అంజన్న..హైదరా’బాద్‘షా అయ్యేనా..?

గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తేరుకోలేని దెబ్బకొట్టింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఇక్కడ ఆ పార్టీ ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్నికల ముందు వరకు దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, ముఖేష్ గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, విష్ణు వర్థన్ రెడ్డి వంటి వారితో బలంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల్లో మాత్రం చిత్తయింది. ఇంచుమించు అన్ని స్థానాల్లో మూడు లేదా నాలుగో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరీ ఘోరంగా ఓడింది. మొత్తం 150 స్థానాల్లో కేవలం రెండే స్థానాలు గెలిచింది. అవి కూడా శివార్లతో, అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ తోనే గెలిచారు. అయినా, వెంటనే స్పందించని ఆ పార్టీ ఎన్నికలకు సంవత్సరం ఉందనగా తీరిగ్గా తేరుకుంది. హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకే హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను నియమించింది.

చతుర్మఖ పోటీని తట్టుకునేలా..

హైదరాబాద్ లో పార్టీకి పూర్వవైభవం తెవాలనే లక్ష్యంతో అంజన్ కుమార్ యాదవ్ ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే, నగరంలో పార్టీని వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం చేయడం అంత సులువు కాదు. ఆయనకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓటమికి కారణాలను పూర్తిస్థాయిలో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మొత్తం ఒకరకమైన రాజకీయ వాతావరణం ఉంటే హైదరాబాద్ లో మరోలా ఉంటుంది. పాతబస్తీలో ఎంఐఎం, మరికొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉంది. టీఆర్ఎస్ కూడా బలపడి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది. దీనికి తోడు టీడీపీ కూడా కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో ఈ అన్ని పార్టీలను ఎదుర్కొనేందుకు అంజన్ తగిన వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

సెటిలర్లను తమవైపు తిప్పుకునేనా..

గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం పాతబస్తీలో తన ప్రాబల్యం ఉన్న 7 సీట్లను గెలుచుకుంది. ఇక రాష్ట్ర విభజన ప్రభావంతో సెటిలర్లు కాంగ్రెస్ పై ద్వేషంతో బీజేపీ-టీడీపీ కూటమి వైపే నిలిచారు. దీంతో ఎక్కువ స్థానాల్లో ఈ కూటమే గెలిచింది. అయితే, ఇప్పుడు వీరి పొత్తు విచ్చిన్నం కావడంతో కాంగ్రెస్ కి ఒక అవకాశంగా కనిపిస్తోంది. సెటిలర్లను తమవైపు తిప్పుకుంటే నగరంలో కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంతవరకు ఎటువంటి ప్రయత్నాలూ చేయకున్నా, ఇప్పటికైనా గుర్తిస్తే మేలు. ఇక టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో బలంగానే ఉన్నా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై కొంత వ్యతిరేకత ఉంది. దీనిని ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అందిపుచ్చుకోవాలి. కానీ, ఇంతవరకు అలా జరగలేదు.

సమన్వయం కుదిరేనా..?

నగరంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకుల మధ్య నాలుగేళ్లుగా సమన్వయం లేదనే చెప్పాలి. ఇందుకు వారి నడుమ ఉన్న విభేదాలు కూడా కారణం. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్న ముఖేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వంటివారిని సమన్వయం చేసుకోవడం అంజన్ కుమార్ యాదవ్ ముందున్న అసలు సవాల్. ఇక గతంలో రంగారెడ్డి డీసీసీ, నగర పార్టీ మధ్య సరిహద్దు సమస్య ఉండేది. గ్రేటర్ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని శివారు నియోజకవర్గాలు మా పరిధిలో ఉంటాయంటే, మా పరిధిలో ఉంటాయనే పేచీ ఉండేది. ఈ పంచాయితీ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కొట్టుకునే వరకు పోయింది. అయితే, ఇప్పుడు కేవలం హైదరాబాద్ డీసీసీకి మాత్రమే అంజన్ నియోమించినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ సరిహద్దు గొడవ మాత్రం ఇక ఉండదు. తక్కువ పరిధి ఉంటే పార్టీని బలోపేతం చేసుకోవడం కూడా సులువు.

ఎంఐఎం హవా తగ్గించేనా..?

గత ఎన్నికల వరకు ఎంఐఎం, కాంగ్రెస్ కు మధ్య ఒక అవగాహన ఉండేది. ఎంఐఎం బలంగా ఉన్న ఏడెనిమిది నియోజకవర్గాల్లో పార్టీని పటిష్ఠం చేసేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎలాగైనా ఎంఐఎం మద్దతు తమకే కదా అనే నమ్మకం, అంతర్గత ఒప్పందమే దీనికి కారణం. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో టీఆర్ఎస్ ఎంఐఎంకి దోస్త్ అయ్యింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పాతబస్తీలో పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ పైనే ఎంఐఎం శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీంతో ఆ కోపం పాతబస్తీలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు. కొందరు బలమైన ముస్లిం నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. అయితే, అది ఏమాత్రం సరిపోదు. పార్టీని పాతబస్తీలో కూడా బలోపేతం చేస్తేనే కొన్నైనా సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఇన్ని సవాళ్ల మధ్య బాధ్యతలు స్వీకరిస్తున్న అంజన్న ఏ మేరకు తన చక్రం తిప్పుతారో చూడాలి.