దామోద‌రకు విజయం దరిచేరేనా..?

కాంగ్రెస్ పార్టీలో 2014కి ముందు వెలుగు వెలిగిన ముఖ్య నేత‌ల్లో దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ ఒక‌రు. ఆయ‌న ఉమ్మ‌డి రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రి గా ప‌నిచేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక కూడా దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ కాంగ్రెస్ పార్టీలో, ఒక‌వేళ అధికారంలోకి వ‌స్తే ప్ర‌భుత్వంలోనూ కీల‌క‌పాత్ర పోషిస్తార‌ని అంద‌రూ అంచ‌నా వేశారు. కానీ, సీన్ రివ‌ర్స్ అయ్యింది. తెలంగాణ తెచ్చిన క్రెడిట్ తో ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్ కి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. ముఖ్యంగా మెద‌క్ జిల్లాలో ఒక్క స్థానం త‌ప్పించి మిగ‌తా అన్నింటిలో టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరింది. అయితే, ఎస్సీ రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఆందోల్ లో దామోదర రాజ‌నర్సింహ్మ‌ను ఓడించ‌డానికి టీడీపీ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన బాబుమోహ‌న్ ను కేసీఆర్ పోటీ చేయించారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ పై 3,291 ఓట్లు స్వ‌ల్ప ఆధిక్యంతో విజ‌యం సాధించారు.

దామోద‌ర ప‌క్కా అనుకోగా…

దీంతో దామోద‌ర రాజ‌నర్సింహ్మ ఆశల‌న్నీ రివ‌ర్స్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. పైగా స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌మి ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టింది. అంత‌కుముందు రాష్ట్ర స్థాయిలో చురుగ్గా తిరిగిన ఆయ‌న పార్టీలో కూడా ఎక్కువ‌గా యాక్టీవ్ గా లేరు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించి మ‌ళ్లీ పున‌ర్వైభ‌వం తెచ్చుకోవాల‌ని సంక‌ల్పంతో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేసుకున్నారు. ఓట‌మికి కార‌ణాలను విశ్లేషించుకుని మ‌ళ్లీ ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బాబూ మోహ‌న్ ప‌నితీరు కూడా దామోద‌ర‌కు కొంత క‌లిసి వ‌చ్చింది. బాబుమోహ‌న్‌పై నియోజ‌క‌వ‌ర్గంలో కొంత వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. దీంతో ఈసారి అదికూడా క‌లిసి వచ్చి దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ విజ‌యం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు.

నేను లోకల్ అంటున్న టీఆర్ఎస్ అభ్య‌ర్థి…

దామోద‌ర‌పై టీఆర్ఎస్ క‌చ్చితంగా గెల‌వాల‌నే ఉద్దేశ్యంతో ఉన్న కేసీఆర్ బాబుమోహ‌న్ పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను గ్ర‌హించారు. స్వంత జిల్లా కావ‌డంతో ఆందోల్ నియెజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితి ఆయ‌న‌కు పూర్తిగా తెలుసు. అందుకే అభ్య‌ర్థిని మార్చారు. అసెంబ్లీ ర‌ద్దు త‌ర్వాత ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల లిస్ట్ లో బాబుమోహ‌న్ స్థానంలో జ‌ర్న‌లిస్టు చంటి క్రాంతి కిర‌ణ్ కు అవ‌కాశం క‌ల్పించారు. క్రాంతి కిర‌ణ్ మొద‌ట కాంగ్రెస్ పార్టీలో ప‌నిచేశారు. జెడ్పీటీసీగా కూడా గ‌తంలో ఉన్నారు. దీనికి తోడు ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నఏ ముంద‌స్తు వ్యూహంతో ఆయ‌న క్రాంతిసేన పేరుతో నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

స్థానికత అంశాన్ని……

ఇక స్థానిక‌త అంశాన్ని కూడా క్రాంతి కిర‌ణ్ ప్ర‌చారానికి బాగా వాడుకుంటున్నారు. తాను లోక‌ల్ అని, ఇన్నేళ్లుగా నాన్ లోక‌ల్ కి అవ‌కాశం వ‌స్తున్నందున ఈసారి లోక‌ల్ అయిన త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇక స్థానికం మంచి ప‌ట్టు ఉన్నా దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి విష‌యంలో వెనుక‌బ‌డ్డార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో కొంత ఉంది. మొత్తానికి ఈసారైనా గెలిచి మ‌ళ్లీ స్టేట్ పాలిటిక్స్ లో కీరోల్ పోషించాల‌ని దామోద‌ర ఆశిస్తుంటే… ఎమ్మెల్యేగా ఎన్నికై మొద‌టిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని క్రాంతికిర‌ణ్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. మ‌రి, ఎవ‌రి ఆశ‌లు నెర‌వేరుతాయో చూడాలంటే మ‌రి కొన్ని నెల‌లు ఆగాల్సిందే.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*