సింబల్ “సీన్” మార్చేస్తుందా….?

తమిళనాడులో సయితం ఉప ఎన్నికల కాక ఊపందుకుంది. ఇంకా ఎన్నికల కమిషన్ ఎన్నికలెప్పుడనేది నిర్ణయించకపోయినప్పటికీ ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఆ 20 నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. ఇటీవల మద్రాస్ హైకోర్టు తీర్పు తో అనర్హత వేటు పడిన దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో పాటు ఇటీవల మరణించిన కరుణానిధి, ఏకే బోస్ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి. లోక్ సభ ఎన్నికలతో పాటే ఈ ఉప ఎన్నికలు ఉండేలా అధికార పార్టీ ప్రణాళిక రచిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఈ శాసనసభ నియోజకవర్గాలపై పెద్దగా దృష్టి సారించవని, పార్లమెంటు నియోజకవర్గాలపైనే ఎక్కువ దృష్టి పెడతారని భావిస్తున్నాయి.

కొత్త నేతలతో అధికార పార్టీ…..

అయితే ఇప్పుడు అధికార అన్నాడీఎంకే పార్టీకి ఈ 20 నియోజకవర్గాల్లో కొత్త నేతలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరూ దినకరన్ గూటికి చేరడంతో వారి స్థానంలో కొత్త లీడర్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రజాదరణ కలిగిన నేతలనే ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్ణయించారు. పూర్తిగా సర్వేల ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. పార్టీతో పాటు తమ పట్ల నమ్మకంగా ఉండే వారినే ఉప ఎన్నికల్లో బరిలోకి దించాలన్నది ఈ ఇద్దరి ఆలోచనగా ఉంది. తమకు రెండాకుల గుర్తు ప్లస్ అవుతుందని పళనిస్వామి, పన్నీర్ సెల్వం భావిస్తున్నారు.

పాత నేతలు..కొత్త గుర్తు…..

ఇక దినకరన్ వర్గానికి వస్తే ఆయన కొత్త పార్టీ తోనే ఉప ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలే మళ్లీ అభ్యర్థులుగా బరిలోకి దింపినా ఇక్కడ గుర్తు సమస్య దినకరన్ ను వేదిస్తోంది. అందుకే తాను గతంలో ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రెషర్ కుక్కర్ గుర్తును తమ పార్టీ సింబల్ గా అందరికీ కేటాయించాలని దినకరన్ కోరనున్నారు. తన వెంట వచ్చిన 18 మందిని తిరిగి ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత దినకరన్ పైనే ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా పార్టీ నేతలకు ఆయనపై నమ్మకం సడలే ప్రమాదముంది. అందుకోసం ఉప ఎన్నికలు జరిగే 20 చోట్లా తమ అభ్యర్థులకు ప్రెషర్ కుక్కర్ గుర్తును కేటాయిస్తే ప్రచారం కూడా సులువవుతుందని, అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేలపై సానుభూతి ఉంటుందని టీటీవీ దినకరన్ భావిస్తున్నారు.

ఓట్ల చీలికతో……

ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే విషయానికొస్తే ఈ 20 చోట్ల జరిగే ఉప ఎన్నికలు కూడా ఆ పార్టీకి ప్రతిష్టాత్మకమే. ఇప్పటికే డీఎంకే అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ పై ఒక అపప్రధ ఉంది. ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను స్టాలిన్ గెలిపించుకోలేకపోయారని ఆయన సోదరుడు ఆళగిరి ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో పట్టు మరింత సాధించాలంటే ఈ ఉప ఎన్నికలకు స్టాలిన్ కు కూడా కీలకమే. అయితే రెండాకుల గుర్తు మీద కొత్త అభ్యర్థులు, కొత్త గుర్తు మీద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు బరిలోకి దిగుతుండటంతో తనకు కలసి వస్తుందని స్టాలిన్ భావిస్తున్నారు. వారిద్దరూ ఓట్లు చీల్చుకుంటే తమకు లాభమని లెక్కలు వేస్తున్నారు. మొత్తం మీద ఎప్పుడు జరుగుతాయో తెలియని 20 శాసనసభ నియోజకవర్గాలపై ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*