
ఎన్నికల కమిషన్ ఇంకా స్పష్టత ఇవ్వకముందే తమిళనాడులో రాజకీయ పార్టీలు ఉప ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించాయి. అధికార అన్నాడీఎంకే ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనుంది. ఇప్పటికే 20 నియోజకవర్గాలకు సంబంధించి బాధ్యులను ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు నియమించారు. మంత్రులకు కొన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించారు. తమిళనాడులో మొత్తం 20 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో తిరువారూర్, అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎకే బోస్ మృతితో తిరుప్పరకుండ్రం నియోజకవర్గాలతో పాటు దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.
ఎన్నికల కమిషన్ నిర్ణయంపైనే….?
దీనిపై మద్రాస్ హైకోర్టులో కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. మద్రాస్ హైకోర్టు ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని, అందుకు సంబంధించి అఫడవిట్ దాఖలు చేయాలని ప్రశ్నించింది. దీనిపై ఎన్నికల కమిషన్ హైకోర్టుకు అఫడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఈసీ ఎన్నికలకు సన్నద్ధమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే కేవలం కరుణానిధి, ఎకే బోస్ లు ప్రాతినిధ్యం వహించిన రెండు స్థానాలకే ఎన్నికలు నిర్వహిస్తారా? లేక 20 శాసనసభ నియోజకవర్గాలకు కలిపి ఒకేసారి నిర్వహిస్తారా? అన్నది మరో వారం రోజుల్లో తేలనుంది.
కూటమితో కలసి…..
ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ ఉప ఎన్నికలకు ఇప్పటికే సిద్ధమయ్యారు. కలసికట్టుగా ఉప ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికల కంటే ముందు ఈ ఉప ఎన్నికలు వచ్చినా కూటమితోనే పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు మిత్ర పక్ష పార్టీలతో స్టాలిన్ తరచూ సమావేశాలు జరుపుతున్నారు. పేరుకు లోక్ సభ ఎన్నికల గురించి చర్చిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా స్టాలిన్ పావులు కదుపుతున్నారు. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై కూడా ఆయన శ్రద్ధ పెడుతున్నారు. తన తండ్రి మరణంతో ఖాళీ ఏర్పడిన తిరువారూర్ లో కుమారుడు ఉదయనిధిని నిలపాలన్న యోచనలో స్టాలిన్ ఉన్నారు. ఉప ఎన్నికల ద్వారానే రాజకీయ అరంగేట్రం చేయించాలన్న భావనలో ఉన్నారు.
దినకరన్ కు, పళనికి……
ఇక ఈ ఎన్నికలు దినకరన్ కు జీవన్మరణ సమస్య. తనను నమ్మి వచ్చిన వారిని గెలిపించుకోకుంటే ఆయన వెంట భవిష్యత్తులో ఏ నేతా నిలబడరు. అందుకోసం 18 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఖరారయినందున అప్పుడే ఆ నియోజకవర్గాల్లో పర్యటనలను ప్రారంభించారు. అన్నాడీఎంకే, దినకరన్ లకే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో కనీస స్థానాలను దక్కించుకోకుంటే పళని ఇంటికి పోక తప్పదు. దీంతో అధికార అన్నాడీఎంకే నేతలు ఇప్పటి నుంచే ఆ 18 నియోజకవర్గాల్లో చెమటోడుస్తున్నారు. ఇక మక్కల్ నీది మయ్యమ్ తరుపున ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని కమల్ హాసన్ ప్రకటించడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. మొత్తం మీద తమిళనాట ఎన్నికల డేట్ రాకముందే ఆ వాతావరణం రాష్ట్ర మంతటా కన్పిస్తుండటం విశేషం.
Leave a Reply