తంబిల సత్తా తేలిపోతుంది….!

తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు లోక్ సభ ఎన్నికల కంటే ముందుగానే పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. లోక్ సభ ఎన్నికలపై ఇప్పటి వరకూ దృష్టి పెట్టిన అన్నాడీఎంకే, డీఎంకేలు ఇప్పుడు స్థానిక సంస్థల్లో తమ సత్తాను చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తమిళనాడులో దాదాపు రెండేళ్ల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. వివిధ కారణాలతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పాలన కుంటుపడి పోయిందని, ప్రత్యేక అధికారుల పాలనలో మరింత క్షీణించిపోయాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈ నెల 6వ తేదీన స్థానిక సంస్థల షెడ్యూల్ ను విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది.

రెండుగా చీలి…..

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. శశికళ వర్గం, పళని, పన్నీర్ వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి. ఇక డీఎంకే పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆ పార్టీ అధినేత కరుణానిధి వయోభారంతో ఉండటం, ఆసుపత్రి పాలవ్వడంతో ఆ పార్టీ కూడా చీలిక దిశగానే అడుగులు వేస్తుందంటున్నారు. కరుణానిధి కుమారులు ఆళగిరి, స్టాలిన్ ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. కరుణ స్టాలిన్ వైపు మొగ్గు చూపగా, ఆళగిరి మాత్రం పార్టీకార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కరుణానిధి ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో వీరి మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగే అవకాశముందంటున్నారు.

దినకరన్ సయితం…..

మరోవైపు టీటీవీ దినకరన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటున్నారు. తమవైపు అన్నాడీఎంకే శ్రేణులు ఉన్నాయన్న విషయం ఈ ఎన్నికలతో స్పష్టమవుతుందని ఆయన అంటున్నారు. తమిళనాడులో స్థానిక సంస్థల పదవికాలం 2016 అక్టోబరులోనే గడువు ముగిసింది. అయితే జయలలిత ఆస్పత్రి పాలు కావడం, తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి నెలకొనడంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగలేదు. మరోవైపు ముఖ్యమంత్రి పళనిస్వామి నిలదొక్కుకున్నారు. జయలలిత ఆశయాలను అమలుపర్చేందుకు ఆయన ఈ ఏడాదిన్నర కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కావేరీజలాల నదీ బోర్డును ఏర్పాటు చేయడం, మెట్టూరు డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వంటి అంశాలు తమకు సానుకూలంగా ఉన్నాయంటున్నారు. దీంతో తాము ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగుర వేయడం ఖాయమని చెబుతున్నారు.

ఎవరి ధీమా వారిది……

డీఎంకే కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిస్తే వచ్చే లోక్ సభ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ లాభపడవచ్చని అంచనా వేస్తోంది. అధికార పార్టీలో విభేదాలు, నాయకత్వ సమస్య తమ విజయానికి దోహదం చేస్తుందంటున్నారు. ఇక కొత్తగా మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టిన కమల్ హాసన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగే అవకాశముంది. రజనీకాంత్ మాత్రం ఇంకా పార్టీ ప్రకటించకపోవడంతో ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు. కమల్ హాసన్ పార్టీతో ఎవరికి నష్టమనేది ఈ ఎన్నికల ఫలితాలను బట్టి తెలిసి పోతుంది. మొత్తం మీద తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే, టీటీవీ దినకరన్ కు సవాల్ గా మారనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*