త్రం కావడంతో రాజకీయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని నాయకులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సెంటిమెంటును రెచ్చగొడుతుంటారు. యాంటీ సెంటిమెంటును ప్రత్యర్థులకు అంటగడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు ఈ దిశలోనే వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రత్యర్థులందర్నీ ఒకే గాటన కట్టి ప్రజలకు ఆ కూటమి వ్యతిరేకమనే ముద్ర వేసే పనిలో పడ్డారు అధికారపార్టీ నాయకులు. ప్రజాప్రయోజనాలకు అధికారపార్టీ ప్రబల శత్రువుగా నిరూపించే పనిలో పడ్డారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు. ఈ రెంటికీ తామే ప్రత్యామ్నాయం అంటోంది మూడో పక్షం.

పంఖా పంతం..

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ చరిత్రలో అత్యధిక దూరం నడిచిన పాదయాత్రికునిగా రికార్డు స్రుష్టించారు. మళ్లీ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా జనసేనతో కలిసి వెళితే బాగుంటుందని చాలా మంది పార్టీ శ్రేయోభిలాషులు సూచించారు. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతారు. అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలిపోతే మళ్లీ టీడీపీకి లబ్ధి చేకూరుతుందేమోననే సందేహాలూ ఉన్నాయి. అందుకే వైసీపీ, జనసేన కలవాలనేది ఆ రెండు పార్టీల శ్రేయోభిలాషుల ఆకాంక్ష. ఈ వాదనలను పటాపంచలు చేస్తూ సుస్పష్టంగా తేల్చి చెప్పేశారు జగన్. గతంలో జనసేన అభిమానులంతా కలిసికట్టుగా టీడీపీకి పనిచేశారు. ఓట్లు వేశారు. ఇప్పుడు పవన్ విడిగా పోటీ చేస్తే టీడీపీకే చిల్లు పడుతుంది తప్ప తమకు ఎటువంటి నష్టమూ లేదని చెప్పేశారు. దీనివల్ల పార్టీ క్యాడర్ లో గందరగోళానికి తావుండదు. కనీసం 18 నుంచి 20 సీట్లలో వైసీపీకి, జనసేనకు మధ్య అవగాహన ఉంటుందనే ప్రచారం విస్త్రుతంగా సాగింది. ఎంపీ స్థాయి నాయకులు సైతం ఈవిషయాన్ని ధ్రువీకరిస్తూ ప్రకటనలు చేశారు. దీనివల్ల లోపాయికారీగా ఏదో జరుగుతోందనే అనుమానాలు ఏర్పడ్డాయి. వీటికి చెక్ పెట్టకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని గ్రహించిన జగన్ పాదయాత్ర ముగింపుతోపాటే సర్దుబాట్ల రూమర్లకు సైతం చెక్ పెట్టేశారు.

గ్లాసు ..భద్రం..

పవన్ కల్యాణ్ ఎంత సిన్సియర్ గా ఉందామని చూస్తున్నా ఎవరూ పడనివ్వడం లేదు. బీజేపీ, మోడీ చెప్పినట్లు ఆడుతున్నారంటూ ముద్ర వేసే ప్రయత్నం చేశారు, చేస్తున్నారు చంద్రబాబు. నిజానికి ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ , హోదా కావాలంటూ ఏపీ విషయంలో తొట్టతొలుత గట్టిగా మాట్లాడింది జనసేనాని మాత్రమే. వైసీపీ కూడా ప్రత్యేక హోదా డిమాండుకు కట్టుబడి ఉన్నప్పటికీ కేంద్రం పట్ల కఠినంగా మాట్లాడటానికి సాహసించలేదు. ఇంత చేసినా ఇప్పుడు స్టాండ్ మార్చుకున్న టీడీపీ జనసేనను బలహీనపరిచే క్రమంలో భాగంగా బీజేపీతో అంటుకలిపేసింది .అదేసమయంలో మరోవైపు ఫీలర్లు వదలడం ద్వారా టీడీపీ, జనసేన మళ్లీ కలుస్తాయనే సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇది జనసేనను పూర్తిగా దెబ్బతీసే ఎత్తుగడ. టీడీపీ వర్సస్ వైసీపీ గానే రాజకీయ ముఖచిత్రం ఉంటే అడ్వాంటేజ్ అన్న భావనతో టాక్టికల్ గా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. వామపక్షాలతో కలిసి నడిచేందుకు సిద్ధమై ముందుకు వెళుతున్న పవన్ , బీజేపీతో అంటకాగే అవకాశాలు అంతంతమాత్రమే. టీడీపీకి వ్యతిరేకంగానే పవన్ ప్రజల్లోకి వెళుతున్నారు. అందువల్ల ఆ పార్టీతోనూ కలిసేందుకూ ఆస్కారం లేదు. ఒకవేళ అలా జరిగితే అది జనసేనకు ఆత్మహత్యాసద్రుశమవుతుంది. పార్టీ పూర్తిగా మునిగిపోతుంది. వైసీపీ తో కలిసి గెలుపు సాధించినా అది జగన్ ఖాతాలోకే వెళ్లిపోతుంది. జనసేన డమ్మీగా మిగిలిపోతుంది. అందువల్ల వైసీపీ పొత్తునూ ఊహించలేం. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఒంటరిగా వెళ్లి తన బలాన్ని నిరూపించుకోవడకమొక్కటే జనసేనకు ఏకైక చాయిస్. వేరే ఆప్షన్లు లేవు.

సైకిల్ డ్యూయల్…

ప్రభుత్వ వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు చక్కగా పసిగట్టారు. అది తెలుగుదేశం పార్టీపై ప్రభావం చూపకుండా చూసుకోవడమెలా? అన్నదే అంతుచిక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని, జగన్ ను నిందించినంతమాత్రాన సానుకూల వాతావరణం ఏర్పడదు. బీజేపీతో నాలుగేళ్లు కలిసి నడవడం, ప్రతిసందర్భంలోనూ ప్రధానిని ఆకాశానికి ఎత్తడం వంటి చర్యలను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ప్రత్యేక హోదా విషయంలోనూ మొదట్నుంచీ దృఢమైన వైఖరి తీసుకోకపోవడంపైనా ఇంకా మీడియాలో నలుగుతూనే ఉంది. ఈకారణాల వల్లనే మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ టీడీపీకి రావాల్సినంత మైలేజీ రావడం లేదు. తెలుగుదేశాన్ని ఎన్నుకుంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం సహకరిస్తుందనే భావన వ్యాప్తిలోకి తెచ్చే యత్నాలు చేస్తున్నారు. కాంగ్రెసుతో మైత్రి అందులో భాగమే. రాజధాని, పోలవరం నిర్మాణ పనులను సైతం తాజాగా వేగవంతం చేశారు. పనులన్నీ సగంలో ఉన్నాయి. మరోసారి టీడీపీకి అవకాశమిస్తే తప్ప రాష్ట్రంలో ప్రగతి మధ్యలో ఆగిపోతుందన్న భావనకూ ప్రాతిపదిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ,జనసేన,బీజేపీలను ప్రగతినిరోధకులుగా ప్రజల ముందు దోషులుగా నిలిపే ప్రచారానికి పెద్ద ఎత్తున సభలను నిర్వహిస్తున్నారు. రకరకాలుగా అసెస్ చేసుకోవడంలో ఏపీ ప్రజలను తక్కువగా చూడలేం. అందువల్లనే ఈ ప్రచారం పూర్తిగా ఫలితాలు ఇస్తుందని టీడీపీ నాయకులు సైతం విశ్వాసాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*